గల్లా జయదేవ్ గెలుపు..చెల్లదా..

Spread the love

హోరా హోరీగా జరిగిన మొన్నటి ఎన్నికలో వైసిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి పై గల్లా కేవలం 4200 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.

ఓట్ల లెక్కింపు సంద్భంగా గల్లా అండ్ కో రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను మ్యానేజ్ చేసుకుని గెలిచినట్లుగా ప్రకటన చేయించుకున్నట్లు వైసిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకు వారికున్న అనుమానం ఏమిటంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో 9 వేల బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రెజెక్ట్ చేశారు. ఆ 9 వేల పోస్టల్ బ్యాలెట్ల కవర్లపై సీరియల్ నెంబర్లు లేవన్నది రిటర్నింగ్ అధికారి వాదన. అందుకనే వాటన్నింటినీ రెజెక్టు చేశారు.

అయితే ఈ విషయమై కౌంటింగ్ రోజునే మోదుగుల, మంగళగిరి అభ్యర్ది ఆళ్ళ రామకృష్ణారెడ్డికి రిటర్నింగ్ అధికారికి పెద్ద వాగ్వాదమే జరిగింది. ఒకవైపు టిడిపి అభ్యర్ధి గల్లా మరోవైపు మెదుగుల, ఆళ్ళ ఎవరి వాదనలు వారు వినిపించారు. కవర్లపై సీరియల్ నెంబర్లు లేనంత మాత్రాన రెజెక్టు చేయాల్సిన అవసరం లేదన్నది మోదుగుల వాదన. రిటర్నింగ్ అధికారి నిర్ణయం ప్రకారం వాటిని రెజెక్టు చేయాల్సిందే అంటూ గల్లా పట్టుబట్టారు. దాంతో తన విచక్షణ అంటూ రిటర్నింగ్ అధికారి హోదాలో 9 వేలను పోస్టల్ బ్యాలెట్లను రెజెక్టు చేశారు.

అదే విషయమై మోదుగుల కోర్టులో కేసు వేయటానికి రెడీ అవుతున్నారు. కవర్లపై సీరియల్ నెంబర్లు లేవని రెజెక్టు చేయటం సరికాదని మోదుగుల అంటున్నారు. ఎందుకంటే, ఇదే విధంగా సీరియల్ నెంబర్లు లేకుండా వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను నరసరావుపేట, ఒంగోలుతో పాటు కృష్ణా జిల్లాలో చాలా చోట్ల లెక్కించారట.

గుంటూరు జిల్లాలోనే చాలా నియోజకవర్గాల్లో లెక్కించినపుడు ఒక్క గుంటూరు పార్లమెంటు పరిధిలోని పోస్టల్ బ్యాలెట్లను మాత్రమే రెజెక్టు చేయటం తప్పని మోదుగుల వాదన. రెజెక్టయిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కించే విధంగా కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటామని, గెలుపు తమదే అని వైసిపి వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రిటర్నింగ్ అధికారిని మ్యానేజ్ చేసుకుని గెలుపును ఏకపక్షంగా ప్రకటింప చేసుకున్నారని మోదుగుల కూడా అనుమానిస్తున్నారు. వైసిపి వర్గాలు చెబుతున్న ప్రకారమైతే అదే అనుమానం వస్తోంది. అందుకనే గల్లా ఎన్నికపై కోర్టులో కేసు వేసేందుకు వైసిపి నిర్ణయించింది. మరి కోర్టు ఏమంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *