లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్పులను కౌంట్ చేస్తారు. ఉదయం 11 గంటల వరకు ఫలితాలపై కాస్తా క్లారిటీ వచ్చే అవకాశముంది. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమికి పట్టం కట్టడంతో.. ప్రజా తీర్పు ఏవిధంగా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది.
లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన తొలివిడత ఎన్నికలు నిర్వహించగా.. మే 19వ తేదీన తుది విడత ఎన్నికలు జరిగాయి. మొత్తం 543 స్థానాలకు గాను తమిళనాడులోని వెల్లూరు సెగ్మెంట్‌కు ఎన్నిక రద్దయింది. దాంతో 542 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.
ఏడు దశలకు కలిపి పోలింగ్ 64.2 శాతంగా నమోదైంది. ఇక చాలా రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొన్నారని సమాచారం. బెంగాల్‌లో తప్ప ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదు దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.