*విద్యార్థుల ప్రతిభను కొలవాల్సిందే: కేంద్రం*
దిల్లీ: విశ్వవిద్యాలయాల్లో చివరి సెమిస్టర్ పరీక్షలు తప్పక నిర్వహించాలని వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలపై ఆరు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉద్ఘాటించింది. విద్యా సంవత్సరంలో విద్యార్థి ఎంతమేర నేర్చుకున్నాడనే విషయమై మూల్యాంకనం చేయడం అనేది..
విశ్వసనీయత, ఉద్యోగ అవకాశాలకు కీలకమైన అంశమని స్పష్టంచేసింది.
వివిధ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆఖరి సెమిస్టర్ పరీక్షలను జులైలో నిర్వహించాలని గతంలో సూచించిన యూజీసీ..
వాటిని సెప్టెంబరులోపు జరపాలని గతవారం మార్గదర్శకాలు జారీచేసిన సంగతి తెలిసిందే.
‘‘చివరి సెమిస్టర్ విద్యార్థులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని యూజీసీ మార్గదర్శకాలు పేర్కొనలేదు.
సెప్టెంబరు పూర్తయ్యేలోపు ముగించాలి. గడువులోగా తమకు వీలైనప్పుడు పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రాలు తేదీలు నిర్ణయించుకోవచ్చు.
మొత్తంగా పరీక్షలు ఉండకపోవడం అనేది సాధ్యమయ్యే పనికాదు’’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖలోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.