*ఔరా.. సోమ్‌పుర!*
*అయోధ్య రామమందిరం ఆకృతి ఈ కుటుంబానిదే*
*15 తరాలుగా ఆలయాలకు డిజైన్లు* *దేశ విదేశాల్లో 131 నిర్మాణాలకు రూపకల్పన*
అయోధ్యలో సర్వాంగ సుందరంగా.. అడుగడుగునా విశిష్టతలతో.. రామమందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5న అంగరంగ వైభవంగా భూమిపూజ చేయడానికి ట్రస్ట్ సర్వసన్నద్ధమవుతోంది. ఈ ఆలయానికి ఆకృతిని రూపొందించిన సోమ్‌పుర కుటుంబీకులది తరతరాలకూ వన్నె తరగని చరిత్ర..
నాడు సోమనాథ్, అక్షర్‌థామ్.. నేడు అయోధ్య రామమందిరం.. దేశంలోని ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతులను సోమ్‌పుర కుటుంబీకులే రూపొందించారు. ఇలాంటి నిర్మాణాల్లో 15 తరాలుగా ఈ కుటుంబీకుల అద్భుత నైపుణ్యం కనిపిస్తుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సోమ్‌పుర కుటుంబీకులు దేశ, విదేశాల్లో ఇంతవరకు దాదాపు 131 ఆలయాలను డిజైన్ చేశారు.
వీటిలో లండన్‌లోని స్వామినారాయణ్ ఆలయం కూడా ఒకటి. అమెరికాలోనూ కొన్ని ఆలయాలకు వీళ్లే ఆకృతులను రూపొందించారు. తాజాగా అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామమందిరాన్ని డిజైన్ చేసింది ఇదే కుటుంబానికి చెందిన 77 ఏళ్ల చంద్రకాంత్ సోమ్‌పుర; ఆయన కుమారులు నిఖిల్ సోమ్‌పుర (55), ఆశీష్ సోమ్‌పుర(49). వీరికి నిఖిల్ పెద్ద కుమారుడు కూడా సహకారం అందిస్తున్నారు. తన తాతతో కలిసి చంద్రకాంత్ భాయ్ సోమ్‌పుర గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి (స్వాతంత్య్రానంతరం జరిగిన పునర్నిర్మాణం) కూడా డిజైన్ చేశారు. తరతరాలుగా చేస్తున్న ఈ వృత్తిలో భాగంగా చంద్రకాంత్, బాల్యంలోనే తన తాత ప్రభాశంకర్ సోమ్‌పుర నుంచి ఆలయ ఆకృతులకు సంబంధించిన మెలకువలను నేర్చుకోవడం ప్రారంభించారు. వాస్తుశాస్త్ర విషయాలు సహా అనేకాంశాలను ఆయన ఔపోశన పట్టారు. శిల్ప శాస్త్రాలకు సంబంధించి ప్రభాశంకర్ 14 పుస్తకాలు రాశారు. ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. బిర్లా కుటుంబంతో కలిసి కూడా ఆలయాల నిర్మాణంలో ఈ కుటుంబం పాలు పంచుకుంది. వారే తమను విహెచ్‌పీకి చెందిన అశోక్ సింఘాల్‌కు పరిచయం చేసినట్లు ఆశీష్ చెబుతుంటారు. చంద్రకాంత్ ఇంటినే కార్యాలయంగా చేసుకుని పనిచేస్తూ తన కుమారులకు మార్గదర్శకం చేస్తున్నారు. నిఖిల్, ఆశీష్‌లే శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశాలకు హాజరవుతూ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయాలను చర్చిస్తున్నారు. ‘‘మేము చేసే డిజైన్లను నాన్న పరిశీలిస్తారు. తగిన సూచనలిస్తారు. ఒకేసారి 8 ఆలయ ప్రాజెక్టుల డిజైన్‌లను తయారుచేసే పనుల్లో ఉన్నాం. వీటిలో గుజరాత్‌లోని పావగఢ్ దేవస్థానం పని కూడా ఒకటి.’’ అని ఆశీష్ సోమ్‌పుర వెల్లడించారు. 1989 నుంచే రామ మందిరం ఆకృతిపై ఈ కుటుంబీకులు పనిచేస్తూ వచ్చారు. గత ఏడాది సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అనంతరం రామమందిరం నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచీ వీరు సంబంధిత ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నారు. ఎన్నోదఫాలుగా చర్చలు జరిగాయి. భారత్‌లో ఆలయాల నిర్మాణానికి ప్రధానంగా 3 రకాల శైలిలో ఆకృతులను రూపొందిస్తుంటారు. వాటిలో నాగర ఒకటి. ప్రఖ్యాత సోమనాథ్ ఆలయం కూడా ఇదే శైలిలోనే నిర్మితమైంది. కాగా అయోధ్యలో నిర్మితం కానున్న రామమందిరం గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ఆలయ పరిధి వృత్తాకారంలో ఉంటుంది. 30 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన రామమందిరం ఆకృతిలో తర్వాత కొన్ని మార్పులు చేశారు. రెండంతస్తులకు బదులు మూడంతస్తుల్లో నిర్మించనున్నారు. ఆలయం పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 360, 235, 161 అడుగులుగా నిర్ణయించారు. ప్రతిపాదిత రామ మందిరం మూల నిర్మాణాకృతిని అలాగే ఉంచారు. మూడో అంతస్తు నిర్మించడానికి నిర్ణయించడంతో ఎత్తు 33 అడుగులు పెరిగింది. 3 చోట్ల 5 గుమ్మటాలుంటాయి. –
*మూడంతస్తులు.. 366 స్తంభాలు* అయోధ్యలో రామ మందిరం ఆకృతిని ఉత్తర భారతదేశంలోని ప్రఖ్యాత నాగర శైలిలో రూపొందించారు. ఈ డిజైన్‌లోని మూలాలను తెలియజేసేలా మూడంతస్తుల్లో 366 స్తంభాలు ఉంటాయి. మొదటి అంతస్తులో 160, రెండో అంతస్తులో 132, మూడో అంతస్తులో 74 ఉంటాయి.
*యూపీలో భద్రత కట్టుదిట్టం* మహారాజ్‌గంజ్ (యూపీ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక, స్వాతంత్య్ర దినోత్సవం, ఇతరత్రా పండగల సీజన్ దృష్ట్యా ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భద్రత బలగాలు అప్రమత్తత ప్రకటించాయి. ముఖ్యంగా నేపాల్‌తో సరిహద్దు ఉన్న మహారాజ్‌గంజ్, సిద్ధార్థనగర్, బహ్రెయిచ్ వంటి జిల్లాల్లో తనిఖీలను ముమ్మరం చేశాయి. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో అదనపు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పోరస్ సరిహద్దు మీదుగా వస్తున్నవారి గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తనిఖీచేస్తున్నారు. సశస్త్ర సీమా బల్ శిబిరాల వద్ద, ప్రధాన రహదారులపై కెమెరాలు అమర్చారు. మోదీకి ముస్లిం మహిళల రాఖీలు రాఖీ పండగను పురస్కరించుకుని ప్రధాని మోదీకి, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు పంపడానికి అయోధ్యలో ముస్లిం మహిళలు సొంతంగా రాఖీలు తయారు చేస్తున్నారు. వాటిని పోస్టుద్వారా పంపించనున్నారు. రామాలయ వేడుక కోసం అనేకమంది ముస్లిం మహిళలూ ఉత్సాహంగా నిరీక్షిస్తున్నారు.
*న్యూయార్క్‌లో రాముడి చిత్రాల ప్రదర్శన*
న్యూయార్క్: రాముడి చిత్రపటాలను, ఆలయ త్రీడీ నమూనాను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆగస్టు5న ప్రదర్శించనున్నారు. చరిత్రాత్మక వేడుక జరిగేరోజు ఇక్కడ 17,000 చదరపు అడుగుల భారీ ఎల్‌ఈడీ తెరపై వీటిని ప్రదర్శిస్తారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు ‘జై శ్రీరాం’ అనే పదాలు హిందీ, ఆంగ్ల భాషల్లో ఈ తెరపై కనిపిస్తాయి. కొన్ని వీడియోలనూ ప్రదర్శిస్తారు.
*అయోధ్య రామాలయ అర్చకునికి కరోనా*
లఖ్‌నవూ: ఒకపక్క అయోధ్యలో రామాలయ శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఆలయ అర్చకుడు ప్రదీప్ దాస్‌కు కరోనా సోకినట్లు గురువారం తేలడం కలవరం రేకెత్తించింది. ప్రధాన అర్చకుడు సత్యేంద్రదాస్‌కు ఆయన శిష్యుడు. రామ్‌లల్లాలో వీరిద్దరితో పాటు మొత్తం నలుగురు నిత్యం సేవల్లో పాల్గొంటుంటారు. రామజన్మభూమి వద్ద బందోబస్తు విధుల్లో ఉంటున్నవారిలో 16 మంది పోలీసులకూ కరోనా పాజిటివ్ వచ్చింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.