*భారత్‌లో కరోనా: 24 గంటల్లో 21వేల కేసులు!*
*దేశంలో 18వేలు దాటిన కరోనా మరణాలు!*
*5రోజుల్లో లక్ష కేసులు నమోదు*
*నిన్న ఒక్కరోజే 20వేల మంది డిశ్చార్జి*
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొన్నిరోజులుగా నిత్యం 19వేల పాజిటివ్ కేసులు బయటపడుతుండగా తాజాగా ఈసంఖ్య 20వేలు దాటింది.
గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ బయటపడిన అనంతరం ఒక్కరోజులోనే ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి.
దీంతో దేశంలో కొవిడ్ బాధితుల సంఖ్య 6,25,544కు చేరింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 379మంది మృతిచెందారు.
గత కొన్నిరోజులుగా నమోదౌతున్న మరణాలతో పోల్చిచే కాస్త తగ్గాయి. శుక్రవారంనాటికి దేశంలో కరోనా వల్ల మరణించిన వారిసంఖ్య 18,213కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 3,79,893మంది కోలుకోగా, మరో 2,27,439మంది కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా నిన్న ఒక్కరోజే 20వేల మంది డిశ్చార్జి కావడం విశేషం.
*వారంలో 3వేల మరణాలు..* దేశంలో వైరస్ విజృంభణతో బాధితుల సంఖ్య పెరగడంతోపాటు మరణాల సంఖ్య ఎక్కువౌతోంది. గడిచిన వారంలోనే దేశంలో దాదాపు 3వేల మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్ బాధితుల రికవరీ రేటు దాదాపు 60శాతంగా ఉండగా మరణాల రేటు 2.6శాతంగా ఉంది.
గత నెలతో పోలిస్తే కరోనా మరణాల రేటు కాస్త తగ్గుతూ వస్తోంది. *తమిళనాడులో లక్షకు చేరువలో..* మహారాష్ట్ర అనంతరం తమిళనాడులో కొవిడ్ మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 4343పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరువయ్యింది. ఇప్పటివరకు 98,392పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో 1321మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక దేశంలో సంభవిస్తోన్న కరోనా మరణాల్లో దాదాపు 45శాతం ఒక్క మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 8,178కి చేరింది. కేసుల సంఖ్య లక్షా 86వేలు దాటింది.
ఇక దేశ రాజధానిలో 92,175 పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో 2864 మంది మృత్యువాతపడ్డారు. గుజరాత్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 33,913కు చేరగా వీరిలో ఇప్పటివరకు 1886 మంది చనిపోయారు.
ఇదిలా ఉంటే, ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. 27లక్షల కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా, 15లక్షలతో బ్రెజిల్, 6లక్షల 60వేల కేసులతో రష్యా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక కొవిడ్19 మరణాల్లో మాత్రం భారత్ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.