*ఆదాయపు పన్ను రిటర్నులకు సెప్టెంబరు 30 వరకు గడువు*
దిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) సమర్పించేందుకు గడువును మరో రెండు నెలలు పొడిగించి, సెప్టెంబరు 30 గా ప్రభుత్వం నిర్ణయించింది.
కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదార్లకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు 2020 జులై 31వరకు ఉండగా, ఇప్పుడు సెప్టెంబరు 30కి పొడిగించినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది.
2018-19 ఆర్థిక సంవత్సర రిటర్నులు (అసలు, సవరించిన) సమర్పించేందుకు ప్రభుత్వం గడువును పొడిగించడం ఇది మూడోసారి.
* 2020 మార్చి 31గా ఉన్న గడువును జూన్30కి పొడిగిస్తూ మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఈ గడువును జులై 31కి పొడిగించారు. ఇప్పుడు సెప్టెంబరు 30కి పొడిగించారు.