ఇన్ఫోసిస్‌ లాభం రూ.4,272 కోట్లు*

Spread the love

*ఇన్ఫోసిస్‌ లాభం రూ.4,272 కోట్లు* *ఆదాయంలో 8.5 శాతం వృద్ధి* *2020-21లో 2 శాతం ఆదాయ వృద్ధి అంచనా*

*దన్నుగా నిలిచిన భారీ ఆర్డర్లు*

దిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అంచనాలు మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.4,225 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.3,802 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం ఆదాయం రూ.21,803 కోట్ల నుంచి 8.5 శాతం వృద్ధితో రూ.23,665 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 సంక్షోభం ప్రభావం కంపెనీలపై పడింది. మార్చిలో భారతీయ ఐటీ కంపెనీలపై కొంత ప్రభావం చూపిన కరోనా, జూన్‌ త్రైమాసికంలో అధిక ప్రభావం చూపింది. అయితే ఇన్ఫోసిస్‌కు మాత్రం భారీ ఆర్డర్లు దన్నుగా నిలిచాయి. సమీక్షిస్తున్న త్రైమాసికంలో 1.74 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపింది.

డిజిటల్‌ ఆదాయం 25 శాతం పెరిగి 1.38 బిలియన్‌ డాలర్లు (మొత్తం ఆదాయం 44.5 శాతానికి సమానం)కు చేరింది.

*డాలర్ల ప్రాతిపదికన చూస్తే..:*

అమెరికా డాలర్ల రూపేణా కంపెనీ నికర లాభం 3.1 శాతం పెరిగి 564 మిలియన్‌ డాలర్లకు చేరింది. ఆదాయం మాత్రం గతేడాదితో పోలిస్తే 0.3 శాతం తగ్గింది. కానీ స్థిర కరెన్సీ ప్రాదిపదికన 1.5 శాతం వృద్ధి చెందింది. 2020-21లో స్థిర మారకంలో ఆదాయం 2 శాతం వరకు పెరగొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.

*వీసాల రద్దు ప్రభావం ఉండదు:*

జూన్‌ త్రైమాసికం నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,39,233గా ఉంది. వలసల శాతం 11.7 శాతంగా నమోదైంది. ఉద్యోగ ఆఫర్‌లు అందుకున్న 90 శాతం మంది ఇప్పటికే చేరారని, మిగిలిన వారు ఈ త్రైమాసికంలో చేరనున్నట్లు సీఓఓ ప్రవీణ్‌ రావు అన్నారు. హెచ్‌-1బీ వీసాలను రద్దు చేయడం అర్ధరహితమని అభిప్రాయపడ్డారు. స్థానిక నియామకాలపై దృష్టి పెట్టామని, కార్యకలాపాలపై వీసాల రద్దు ప్రభావం ఉండదని అన్నారు.

*6 శాతం పెరిగిన షేరు*

ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించడంతో ఇన్ఫోసిస్‌ షేరు రాణించింది. ఇంట్రాడేలో 8.27 శాతం పెరిగి రూ.848 వద్ద గరిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 6.16 శాతం లాభంతో రూ.831.45 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.20,563.41 కోట్లు పెరిగి రూ.3,54,127 కోట్లకు చేరింది.

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *