జనతా కర్ఫ్యూ Janata Karfu

MOdi
Spread the love

జనతా కర్ఫ్యూ

ఎవరూ బయటికి రావొద్దు

సామాజిక దూరం పాటిద్దాం

22న ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకూ

ఇళ్లలోనే ఉండి సంకల్ప బలం నిరూపిద్దాం

ప్రపంచ యుద్ధాలకు మించి కరోనా ప్రభావం

వైరస్‌ను ఎదుర్కోవడానికి అసాధారణ సంయమనం అవసరం

యావత్‌ జాతికి ప్రధాని మోదీ పిలుపు

దేశ వాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్‌ జాతి అప్రమత్తం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలకు ఆయన స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. ప్రపంచ యుద్ధాలకు మించిన ప్రభావాన్ని ఈ వైరస్‌ చూపుతోందని, ప్రజల సహకారం లేకపోతే భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో దీన్ని ఎదుర్కోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ మందులేని ఈ రోగం నుంచి రక్షించుకోవడానికి సామాజిక దూరం పాటించడమే అసలైన మందు అని పేర్కొన్నారు. అందుకు నాందిగా ఈనెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని కోరారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఉంటుందని, అందువల్ల వ్యాపారులు, ధనవంతులు తమ వద్ద పనిచేసే వారి వేతనాల్లో కోతపెట్టకుండా మానవతను చాటాలన్నారు.

కరోనాపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. సంకల్ప బలంతోనే సమష్టిగా ఈ మహమ్మారిని కట్టడి చేయగలమని స్పష్టంచేశారు. గురువారం రాత్రి ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. ప్రసంగ వివరాలు ఆయన మాటల్లోనే…

నాకు ఏమీ కాలేదన్న భావనతో మార్కెట్లకు వెళ్లడం, రోడ్లమీద తిరగడం మంచిదికాదు. సామాజిక దూరం పాటించడం అవసరం.

ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, యువజన సంఘాలు, పౌర సమాజాలు, క్రీడా సంఘాలు, ధార్మిక, సామాజిక సంస్థలన్నీ జనతా కర్ఫ్యూపై విస్తృత ప్రచారం కల్పించాలి. ఆ రోజువరకూ నిత్యం పదిమంది కొత్తవారికి ఫోన్‌ చేసి జనతా కర్ఫ్యూ గురించి చెప్పాలి.

‘‘ప్రపంచం మొత్తాన్ని అతిపెద్ద సంకట స్థితిలోకి కరోనా నెట్టేసింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో ప్రభావితమైన దేశాల సంఖ్య కన్నా కరోనాతో ప్రభావితమైన దేశాల సంఖ్యే ఎక్కువ. గత రెండు నెలలుగా కరోనాపై పలు దేశాల నుంచి వస్తున్న ఆందోళనకరమైన వార్తలు వింటున్నాం. ఈ రెండు నెలల్లో 130 కోట్లమంది భారతీయులు విశ్వమహమ్మారి కరోనాపై పోరాడారు. అయితే ఈ సంకటం నుంచి మనం బయటపడ్డామని, అంతా బాగుందన్న వాతావరణం కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నెలకొంది. కరోనా గురించి ఇంత నిశ్చింత ఆలోచన ఏమాత్రం మంచిదికాదు. దీని గురించి ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాలి. నేను ఎప్పుడు ఏది అడిగినా దేశ ప్రజలు నన్ను నిరాశపరచలేదు. మీ ఆశీస్సులతో మనం నిర్ణీత లక్ష్యం దిశగా ముందుకెళ్తూ వస్తున్నాం. ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించాం. అదే క్రమంలో 130 కోట్ల ప్రజలను కొన్ని అడగడానికే ఇక్కడికొచ్చాను. రాబోయే కొన్నివారాల మీ సమయాన్ని నాకు ఇవ్వండి.

జనతా కర్ఫ్యూ

ప్రభావం ఉండదనుకోవడం తప్పు
కరోనాకు ఎలాంటి మందూ, టీకా తయారుకాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన పెరగడం సహజం. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో నిర్వహించిన అధ్యయనాల ద్వారా కొన్ని విషయాలు తెలిశాయి. ఆ దేశాల్లో ఈ వైరస్‌ ప్రాబల్యం ఆరంభమైన కొన్ని రోజుల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్ధృతమైంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సరైన సమయంలో స్పందించి సరైన నిర్ణయాలు తీసుకున్న దేశాలూ ఉన్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించి పరిస్థితిని చక్కదిద్దుకున్నాయి. ఆ పరిస్థితిపైన, ఆ వైరస్‌ తీరుతెన్నులపైన పూర్తి స్థాయిలో భారత్‌ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడంలో ప్రజలదే కీలక పాత్ర. 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లాంటి దేశంలో, అదీ అభివృద్ధికోసం ప్రయత్నిస్తున్న దేశంలో కరోనా కష్టం సామాన్యమైనదేమీ కాదు. ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో.. అభివృద్ధి చెందిన దేశాలు పడుతున్న ఇబ్బందులను చూస్తున్నాం. భారత్‌పై దీని ప్రభావం ఉండదనుకోవడం తప్పు. ఈ మహమ్మారిపై పోరాటానికి రెండు అంశాలు అత్యవసరం. అందులో ఒకటి సంకల్పమైతే, రెండోది సంయమనం.

సామాజిక దూరం పాటించండి

ఈ వైరస్‌ నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు మిగతావారినీ కాపాడాలి. దీనికి మందులేదు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండటం అత్యవసరం. దీంతోపాటు వచ్చే కొన్నివారాలపాటు అత్యవసర పరిస్థితులు మినహా ఇంటి నుంచి బయటికిరావొద్దు. వ్యాపారమైనా, ఆఫీసు అయినా ఇంటి నుంచే పనిచేయండి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆసుపత్రుల్లో పనిచేసేవారు, మీడియా ప్రతినిధుల సేవలు దేశానికి అవసరం. వారు మినహా సమాజంలోని మిగతా ప్రజలు సొంతంగానే సామాజిక దూరం పాటించాలి. 60-65 ఏళ్ల పైబడిన సీనియర్‌ సిటిజన్లు కొన్ని వారాలపాటు బయటికి రాకూడదు.

22న ఇంటికే పరిమితం కండి

గతంలో పెద్దలు పడిన ఇబ్బందులు ప్రస్తుత తరానికి తెలియకపోవచ్చు. నా చిన్నతనంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు పల్లెలు స్తంభించిపోయేవి. ఇంటి కిటికీ అద్దాలను కాగితాలతో కప్పేసేవారు. దీపాలు బంద్‌ చేసేవాళ్లు. ప్రజలు రాత్రంతా గస్తీ తిరిగేవారు. ప్రజలకు అలవాటు చేయడం కోసం.. యుద్ధం లేని సమయాల్లోనూ నగరపాలక సంస్థ అధికారులు అన్నింటినీ స్తంభింపజేసేవారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇప్పుడు అందరి మద్దతు కోరుతున్నా. ఈనెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకూ అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలి. ఆ రోజును ఇళ్లకే పరిమితం కావాలి. అత్యవసర సేవల్లో పాల్గొనేవారు మినహా మిగతావారెవరూ ఈ నెల 22న రోడ్లపైకి రాకూడదు. ఆ రోజున స్వీయ సంయమనం పాటించి మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశానికున్న శక్తిని చాటాలి. రాబోయే సవాళ్లను అధిగమించేలా ఈ అనుభవం మనల్ని తయారుచేస్తుంది. జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వాలూ నేతృత్వం వహించాలి.

కృతజ్ఞతలు ఇలా చెబుదాం

రెండు నెలలుగా ఆసుపత్రుల్లో, విమానాశ్రయాల్లో, కార్యాలయాల్లో, పట్టణ వీధుల్లో రాత్రింబవళ్లు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విమానయాన సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, రైలు, బస్సు, ఆటో, ట్యాక్సీ, హోం డెలివరీ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ఇతరుల సేవలో మునిగిపోయారు. వారి సేవలు నిరుపమానం. ఈ వైరస్‌ వారికి సంక్రమించే ప్రమాదం ఉన్నప్పటికీ భయపడకుండా సమాజం పట్ల తమకున్న బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీరికి మనం ధన్యవాదాలు చెప్పాలి. అందుకోసం జనతా కర్ఫ్యూ నిర్వహించే ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో దేశవ్యాప్తంగా అందరం ఇంటి వాకిళ్ల ముందు, కిటికీలు, బాల్కనీల వద్ద నిలబడి 5 నిమిషాలపాటు కరతాళధ్వనులు, గంటానాదం ద్వారా వారికి కృతజ్ఞతలు తెలపాలి. వందనం చేసి వారిలో ఉత్సాహాన్ని మరింత పెంచాలి. అదే సమయంలో స్థానిక సంస్థలూ సైరన్‌ మోగించి ఈ సందేశాన్ని చాటాలి.

ఆసుపత్రులపై భారం పెంచొద్దు

డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి కరోనాపై మరింత దృష్టి పెట్టేందుకు వీలు కల్పిద్దాం. సాధారణ ఆరోగ్య తనిఖీలను వీలైనంత తగ్గించండి. అత్యవసరమైతే వైద్యులకు ఫోన్‌ చేసి సలహాలు తీసుకోండి. సాధారణ శస్త్రచికిత్సలు నెలరోజులు వాయిదా వేసుకోండి.

ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక మంత్రి నేతృత్వంలో ‘కొవిడ్‌-19 ఆర్థిక ప్రతిస్పందన కార్యదళాన్ని’ (ఎకనమిక్‌ రెస్పాన్స్‌ టాస్క్‌ఫోర్స్‌) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది నిరంతరం భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి పరిస్థితులను అంచనావేస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది.

దృఢ సంకల్పంతో అధిగమిద్దాం..

రెండు నెలలుగా 130 కోట్ల మంది ప్రజలు దేశానికి ఎదురైన ఇబ్బందిని సొంత ఇబ్బందిగా భావించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేశారు. ఇలాంటి సమయంలో కొన్ని ఇబ్బందులూ వస్తాయి. అనుమానాలు, వదంతులు తలెత్తుతాయి. వీటిని దృఢ సంకల్పంతో అధిగమించాలి. కరోనా మహమ్మారిపై మానవ జాతి, భారత్‌ విజయం సాధించాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు.

ఆసుపత్రులపై భారం పెంచకూడదు. అనవసరంగా ఆసుపత్రులకు వెళ్లొద్దు.

ఈ వైరస్‌ మధ్య, దిగువ మధ్యతరగతి, పేదల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సంకట సమయంలో వ్యాపారులు, ఉన్నత వర్గాలవారు ఎవరి స్థాయిల్లో వారు ఆర్థిక దాతృత్వాన్ని చాటుకోవాలి. మీ దగ్గర పనిచేసే ఉద్యోగులు కొన్నిరోజులు మీ ఇంటికి రాకపోయినా వారి వేతనాల్లో కోతపెట్టొద్దు.

దేశంలో నిత్యావసరాలు, మందులకు కొరత రానీయకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందువల్ల ప్రజలు అనవసరంగా వాటిని నిల్వ చేసుకోవద్దు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు దేశాన్ని ప్రస్తుత సమస్య నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. పౌరులందరూ కూడా తమ వంతు చేయూతనివ్వాలి.

Be Strong Be Safe 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *