*నిత్య విద్యార్థిలా నైపుణ్యాలు నేర్చుకోవాలి

Spread the love

*నిత్య విద్యార్థిలా నైపుణ్యాలు నేర్చుకోవాలి*

*అప్పుడే మనం ముందుకెళ్లగలం* *నైపుణ్య భారత్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు*

దిల్లీ: ఎన్ని చదువులు చదివిన వారైనా జీవితంలో నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టిసారించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నైపుణ్య భారత్‌ దినోత్సవం (స్కిల్‌ ఇండియా డే) సందర్భంగా ఆయన బుధవారం యువతను ఉద్దేశించి మాట్లాడారు.

వేగంగా మారుతున్న ప్రపంచంలో మన అవసరం ఉండాలంటే స్కిల్‌, రీస్కిల్‌, అప్‌స్కిల్‌ సూత్రాన్ని అనుసరిస్తూ పోవాలని సూచించారు. ‘‘కరోనా సంకట సమయంలో పని సంస్కృతితోపాటు ఉద్యోగ విధానమూ మారిపోయింది. నిత్యనూతన సాంకేతిక పరిజ్ఞానంపై దీని ప్రభావం చాలా ఉంది.

అందువల్ల కొత్త పని సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని యువత నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో వ్యాపారాలు, మార్కెట్లు ఊహించనంత వేగంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో మనం నిలదొక్కుకోవాలంటే స్కిల్‌, రీస్కిల్‌, అప్‌స్కిల్‌ చాలా ముఖ్యం. మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే శక్తి నైపుణ్యానికి ఉంది. నైపుణ్య సాధనలో నిమగ్నమై ఉన్నవాళ్లను విజయం తప్పకుండా వరిస్తుంది. యువకులైనా, వృద్ధులైనా కొత్త నైపుణ్యాలు నేర్చుకొనేవారి జీవితంలో ఉత్సాహం ఎప్పటికీ సమసిపోదు. నేను ఒకప్పుడు స్వచ్ఛంద సేవకుడిగా గిరిజన ప్రాంతంలో పనిచేసేవాడిని. ఒకసారి అడవిలోకి వెళుతున్నప్పుడు మా జీపు ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్‌ కాలేదు. చివరకు మెకానిక్‌ను పిలిచాం. ఆయన 2 నిమిషాల్లో జీపును స్టార్ట్‌ చేశారు. అందుకు రూ.20 తీసుకున్నారు. రెండు నిమిషాలకు రూ.20 ఏమిటని మా మిత్రుడు ప్రశ్నించినప్పుడు ‘నేను తీసుకుంటున్నది రెండు నిమిషాలకు కాదు 20 ఏళ్లుగా పెంచుకుంటూ వచ్చిన నైపుణ్యానికి’ అన్న సమాధానం ఇప్పటికీ నా మనసులో బలంగా నాటుకుపోయింది. నైపుణ్యానికున్న శక్తి అదే’’ అని పేర్కొన్నారు. ‘‘విజ్ఞానం, నైపుణ్యం మధ్య ఉన్న తేడాలను దృష్టిలో ఉంచుకుని మేం స్కిల్‌ ఇండియా మిషన్‌ ప్రారంభించాం. వేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచంలోని చాలా సెక్టార్లలో లక్షల మంది నిపుణుల అవసరం ఉంది. మరీ ముఖ్యంగా వైద్యరంగంలో అత్యధిక నిపుణులు కావాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా నిపుణులకు ఉన్న డిమాండ్‌ను మ్యాపింగ్‌ చేస్తున్నాం. ఆ సమాచారాన్ని మన యువతకు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రపంచంలో నావికులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈ అంశంలో నైపుణ్యం సాధిస్తే యువత వివిధ దేశాలకు వెళ్లొచ్చు’’ అని మోదీ అన్నారు.

*సంబంధాలను బలోపేతం చేసుకుందాం* *వాణిజ్య అంశాలపై ఉన్నతస్థాయి చర్చలు*

*భారత్‌-ఈయూ సదస్సులో నిర్ణయం* *కార్యాచరణ ఆధారిత అజెండా తేవాలని మోదీ ఉద్ఘాటన*

దిల్లీ: వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించేందుకు, చాన్నాళ్లుగా అపరిష్కృతంగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి చర్చలు జరపాలని భారత్‌-ఐరోపా సంఘం బుధవారం నిర్ణయించాయి. రక్షణ, అణు ఇంధనం, ఆరోగ్యం వంటి రంగాల్లో ఒప్పందాలను విస్తరించాలని సంకల్పించాయి. 27దేశాలతో కూడిన ఐరోపా సంఘం (ఈయూ)-భారత్‌ల మధ్య బుధవారం వీడియో సమావేశం విధానంలో సదస్సు జరిగింది. భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఐరోపా బృందానికి ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్‌ మిషెల్‌, ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వండెర్‌ లియాన్‌లు నేతృత్వం వహించారు. భారత్‌-ఐరోపా సంఘం (ఈయూ) మధ్య సంబంధాలు మరింతగా విస్తరించేందుకు కార్యాచరణ ఆధారిత అజెండా తేవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈయూతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు తాను కట్టుబడి ఉన్నానని, సంబంధాలను పెంచుకునేందుకు దీర్ఘకాలిక వ్యూహాన్ని అవలంబించాలని సూచించారు. భారత్‌-ఈయూలు సహజ భాగస్వాములని పేర్కొన్న మోదీ, ఈ రెండింటి మధ్య భాగస్వామ్యం వల్ల ప్రపంచంలో శాంతి, సామరస్యాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ‘‘ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ సంస్థల పట్ల గౌరవం, స్వేచ్ఛ, పారదర్శక విధానాలు వంటి అంశాల్లో భారత్‌-ఈయూలు ప్రపంచస్థాయి విలువలను కలిగి ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. కొవిడ్‌-19 మహమ్మారి అంతమయ్యాక మావన సంక్షేమం ఆధారిత ప్రపంచీకరణ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణం వంటి అంశాల్లో భారత్‌-ఈయూల భాగస్వామ్యం ముఖ్య పాత్ర పోషించగలదని మోదీ చెప్పారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ సందర్భంగా ఇరు పక్షాలు ఐదేళ్ల కాలానికి రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి. ఉగ్రవాదాన్ని అన్నిరకాలుగా అణచివేస్తామని పునరుద్ఘాటించాయి. హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరత, భద్రతకు కలిసి పనిచేయాలని అవగాహనకు వచ్చాయి. ఆహారభద్రత, పరిశోధన, నవలక్పలనలు, శుద్ధ ఇంధనం, పర్యావరణం, సైబర్‌స్పేస్‌ తదితర అంశాల్లో బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. మరోవైపు, భారత్‌కు ఈయూ వ్యూహాత్మకంగా ముఖ్యమైన భాగస్వామి ఉంది. 2018లో భారత్‌ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఈయూ నిలిచింది. 2018-19ల మధ్య భారత్‌-ఈయూల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 115.6 బిలియన్‌ డాలర్లు కాగా, దాంట్లో ఎగుమతుల విలువ 57.17 బిలియన్‌ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 58.42 డాలర్లుగా ఉంది. *చర్చల్లో చైనా ప్రస్తావన* సదస్సులో చైనాతో భారత సంబంధాల ప్రస్తావన వచ్చిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి(పశ్చిమ) వికాశ్‌ స్వరూప్‌ తెలిపారు. ఆ దేశంతో సంబంధాలపై భారత వ్యూహాన్ని, సరిహద్దులో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివరించారని తెలిపారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు మద్దతిస్తుండడం, భారత చుట్టుపక్కల దేశాల ప్రస్తావన వచ్చిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *