*‘పద్మనాభు’ని బాధ్యత ట్రావెన్‌కోర్ రాజులదే*
*వారికి ఆలయంపై వారసత్వ హక్కు ఉంది*
*రహస్య మాళిగపై నిర్ణయం తీసుకునే అధికారం కమిటీకి అప్పగింత* *సుప్రీంకోర్టు తీర్పు*
దిల్లీ, తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణపై సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం వెలువరించింది. ఆలయ నిర్వహణపై ట్రావెన్‌కోర్(తిరువనంతపురం) రాజకుటుంబానికి హక్కులు ఉన్నట్టు తీర్పు చెప్పింది. ఆలయ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని, నిర్వహణకు ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటు చేయాలంటూ 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కొత్త కమిటీ ఏర్పాటయ్యేవరకు తాత్కాలికంగా ఆలయ వ్యవహారాలు చూడడానికి తిరువనంతపురం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యులతో పరిపాలన కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలో అందరూ హిందువులే ఉండాలని సూచించింది. మరో సలహా కమిటీని కూడా ఏర్పాటు చేయాలని, నాలుగు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని పేర్కొంది.తొమ్మిదేళ్ల వాదోపవాదాల అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రా ఆధ్వర్యంలోని ధర్మాసనం 218 పేజీల తీర్పు ఇచ్చింది. *ఇదీ నేపథ్యం..*
పద్మనాభస్వామి ట్రావెన్‌కోర్ రాజుల కులదైవం. ప్రస్తుత ఆలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. 1949లో ఆ సంస్థానం భారతదేశంలో విలీనమయింది. అప్పుడు కుదిరిన ఒప్పందంలోని ఏడో ఆర్టికల్ ప్రకారం తిరువనంతపురం ‘పాలకుడు’ తాను నియమించే కార్యనిర్వాహక అధికారి ద్వారా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే 1991లో చివరి మహారాజు చితిర తిరునాల్ బలరామ వర్మ మృతిచెందారు. ఆయన అవివాహితుడు కావడంతో తదుపరి ‘పాలకుడు’ ఎవరన్న దానిపై సందేహం నెలకొంది. సోదరుడు ఉత్రదాల్ తిరునాల్ మార్తాండ వర్మ ఆలయ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆర్థికంగా అవకతవకలు జరిగాయని, ప్రభుత్వమే ఆలయ బాధ్యతలు చేపట్టాలని కోరుతూ 2009లో రిటైర్డు ఐపీఎస్ అధికారి టి.పి.సౌందర్‌రాజన్ కేరళ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిస్తూ పెద్దగా అవకతవకలేవీ జరగలేదని తెలిపింది. ఆలయం రాజకుటుంబీకులదేనన్న నమ్మకం ప్రజల్లో ఉన్నందున ఇందులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. హైకోర్టు మాత్రం ఆలయాన్ని ప్రభుత్వమే చేపట్టాలని తీర్పు చెప్పింది. రాష్ట్రపతి గుర్తించిన వారే ‘పాలకులు’ అవుతారని, ప్రస్తుతం పాలకులు లేనందున రాష్ట్ర ప్రభుత్వమే పాలకునిగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది. విలువైన ఆస్తులు ఉన్న ‘కల్లార’(మాళిగలు)లోకి రాజకుటుంబీకులు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించింది. *సుప్రీంకోర్టు ఏం చెప్పింది?*
హైకోర్టు తీర్పుపై రాజకుటుంబీకుడు మార్తాండ వర్మతోపాటు, పలువురు సుప్రీంకోర్టులో అపీళ్లు దాఖలు చేశారు. వీటన్నింటిని విచారించిన సుప్రీంకోర్టు… రాజకుటుంబీకులకు ఆలయ మూలమూర్తిని నిర్వహించడంతోపాటు అర్చించడానికి ఉద్దేశించిన ‘షెబాయిత్’ హక్కులు ఉన్నాయని స్పష్టంచేసింది. మరణంతో ఈ హక్కులు రద్దు కావని తెలిపింది.
చివరి పాలకుడు మరణించినంత మాత్రాన ఆలయ కమిటీని ప్రభుత్వం తీసుకోజాలదని తెలిపింది. వారసులు లేనందున ఆస్తి ప్రభుత్వానికి సంక్రమిస్తుందన్న చట్టం ఇక్కడ వర్తించదని పేర్కొంది. ఆలయ నిర్వహణ బాధ్యతలు రాజకుటుంబీకుల ఆధ్వర్యంలోని కమిటీకి ఉంటాయని తెలిపింది. రహస్యంగా ఉండిపోయిన రెండో నెంబరు మాళిగను తెరిచే విషయమై నిర్ణయం తీసుకొనే అధికారం తాత్కాలిక కమిటీకి అప్పగిస్తున్నట్టు పేర్కొంది. ఆలయ రక్షణ బాధ్యతలు ప్రభుత్వం చూసుకుంటుందని, ఇందుకయ్యే ఖర్చులను దేవస్థానం భరించాల్సి ఉంటుందని తెలిపింది._ *ఆదేశాలను అమలు చేస్తాం – దేవాదాయ మంత్రి*
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ చెప్పారు. తీర్పుపై అధ్యయనం చేస్తామని తెలిపారు. ఇది భక్తులందరి విజయమని రాజకుటుంబానికి చెందిన పూయం తిరునాల్ గౌరీ పార్వతీబాయి ఆనందం వ్యక్తం చేశారు._
*కళ్లు చెదిరే సంపద*
పద్మనాభ ఆలయంలో ఆరు కల్లారలు ఉన్నాయి. వీటిలో తరతరాల నాటి ఆభరణాలు, ఆయుధాలు, నాణేలు ఉన్నాయి. వీటి విలువ రూ.లక్ష కోట్లు ఉంటుందని ఓ అంచనా. వీటిలో రెండోదైన కల్లార-బీ మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. ఇక్కడి సంపదను నాగుపాములు కాపాలా కాస్తుంటాయని, దీన్ని తెరిస్తే అరిష్టమన్న అభిప్రాయం భక్తుల్లో నెలకొంది._