*5జీ వచ్చేస్తుంటే.. ఇంకా 2జీ సేవలెందుకు?*
*చరిత్రలో కలిపేయాలి*
*ఇంటర్నెట్‌కు దూరంగా 30 కోట్ల మంది వినియోగదారులు*
*ముకేశ్ అంబానీ*
దిల్లీ: దేశంలో 2జీ సేవలు నిలిపివేసేందుకు సత్వరం విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ కోరారు. 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సేవలను చరిత్రలో భాగం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
దేశంలో తొలి మొబైల్‌కాల్ ఆరంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడారు. మిగిలిన ప్రపంచంతో పాటు భారత్ కూడా శరవేగంతో డేటా సేవలు లభించే 5జీ కి సిద్ధమవుతున్నా, ఇంకా 30 కోట్ల మంది 2జీ ఫీచర్‌ఫోన్ వినియోగదారులు ప్రాథమిక ఇంటర్నెట్ సేవలకు కూడా దూరంగానే ఉన్నారని ముకేశ్ అంబానీ వివరించారు. అందువల్ల సత్వరం 2జీ సేవల నిలిపివేతకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
1995లో దేశీయంగా మొబైల్ సేవలు ఆరంభించాక, ఇప్పటివరకు ఎంతో పురోగతి ఏర్పడిందని గుర్తు చేశారు. తొలుత కాల్ చేసినవారు నిమిషానికి రూ.16, కాల్ అందుకున్నవారు నిమిషానికి రూ.8 చొప్పున చెల్లించాల్సి వచ్చేదని, ప్రస్తుతం 4జీ కాల్స్ ఉచితంగా చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. అంతకుముందు ల్యాండ్‌లైన్ ఫోన్లు ఉన్నా కొంతవరకే సమాచార సౌలభ్యం ఏర్పడిందని, మొబైల్ వచ్చాకే ‘ఎక్కడి నుంచి ఎక్కడికైనా’ సమాచార సేవలు లభిస్తున్నాయని గుర్తు చేశారు.
‘ధనిక-పేద’ మధ్య తేడా లేని సేవలు అందించడంలో మొబైల్ టెలిఫోనీని మించిన సాంకేతికత సాధనం ఏదీ రాలేదని వివరించారు. మొబైల్‌పైనే వార్తలు తెలుసుకోవడం, వీడియోలు చూడటం, కొనుగోళ్లు చేయడం సామాన్యులకూ చేరువైందని తెలిపారు.
పిల్లలు ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటే, ఉద్యోగులు పని చేస్తున్నారని, సమావేశాలు కూడా ఫోన్ల ఆధారంగానే దృశ్యమాధ్యమ పద్ధతుల్లో జరుగుతున్నాయని అంబానీ వివరించారు. కొవిడ్ లాక్‌డౌన్‌లోనే మొబైల్ ఫోన్ల వల్లే దేశం అంతా సమాచారాన్ని పంచుకోగలిగిందని గుర్తు చేశారు.