ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా క్రికెట్ మజా గురించి చర్చించే వాళ్ల కన్నా బెట్టింగ్ మీదే జనాల కాన్సన్ ట్రేషన్ ఎక్కువగా నడుస్తూ ఉండటం గమనార్హం. క్రికెట్ లో ఆస్వాధించేంత మజా ఉంది. అయితే జనాలు దీంతో సంతృప్తి చెందుతున్నట్టుగా లేరు.
అందరూ కాకపోయినా కొందరు క్రికెట్ మ్యాచ్ లకు సమాంతరంగా బెట్టింగులు వేసుకుంటూ కొత్త మజాను ఆస్వాధిస్తున్నారు. దాన్ని మజా అనడం కన్నా జూదం అనడం మంచిది. దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకూ క్రికెట్ బెట్టింగులు సాగుతూ ఉన్నాయి.
మ్యాచ్ ల ఫలితాలతో మొదలుపెడితే ప్రతి ఓవర్ కూ, ప్రతి బంతికీ బెట్టింగులు సాగుతూ ఉన్నాయి. దశాబ్దాల నుంచే ఇండియాల ఈ తరహా బెట్టింగులు సాగుతూ ఉన్నాయి. అవి క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఐపీఎల్ సీజన్ వస్తే పంటర్లకు పండగ అవుతోంది. వీళ్లు చాలా ముదిరిపోయారు. ఐపీఎల్ తో ఆగడం లేదు. విదేశీ క్రికెట్ లీగ్ ల విషయంలో కూడా ఇండియాలోని మారుమూల ప్రాంతాల్లో బెట్టింగులు సాగుతున్నాయని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు.
టీ20 బాదుడు వచ్చాకా బెట్టింగులు వేసే వాళ్లు అమీతుమీ తేల్చుకోవడానికి అవకాశశం ఏర్పడినట్టుగా ఉంది. ఈ బెట్టింగ్ ముఠాలు తరచూ పోలీసులకు దొరుకుతూ ఉంటాయి. నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేస్తూ ఉంటారు. ఈ సీజన్ లో అలాంటి వార్తలు సహజంగా వినిపిస్తూ ఉంటాయి.
వాటి సంగతలా ఉంటే.. అఫిషియల్ గా మరో బెట్టింగ్ నడుస్తూ ఉంది. అదే డ్రీమ్ ఎలెవన్ తరహా ఫాంటసీ బెట్టింగ్ . ఇదంతా అధికారికంగా సాగే బెట్టింగ్! చాలా మంది యువకులు తమ ఫోన్లలో ఈ ఫాంటసీ లీగ్ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకుని బెట్టింగులు కడుతూ ఉంటారు. ఇది మ్యాచ్ ల ఫలితాల మీద కాకుండా.. ఆటగాళ్ల ప్రదర్శన మీద కట్టే పందేలు! అంతిమంగా ఇది కూడా జూదమే. నిస్సందేహంగా జూదమే.
అయితే దీని ప్రచారానికి ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సౌరవ్ గంగూలీ, ధోనీ, బుమ్రా, పంత్.. వంటి భారత క్రికెట్ స్టార్లు వీటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అంతే గాక ఈ ఏడాది ఐపీఎల్ అధికారిక స్పాన్స్ర్ కూడా డ్రీమ్ ఎలెవనే! వందల కోట్ల రూపాయల డబ్బు కట్టి ఆ సంస్థ ఐపీఎల్ అధికారిక స్పాన్సర్ గా మారింది.
ఈ అప్లికేషన్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చని టీవీ యాడ్స్ కూడా ఇస్తుంటారు. డబ్బులు గెలుచుకున్న వాళ్లంటూ కొందరి చేత ఈ యాప్ ప్రమోట్ చేసుకుంటున్నారు! వాళ్లు డబ్బులు గెలుచుకున్నారంటే… ఎవరో పోగొట్టుకున్నారనే అర్థం.
తమ యాప్ లోకి వచ్చి ఆటగాళ్ల మీద పందేలు కట్టే వాళ్ల బలహీనతను ఆసరాగా చేసుకుని.. ఈ యాప్ లు నడుస్తూ ఉన్నాయి. ఈ యాప్ లలో సంపాదించే వాళ్లు ఎంత మంది ఉంటారో, పోగొట్టుకునే వాళ్లూ అంతే మంది ఉంటారు. ఈ రోజు సంపాదించే వాళ్లు, రేపు పోగొట్టుకుంటేనే మరొకరు లాభపడతారు.
ఎవరికీ యాప్ వాళ్లు డబ్బులు ఇవ్వరు! జూదం మీద ఆసక్తి ఉన్న వారి బలహీనతను అడ్డుపెట్టుకుని, జూద నిర్వాహకుల్లాగా ఈ యాప్ ల వాళ్లు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. తమ ప్రమోషన్ కోసమే ఈ సంస్థలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే.. వీళ్ల లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు!
జూదం ఆడి సంపాదించిన వాడిని చూపించలేం, అదే జూదాన్ని నిర్వహించే వాళ్లు మాత్రం సంపాదించుకుంటారు. ఇలాంటి జూదానికి భారత దేశం గర్వించే ఆటగాళ్లు ప్రమోటర్లుగా మారడం విచారకరం.
ఈ తరహా యాప్ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. డ్రీమ్ ఎలెవన్ తో సమా అన్ని ఫాంటసీ లీగ్ యాప్ లనూ ఏపీ గవర్నమెంట్ నిషేధించింది. అది చాలా మంచి పని. ఈ బెట్టింగ్ బురదలోకి స్మార్ట్ ఫోన్ యుగంలో దిగుతున్నది యువతే. గ్రాడ్యుయేషన్ వయసు విద్యార్థులు చాలా మంది ఈ బురదలోకి దిగి లేని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్ లను నిషేధించింది అభినందించదగిన పని చేసింది.
Reference:greatandhra