*ఆన్‌లైన్ బోధనపై వారంలో విధాన నిర్ణయం*
*హైకోర్టుకు నివేదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*
*పేదలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర విధానం రూపొందించాలన్న హైకోర్టు* హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యా సంవత్సరాన్ని ప్రారంభించలేదని, ఒక వారం గడువిస్తే ఆన్‌లైన్ సహా అన్నింటిపై విధాన నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది.
ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిందని, దానిపై విధి విధానాల రూపకల్పనలో ప్రభుత్వం ఉందని పేర్కొంది. దీనికి హైకోర్టు అనుమతిస్తూనే ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల విద్యార్థులను, విద్యుత్తు సరఫరా, ఇంటర్‌నెట్ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ విధానం ఉండాలంది. ఓవైపు విద్యాసంవత్సరం ప్రారంభించలేదంటూ మరోవైపు ప్రైవేటు పాఠశాలల ఆన్‌లైన్ తరగతులను నిషేధించకపోవడాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేదని వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చెప్పడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ఆన్‌లైన్ బోధనకు సంబంధించి విధాన రూపకల్పన జరుగుతోందని, వారంలో దీనికి తుది రూపునిస్తామన్నారు. జులై 31నాటికి విద్యాసంవత్సరాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు.
సాంకేతిక నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశామని, ఇది అన్ని అంశాలను అధ్యయనం చేసి మార్గదర్శకాలను రూపొందించనుందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ విద్యుత్తు సరఫరా మాటేమిటి, ఆదిలాబాద్‌లోని గిరిజన ప్రాంతాల్లో కనీసం 4 గంటలు విద్యుత్తు ఉండదని, అదేవిధంగా పేదలు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు ఎలా కొనుగోలు చేయగలరంది.
ఈ దశలో ఎస్జీపీ జోక్యం చేసుకుంటూ టీవీల ద్వారా పాఠాలు చెప్పే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనికి యాంటెన్నా ఉంటే చాలని, ఇంటర్‌నెట్ అవసరం లేదన్నారు. అంతేగాకుండా విద్యుత్తు శాఖతో మాట్లాడి పాఠాలు చెబుతున్నపుడు కోత లేకుండా చూస్తామన్నారు.
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ విద్యార్థులకు పాఠాలకు సంబంధించి అనుమానాలు వస్తే ఎలా నివృత్తి చేసుకోవాలని ప్రశ్నించింది. ఒక దశలో ఎస్జీపీ చెబుతున్నది వినపడకపోవడంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ హైదరాబాద్‌లోనే ఇంటర్‌నెట్ పరిస్థితి ఇలా ఉంటే గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటని వ్యాఖ్యానించింది.
*ఆన్‌లైన్ బోధన షెడ్యూలు వివరాలివ్వండి*
సీబీఎస్సీ, ఐసీఎస్సీ విద్యాసంవత్సరం మార్చిలోనే ప్రారంభమైందని ప్రైవేటు పాఠశాలల తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు తెలిపారు.
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఎంత సమయం బోధన ఉంటోంది, చిన్నపిల్లలు కంప్యూటర్ ముందు ఎంత సేపని కూర్చుంటారని ప్రశ్నించగా తరగతికి తరగతికి మధ్య కొంత విరామం ఉంటుందన్నారు.
తల్లిదండ్రులు అంగీకరించారా?అని ధర్మాసనం ప్రశ్నించగా తల్లిదండ్రులకు ఇష్టంలేకపోతే మానివేయవచ్చని, అలాంటివారి వద్ద ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని చెప్పారు.
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఆన్‌లైన్ విద్యాబోధన వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అదేవిధంగా ప్రభుత్వం అందరికీ అందుబాటులోఉండే విధానాన్ని తీసుకురావాలని, దీనికి సంబంధించి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది.