స్మార్ట్‌ఫోన్ల విక్రేతల్లో టాప్-10 సంస్థలు ఇవే…
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల రంగం ఎంతో విస్తరించి ఉంది. బోలెడన్ని కంపెనీలు ఇందులోకి ప్రవేశించినా వినియోగదారుల అభిరుచిని తెలుసుకుని ఫోన్లను విడుదల చేస్తేనే మార్కెట్‌లో నిలబడగలవు. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ స్మార్ట్‌ఫోన్ల విపణిలో కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో 2020 సంవత్సరానికిగాను అత్యంత విలువైన పది బ్రాండ్‌ల గురించి పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ ఓ నివేదిక విడుదల చేసింది. మరి మార్కెట్లో విస్తరించిన పది స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్ల వివరాలను మనమూ తెలుసుకుందాం..
ఎక్కువ భాగం కంపెనీలు చైనాకు చెందినవే కావడం గమనార్హం.
టాప్ ప్లేస్ శామ్‌సంగ్‌దే
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ శామ్‌సంగ్. అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ల విపణిలో అగ్రశ్రేణి సంస్థగా శామ్‌సంగ్ నిలిచింది. ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 22 శాతం వాటాతో మొదటి స్థానం సాధించింది. దాదాపు 79.8 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను విక్రయించినట్లు నివేదిక పేర్కొంది. శామ్ సంగ్ ప్రతి సంవత్సరం రెండు శాతం మేర అమ్మకాలను పెంచుకుంటూ పోతోంది.
నిషేధం ఉన్నా.. రెండో స్థానంలో హువాయి
చైనీస్ మొబైల్ సంస్థ హువాయి రెండోస్థానంలో నిలిచింది. దాదాపు 14 శాతం వాటాతో 50.9 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను విక్రయించింది. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో అమ్మకాలు తగ్గినట్లు హువాయి చెబుతోంది. అయినప్పటికీ 2020 మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను సాధించడం విశేషం.
యాపిల్‌ను దాటి షావోమి
చైనాకు చెందిన షావోమి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఉత్పత్తులను తయారు చేస్తోంది. భారత్‌లోనూ అత్యధికంగా మొబైల్ ఫోన్లను విక్రయించిన సంస్థ కూడా షావోమి కావడం విశేషం. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 46.2 మిలియన్ల యూనిట్ల స్మార్ట్ ఫోన్లను విక్రయించి మార్కెట్‌లో 13 శాతం వాటాతో మూడో స్థానం చేజిక్కించుకుంది.
ఒక్క స్థానం కిందకు దిగిన యాపిల్
ప్రతి ఒక్కరూ ఐఫోన్ తమ చేతిలో ఉంటే అదోరకమైన గర్వంగా భావిస్తుంటారు. అయితే ధర ప్రకారం ఎక్కువగా ఉండే ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే సామాన్యుల తరం కాకపోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 41.7 మిలియన్ల యూనిట్లను విక్రయించి నాలుగోస్థానంలో నిలిచింది. అంతకుముందు త్రైమాసికంలో మూడో స్థానంలో ఉండగా… షావోమి సంస్థ యాపిల్‌ను దాటేయడం విశేషం. మార్కెట్‌లో యాపిల్ సంస్థ పదకొండు శాతం వాటా సాధించింది.
పాంచ్ పటాకాలోకి ఒప్పో
ఐదో ర్యాంక్ సాధించిన ఒప్పో 2020 మూడో త్రైమాసికంలో దాదాపు 31 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులకు అందించింది. విపణిలో 8 శాతం వాటాను సొంతం చేసుకుంది. అంతకుముందుతో పోలిస్తే ఇరవై ఆరు శాతం వృద్ధిని నమోదు చేసింది. మిడ్ రేంజ్ ఫోన్లను అందించడంతో మధ్యతరగతి శ్రేణి వినియోగదారులను ఆకట్టుకోవడంతో అమ్మకాలను పెంచుకోగలిగింది.
ఆరో స్థానంలోకి వివో
స్మార్ట్ ఫోన్ల విపణిలో చైనా సంస్థల నుంచి విపరీతమైన పోటీ ఉంటుంది. ఆ దేశం నుంచి వచ్చిన వివో టాప్-10లో స్థానం సంపాదించడం విశేషం. మూడో త్రైమాసికంలో దాదాపు 31 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను విక్రయించి ఆరోస్థానంలో సాధించింది. ఫోన్ల విపణిలో దాదాపు ఎనిమిది శాతం వాటాను కైవసం చేసుకుంది.
తక్కువ ధరల శ్రేణిలో.. రియల్‌మి
తక్కువ ధరల శ్రేణిలో స్మార్ట్ ఫోన్లను తీసుకురావడంలో రియల్‌మి ముందుంటుంది. దీంతో మధ్య తరగతి వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. 2020 మూడో త్రైమాసికంలో దాదాపు 14.8 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్లు కౌంటర్‌పాయింట్ నివేదిక వెల్లడించింది. రియల్‌మి సంస్థ కూడా చైనాకు చెందినదే. స్మార్ట్‌ఫోన్ల విపణిలో నాలుగు శాతం వాటాను చేజక్కించుకుంది.
స్మార్ట్‌ఫోన్ల విపణిలోనూ లెనోవో సత్తా
స్మార్ట్ ఉత్పత్తులకు పెట్టింది పేరు లెనోవో. ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు తయారీలో ముందుండే సంస్థ. అలాంటిది స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోనూ తన సత్తా చాటుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దాదాపు 10.2 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించి ఎనిమిదో స్థానం సంపాదించింది. మార్కెట్ వాటాలో మూడు శాతం సాధించడం విశేషం.
రెండు శాతం వాటాతో ఎల్‌జీ
గృహోపకరణాల రంగంలో ఎల్‌జీ పేరు తెలియని వారుండరు. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషిన్లు వంటి ఉత్పత్తులను వినియోగదారులకు అందించిన ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ల విపణిలోనూ ముందుకు దూసుకొస్తోంది. రెండు శాతం వాటాను సాధించిన ఎల్‌జీ 6.5 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది. దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ తొమ్మిదో స్థానం సాధించింది.
చైనాకు చెందిన టెక్నో
టెక్నో మన దేశంలో పెద్దగా పాపులర్ అయిన సంస్థేమీ కాదు. చైనాకు చెందిన కంపెనీకి దక్షిణాసియా, ఆఫ్రికన్ దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రెండు శాతం వాటాను సాధించి పదో స్థానంలో నిలిచింది. దాదాపు 5.6 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది.