*స్టీరింగ్ లేని కారు.. సూపరో సూపరు!* ▪︎‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సూచనలతో.. టైర్లు కాదు పంజాలు స్టీరింగ్‌కు బదులుగా ప్యాడ్
▪︎ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్, ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో కలిసి ఏవీటీఆర్ పేరుతో ఒక అధునాతన కారును రూపొందించింది. ఇవాళ్టి మన ఆలోచనలే రేపు మనం పాటించబోయే ప్రమాణాలు అనే నినాదంతోనే ఈ కార్ ఆవిష్కారం సాధ్యమైందని మెర్సిడెజ్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో నెవాడా రాష్ట్రం (అమెరికా) లోని లాస్‌వేగాస్ నగరంలో మొదటిసారిగా దీన్ని ప్రదర్శించారు. కారు గురించి వివరిస్తూ 13 నిమిషాల వీడియోని యూట్యూబ్‌లో విడుదల చేశారు.
*టైర్లు కాదు పంజాలు..*
▪︎ఈ కారుకు ఉండే టైర్లు చక్రాల మాదిరిగా కాకుండా గోళాకారంగా ఉంటాయి. జంతువు పంజా, పువ్వు ఆకృతులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించామని చీఫ్ డిజైన్ ఆఫీసర్ గోర్డెన్ వాజెనర్ తెలిపారు. ఇరుకు ప్రదేశాల్లో పార్కింగ్ కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు.
*స్టీరింగ్‌కు బదులుగా ప్యాడ్..* ▪︎కారులో స్టీరింగ్‌కు బదులుగా డ్రైవర్ లేదా ప్రయాణీకుల సీటు పక్కన ఒక సెంట్రల్ కంట్రోల్ ప్యాడ్ ఉంటుంది. దానిపై చెయ్యి పెట్టి ముందు, వెనక, కుడి, ఎడమ.. ఇలా ఏ వైపు కావాలంటే ఆ వైపుకి కారుని పోనివ్వచ్చు.
*మీతో సంభాషిస్తుంది కూడా..* ▪︎స్టీరింగ్ వీల్, డిస్ప్లే బటన్‌లు, టచ్ స్ర్కీన్‌లు ఏవీ లేకున్నా ఈ కార్ మీతో సంభాషిస్తుంది. కృత్రిమ మేధ సహకారంతో సైగలు, నాడీ, హృదయ స్పందనల ఆధారంగా పరిస్థితులను అర్థం చేసుకుంటుంది. ముందు అద్దంపై రంగులు మార్చుతూ వేగం, దిశ, బ్రేకుల పనితీరుని తెలియజేస్తుంది.
▪︎ఇది రోడ్డుపైకి ఎప్పుడొస్తుందో స్పష్టంగా తెలియదు గానీ ఈ ప్రదర్శనతో ప్రపంచమార్కెట్‌లో మెర్సిడెజ్ బెంజ్ ఒక సంచలనానికి తెర తీసిందన్నది నిర్వివాదాంశం.