*దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్*
*ద.మ రైల్వే పరిధిలో సికింద్రాబాద్-దిల్లీ మధ్య…*
*ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి*
హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు కాలపట్టిక(టైంటేబుల్) ఉంటుంది. గూడ్స్ రైళ్లు ఎప్పుడు బయల్దేరుతాయో..గమ్యం చేరుకునేది ఎప్పుడో చెప్పలేని స్థితి. ఈ రైళ్లు పట్టాలపై రద్దీకి అనుగుణంగా గంటల తరబడి ఆగుతూ..సాగుతూ రాకపోకలు సాగిస్తుంటాయి. వినూత్న ఆలోచనలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే ప్రథమంగా ‘కార్గో ఎక్స్‌ప్రెస్’ను పట్టాలెక్కించబోతుంది. ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే ఈ రైలును ఆర్నెల్లపాటు పైలట్ ప్రాజెక్టు కింద నడపనున్నట్టు ద.మ.రైల్వే బుధవారం వెల్లడించింది. *రవాణా రుసుము టన్నుకు రూ.2,500* కొత్త విధానం చిన్న, మధ్య తరహా వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తుందని ద.మ.రైల్వే జీఎం గజానన్ మల్య పేర్కొన్నారు.
‘రైళ్ల ద్వారా రవాణా అంటే సరకులు భారీ (బల్క్) పరిమాణంలో ఉండాలి. కొవిడ్ పరిస్థితులు, ఆదాయం పెంపొందించుకునే క్రమంలో తక్కువ పరిమాణం (నాన్‌బల్క్)లో సరుకులనూ రవాణా చేయాలని నిర్ణయించాం. వ్యవసాయ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులకు ఈ విధానం లభిస్తుంది’ అని ఆయన వెల్లడించారు. హైదరాబాద్-దిల్లీ మధ్య రవాణా రుసుము టన్నుకు సగటున రూ.2,500గా నిర్ణయించామని, సరకును బట్టి ఇది మారుతుందని సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. రోడ్డు రవాణాతో పోలిస్తే ఇది 40 శాతం తక్కువని, సరకు రవాణా రిజిస్ట్రేషన్, వ్యాగన్ల బుకింగ్‌కు 9701371976, 040-27821393 నంబర్లను లేదా ద.మ.రైల్వే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని ఆయన వివరించారు.