*గ్రేటర్ ఎన్నికలకు మోగిన నగారా* *1న పోలింగ్*
*నేటి నుంచే నామినేషన్లు* *బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు* *జనరల్ మహిళకు మేయర్*
హైదరాబాద్ _*గ్రేటర్.. ఎన్నికలు మెరుపువేగంతో దూసుకు వచ్చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.. సరిగ్గా 14 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే కొత్త పాలకవర్గం కొలువుతీరనుంది. ఒక్కసారిగా పార్టీల్లో హడావుడి మొదలైంది.. వ్యూహాలకు పదును పెడుతున్నాయి..*హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గం ఎన్నికల నగారా మోగింది.ఎన్నికల షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మంగళవారం విడుదల చేశారు. డిసెంబరు 1న ఎన్నికలు జరగనున్నాయి. రిపోలింగ్ అవసరమయితే డిసెంబరు 3న జరుపుతారు. డిసెంబరు 4న ఫలితాలను వెల్లడిస్తారు. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 20న నామినేషన్ల గడువు ముగుస్తుంది. 21న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటుంది. అదేరోజు గుర్తులను కేటాయిస్తారు. 48 వేలమంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల కమిషనర్ పార్థసారథి చెప్పారు. ఎన్నికల నియమావళి (కోడ్) తక్షణమే అమల్లోకి వచ్చిందని, మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘2016లో మాదిరిగానే 150 వార్డులకు, అవే రిజర్వేషన్లతో ఎన్నికలు జరుపుతున్నాం. శాసనసభ ఎన్నికల ఓటరు జాబితాతోనే ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు వేసేందుకు అర్హులు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహిస్తున్నాం. రాజకీయ పార్టీల నుంచి ఈవీఎంలపై అభ్యంతరాలు రావడం, ఇతర సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. బ్యాలెట్ పత్రం తెలుపు రంగులో ఉంటుంది. 28,500 బ్యాలెట్ బాక్సుల్ని వాడతాం. ఒక్కో అభ్యర్థి మరో ముగ్గురితో మాత్రమే వచ్చి నామినేషన్లు దాఖలు చేయాలి.
*మహిళకే మేయర్ పీఠం* మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. కరోనా నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికలకు 48 వేల మంది సిబ్బంది సిబ్బందిని వినియోగిస్తున్నాం. ఇప్పటి వరకు 9,238 పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఈ సంఖ్య కొంత పెరగవచ్చు. 21న తుది జాబితా ప్రకటిస్తాం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయి. అభ్యర్థులకు రూ. 5 లక్షల వరకు వ్యయ పరిమితి ఉంటుంది. ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోగా ఖర్చులకు లెక్కలు ఇవ్వకపోతే మూడేళ్ల పాటు అనర్హత వేటు పడుతుంది. ఎన్నికల పర్యవేక్షణ కోసం ఒక్కో జోన్‌కు ఒక్కో ఐఏఎస్ అధికారి చొప్పున ఆరుగురిని నియమించాం. సర్కిల్‌కు ఒకరు చొప్పున 30 మంది పరిశీలకులు, మరో 30 మంది సహాయ పరిశీలకులు ఉంటారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఇద్దరు పోలీసుల చొప్పున సుమారు 30 వేలమందిని వినియోగిస్తున్నాం. చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నాం. 356 సంచార, 131 తక్షణ చర్య బృందాలు, 44 ప్రత్యేక తక్షణ చర్య బృందాలు ఉంటాయి.
*వరద సాయం ఇవ్వొచ్చు* విపత్తు దృష్ట్యా ప్రభుత్వం నగరంలో వరద బాధితులకు అందించే రూ. 10 వేల సాయాన్ని కొనసాగించవచ్చు. దానిని బాధితుల ఖాతాల్లో జమచేయాలి. నేరుగా ఇవ్వవద్దు. ఎన్నికల సమయంలో నగరవాసులు రూ. 50 వేల వరకు నగదుతో తిరగవచ్చు. అంతకుమించి ఉంటే దానికి తగినఆధారాలు చూపాలి. ఓటర్లందరికీ జీహెచ్‌ఎంసీ ద్వారా స్లిప్పులు అందజేస్తాం. వెబ్‌సైట్‌్, మొబైల్ యాప్ నుంచి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలు సైతం గుర్తులు లేకుండా ఓటర్ స్లిప్పులను అందజేయవచ్చు.
*ఓటు హక్కుపై విస్తృత ప్రచారం* జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటోంది. 2009లో 42.04 కాగా, 2016లో 45.29 శాతంమంది మాత్రమే ఓటేశారు. ఓటింగ్ శాతం పెరిగేలా ఈసారి పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడతాం’’ అని పార్థసారథి తెలిపారు.