ఆరు నుంచి ఏడుకు.. సచివాలయ అంతస్తుల పెరుగుతున్నాయ్‌

Spread the love

*ఆరు నుంచి ఏడుకు..సచివాలయ అంతస్తులు పెరుగుతున్నాయ్‌!*

*ఏడో ఫ్లోరులో ముఖ్యమంత్రి కార్యాలయం*

*మరో లక్ష చదరపు అడుగులకు చేరువగా నిర్మాణ విస్తీర్ణం*

*నేడు ఇంకోసారి సీఎం సమీక్ష?* హైదరాబాద్‌: సచివాలయ అంతస్తులు పెరుగుతున్నాయి. ఆది నుంచి ఆనుకుంటున్నట్లుగా ఆరు కాకుండా ఏడంతస్తులుగా నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌ సంస్థ సచివాలయ నమూనాను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలోని భవనాల కూల్చివేతలు తుది దశకు చేరుకున్నాయి. జె, ఎల్‌ బ్లాకుల కూల్చివేత పనులు ఒకటిరెండు రోజుల్లో పూర్తవుతాయన్నది అంచనా. ఈలోగా సచివాలయ నమూనాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెన్నై ఆర్కిటెక్ట్‌ రూపొందించిన నమూనాలు బాగుండటంతో ఆ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఇప్పటికే రెండుసార్లు సమీక్షలు నిర్వహించారు. నమూనాల్లో మార్పులు, చేర్పులు సూచించారు. ఈ క్రమంలో తుది నమూనాలను ఆ సంస్థ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి మరోదఫా సమీక్షించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఆ సమావేశంలో దాదాపుగా నిర్మాణ నమూనా కొలిక్కి రావచ్చని అంచనా.

*ఆరుకు బదులు ఏడులో సీఎం..* ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యాలయం ఏడో అంతస్తులో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. సచివాలయాన్ని ఆరు అంతస్తుల్లో, ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించేందుకు తొలుత కసరత్తు చేశారు. రెండు సమీక్షా సమావేశాల వరకు రూపొందించిన నమూనాల్లోనూ ఆరంతస్తులుగానే ఉన్నాయి. అంతకు ముందు ముంబయికి చెందిన ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ రూపొందించిన నమూనాల్లోనూ అన్నే ఉన్నాయి. సచివాలయ నమూనాను ఏడు అంతస్తులకు మార్చాలని కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. అందులోనూ ఏడో అంతస్తులోనే తన కార్యాలయం ఉండాలని తేల్చటంతో నమూనాల్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఉన్న నమూనాల్లో ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ప్రతిపాదించారు. తాజాగా అందులో ప్రతిపాదించిన వాటన్నింటినీ ఏడో అంతస్తులోకి మార్చి నమూనాలు సిద్ధం చేస్తున్నారు. సచివాలయంలోని మునుపటి భవనాలు సుమారు తొమ్మిదిన్నర లక్షల చదరపు అడుగుల్లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్నే వినియోగించుకుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆరు లక్షల చదరపు అడుగుల్లో సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. తాజాగా ఏడు అంతస్తులకు పెరగటంతో నిర్మాణ విస్తీర్ణం అటూఇటుగా ఏడు లక్షల చదరపు అడుగుల వరకు చేరవచ్చని అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *