Tiktok: మార్పులతో సిద్ధమైన టిక్‌టాక్.. తిరిగి రానుందా

Spread the love

*Tiktok: మార్పులతో సిద్ధమైన టిక్‌టాక్.. తిరిగి రానుందా?*

టిక్‌టాక్ భారతీయ హెడ్ నిఖిల్ గాంధీ సంస్థ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. సమాచార గోప్యత, భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకున్నామని ఇందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు అనుకూలంగా వస్తుందని అనుకున్నట్లు తెలిపారు.

పబ్జీ మొబైల్ గురువారం మనదేశంలో తిరిగి వస్తున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో టిక్‌టాక్ కూడా దీనికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే పబ్జీ మాతృసంస్థ క్రాఫ్టన్ కొరియాకు చెందిన కంపెనీ కాబట్టి ఈ యాప్ తిరిగి వచ్చేందుకు అవకాశం ఉంది. స్థానిక చట్టాలకు కూడా తాము లోబడి ఉంటామని నిఖిల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు టిక్‌టాక్‌కు మనదేశంలో మరింత అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. తమ తరఫు నుంచి ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్పష్టతను ఇచ్చామని, భవిష్యత్తులో మిగతా అంశాల్లో కూడా తాము ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. తమ ఉద్యోగులతో పాటు వినియోగదారులకు, కంటెంట్ క్రియేటర్ల విషయంలో కూడా తాము ఎంతో నిబద్ధతతో ఉన్నామని పేర్కొన్నారు. టిక్‌టాక్‌తో పాటు 58 యాప్స్‌ను ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్‌లో నిషేధించింది. భద్రత వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి సెక్యూరిటీ రీసెర్చర్లు, అకడమిక్ స్కాలర్ల నుంచి టాప్ సెక్యూరిటీ ఏజెన్సీల వరకు అందరినీ ఈ సోషల్ మీడియా దిగ్గజం సంప్రదించింది.

దీంతోపాటు థర్డ్ పార్టీ నిపుణులను, రెగ్యులేటర్లతో కూడా టిక్ టాక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. మనదేశంలో బైట్‌డ్యాన్స్‌కు 2 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. మనదేశంలో తిరిగి రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని వారికి హామీ ఇచ్చారు. తమ వ్యాపారంలో ఉద్యోగులకు ఎంతో గొప్ప పాత్ర ఉందని, వారు వ్యక్తిగతంగా, వృత్తిగతంగా సంతోషంగా ఉండేందుకు తాము కృషి చేస్తామని తెలిపింది. జూన్‌లో 58 యాప్స్‌ను నిషేధించిన తర్వాత ప్రభుత్వం సెప్టెంబర్‌లో మరో 118 యాప్స్‌ను నిషేధించింది. వాటిలో ఎంతో పాపులర్ బాటిల్ రాయల్ గేమ్ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పబ్జీ.. మనదేశం కోసం పబ్జీ మొబైల్ ఇండియా అనే కొత్త యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇలాగే టిక్‌టాక్ కూడా మార్పులు చేసుకుని తన యాప్‌ను మళ్లీ లాంచ్ చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *