బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్

Spread the love

బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో ఫైనల్‌గా నాగార్జున విన్నర్‌ను ప్రకటించారు. శ్రీముఖి, రాహుల్‌ని పక్కపక్కన నిలబెట్టి.. బాక్సింగ్‌లో ఎత్తినట్టు రాహుల్ చేయి పైకెత్తారు.

బుల్లితెరపై 100 రోజులకు పైగా వినోదాన్ని పంచిన బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో రాహుల్‌ను విజేతగా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ ట్రోఫీ అందుకున్నారు. అలాగే, రూ.50 లక్షల చెక్‌కు కూడా అందుకున్నారు.

అంతకు ముందు, హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు రవికృష్ణ, శివజ్యోతిల పెర్ఫార్మెన్స్‌తో షో మొదలైంది. ‘అల… వైకుంఠపురములో…’లోని రాములో రాములా సాంగ్‌కు వీరు పెర్ఫార్మ్ చేశారు. ఆ తరవాత రోహిణి, హేమ, హిమజ, శిల్పా చక్రవర్తి, వితికా, పునర్నవి, మహేష్ విట్ట, తమన్నా, జాఫర్.. వరుసగా ఒక్కొక్కరిగా, ఇద్దరు ముగ్గురుగా వేదికపైకి వచ్చి పెర్ఫార్మెన్స్ చేశారు. చివరిగా నాగార్జున అదరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆయన సినిమాల్లోని పాటలను మిక్స్ చేసి స్టెప్పులతో ఇరగదీశారు.

ఇదిలా ఉంటే, కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 హంగామా జూలై 21 నుంచి ప్రారంభమైంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లంతా టీవీ, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలే. గత సీజన్ మాదిరిగా ఈ సీజన్‌లో సాధారణ వ్యక్తులను తీసుకోలేదు. కాబట్టి ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారింది. 106 రోజులు నడిచిన ఈ రియాలిటీ షో ఆదివారం ముగిసింది. మొత్తం ఐదుగురు సభ్యులు.. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాలు ఫైనల్‌కు చేరగా.. రాహుల్ విజేతగా నిలిచాడు.

లైవ్అప్‌డేట్స్:
✦ శ్రీముఖి డల్ అయిపోవడంతో చిరంజీవి ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చారు. అలా ఉంటే తాను చూడలేనని సరదాగా అన్నారు. ఆ తరవాత తనతో చిరు సెల్ఫీ తీసుకున్నారు.
✦ ఆ తరవాత చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ, చెక్‌ను అందుకున్నాడు రాహుల్.
✦ హౌస్‌లో టాస్కులు ఆడాలంటే బలం, తెలివి కావాలని.. కానీ, వాటికంటే ఎక్కువ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ సపోర్ట్ తనకు ఎక్కువగా ఉందని రాహుల్ చెప్పాడు.
✦ ఇక పునర్నవి గురించి మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ నేను టాస్కులు ఆడకపోతుండే. పెద్ద లేజీగాడు లెక్కుండే. మంచిగజెప్పింది ఇన్లేదు. టాస్కులు ఆడరా అని జెప్పింది. అయినా ఇన్లేదు. అరె ఎదవ ఆడరా టాస్కులు అని జెప్పింది. అయినా ఇన్లేదు. ఒకరోజు ఫాట్ అని బైరిబెట్టింది. అయినా ఇన్లేదు. ఆఖరికి నామినేట్ జేసింది. తీస్కపోయి ముఖానికి రంగు పూసింది’’ అని చెప్పాడు.
✦ రాహుల్ మాట్లాడుతూ వరుణ్ సందేశ్, వితికా తనకు హౌస్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. వేదికపై నుంచి మనస్పూర్తిగా వితికను చెల్లెలు అని పిలుస్తానని చెప్పాడు.
✦ ఫైనల్‌గా రాహుల్‌ని విజేతగా ప్రకటించారు హోస్ట్ నాగార్జున.
✦ నాగార్జున జర్నీ చూపించడం అయిపోయిన తరవాత బయట ఉన్న కంటెస్టెంట్లను చిరంజీవి పరిచయం చేసుకున్నారు. కాదు కాదు.. వాళ్ల గురించి చిరంజీవే స్వయంగా చెప్పారు. ఈ క్రమంలో చిరు నవ్వులు పువ్వులు పూయించారు.
✦ ఆ తరవాత ఈ షోలో నాగార్జున జర్నీని తాను చూడాలని ప్లే చేయమన్నారు చిరంజీవి.
✦ వచ్చీరావడంతోనే నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతోందని, ఇండియాలోనే 7 భాషల్లో వస్తోందని, అయినప్పటికీ నాగార్జున హోస్ట్ చేసిన ఈ సీజన్ 3లో ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన షో అని చిరంజీవి చెప్పారు.
✦ విజేతను ప్రకటించడానికి మెగాస్టార్ చిరంజీవి వచ్చేశారు. ‘సైరా’ టైటిల్ సాంగ్‌తో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారు.
✦ ఇక విజేత ఎవరో తేల్చడానికి రాహుల్, శ్రీముఖిలను నాగార్జున బయటికి తీసుకొచ్చారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందుకు వీరిద్దరితో బిగ్ బాస్ మాట్లాడారు. వారికి వీడ్కోలు పలికారు.
✦ హౌస్‌లో ఉన్న టాప్ 2 కంటెస్టెంట్స్ రాహుల్, శ్రీముఖికి నాగార్జున ఒక ఆఫర్ ఇచ్చారు. ప్రైజ్ మనీ రూ.50 లక్షలను రెండు భాగాలుగా చేస్తానని, ఒక్కొక్కరు రూ.25 లక్షల చొప్పున తీసుకొని వెళ్లిపోతారా అని నాగార్జున అడిగారు. కానీ.. రాహుల్, శ్రీముఖి ఆసక్తి చూపలేదు.
✦ హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి వెళ్లారు. టాస్ 2 కంటెస్టెంట్లు రాహుల్, శ్రీముఖితో నాగార్జున ముచ్చట్లు పెట్టారు. హౌస్‌లో ఇద్దరు కంటెస్టెంట్ల జర్నీని ఒక్కొక్కరిగా చూపించారు. ముందు రాహుల్‌ది చూపించి.. ఆ తరవాత శ్రీముఖి జర్నీ చూపించారు.
✦ నిధి అగర్వాల్ కిర్రాక్ డ్యాన్స్ షోతో బిగ్ బాస్ వేదికపై అదరగొట్టారు. మంచి మాస్ మసాలా ఐటమ్ సాంగ్స్‌కి నిధి ఫైర్ పెర్ఫార్మెన్స్ చేశారు.
✦ ఈసారి అసలైన ఎలిమినేషన్ ప్రాసెస్‌ను మొదలుపెట్టారు. కవర్ ఓపెన్ చేసిన అంజలి బాబా భాస్కర్ పేరును ప్రకటించారు. దగ్గరుండి ఆయన్ని బయటికి తీసుకొచ్చారు. ఈయన టాప్ 3.
✦ కవర్ ఓపెన్ చేయకుండానే శ్రీముఖి చేయిపట్టుకుని ‘తీసుకెళ్లిపోతున్నా’ అన్నారు అంజలి. కానీ, శ్రీముఖి మాత్రం నేను రాను అంటూ భయం భయంగా అంది. అయితే, ఇది సరదాగా చేసింది.
✦ ఇప్పుడు కూడా 25 లక్షల రూపాయల ఆఫర్‌ను నాగార్జున కంటెస్టెంట్లకు ఇచ్చారు. కానీ, ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో అంజలినే ఎలిమినేట్ అయిన వ్యక్తి పేరు ప్రకటించమని చెప్పారు నాగార్జున.
✦ టాప్ 5లో ఉన్న మూడో కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయడానికి అంజలి అతిథిగా విచ్చేశారు. ఆమె ఒక ఎనవలప్ కవర్ పట్టుకుని హౌస్‌లోకి వెళ్లారు.
✦ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లంతా స్టేజ్ పెర్ఫార్మెన్సులు ఇచ్చారు.
✦ కవర్‌లో ఉన్న పేరును శ్రీకాంత్ ప్రేక్షకులకు చూపించారు. అది.. వరుణ్. ఆయన్ని తీసుకొని శ్రీకాంత్, కేథరిన్ బయటికి వచ్చేశారు. వరుణ్‌ది నాలుగో స్థానం.
✦ ఇక ప్లాన్ ‘సి’.. హౌస్‌లోకి కేథరిన్ వచ్చారు. ఒక కవర్ తీసుకొచ్చారు. ఈ కవర్‌లో ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ పేరు ఉంది. ఈ సమయంలో కూడా 20 లక్షలు తీసుకొని ఒకరు బయటికి వెళ్లే అవకాశం ఇచ్చారు. అయినా, ఎవ్వరూ తీసుకోలేదు.
✦ ఇప్పుడు ప్లాన్ ‘బి’ని ప్రవేశపెట్టారు. వరుణ్‌ను స్టోర్ రూంలోకి వెళ్లి ఇంకో బ్రీఫ్ కేస్ ఉంది తీసుకురమ్మన్నారు శ్రీకాంత్. అందులో మరో 10 లక్షలు ఉన్నాయి. మొత్తం 20 లక్షల రూపాయలు తీసుకొని ఒకరు బయటికి వచ్చేయొచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ, ఎవ్వరూ ముందుకు రాలేదు.
✦ శ్రీకాంత్ 10 లక్షల రూపాయలతో హౌస్‌లోకి వెళ్లారు. ఆ డబ్బు తీసుకొని ఒకరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవచ్చని హౌస్ మేట్స్‌కి నాగార్జున ఆఫర్ ఇచ్చారు. కానీ, ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇది ప్లాన్ ‘ఎ’.
✦ హీరో శ్రీకాంత్ బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. ఆయన్ని నాగార్జున సాదర స్వాగతం పలికారు. నాగార్జున తనతో నాలుగు సినిమాల్లో నటించారని.. ‘హలో బ్రదర్’లో తనకు డూప్‌గా చేశారని నాగార్జున చెప్పారు.
✦ ‘చిలకలూరి చింతామణి’ సాంగ్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ అంజలి. బ్లాక్ బస్టర్ డ్యాన్స్ షోతో అదరగొట్టారు.
✦ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి బిగ్ బాస్ వేదికపై పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
✦ ఇక హౌస్‌లో ఉన్న నలుగురు కంటెస్టెంట్లలో ఎవరెవరికి ఏయే స్థానం ఇస్తావని అలీని నాగార్జున అడిగారు. దీంతో రాహుల్‌కి ఒకటి, శ్రీముఖికి రెండు, వరుణ్‌కి మూడు, బాబా భాస్కర్‌కి నాలుగో స్థానం ఇచ్చాడు అలీ. ఫైనల్ రిజల్ట్ ఇలానే ఉంటుందని తాను అనుకుంటున్నట్టు అలీ చెప్పాడు.
✦ అలీ రెజా లాంటి స్వీట్ బోయ్‌ని ఎలిమినేట్ చేయడం చాలా కష్టంగా అనిపించిందని రాశీ ఖన్నా అన్నారు. దీంతో నాగార్జున బిగ్గరగా నవ్వారు. ‘స్వీట్ బోయ్.. ఇతనికి పెళ్లయిపోయింది. వాళ్ల ఆవిడ కూడా వచ్చిందంటూ’ నవ్వించారు.
✦ అలీ రెజా ఐదో స్టానంలో ఉన్నట్టు, ఆయన ఎలిమినేట్ అయినట్టు రాశీ ఖన్నా, మారుతి సంయుక్తంగా ప్రకటించారు. వీరిద్దరూ కలిసి ఆలీని బయటికి తీసుకొచ్చారు.
✦ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో ప్రకటించడానికి ముందు రాశీ, మారుతితో స్టెప్పులేయించాలని బాబా భాస్కర్‌ను నాగార్జున కోరారు. మరణం మాసు మరణం అంటూ రాహుల్ పాడిన పాటకు వీరంతా స్టెప్పులేశారు.
✦ టాప్ 5లో ఉన్న ఐదో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే సమయం వచ్చింది. ఆ ఐదో కంటెస్టెంట్ ఎవరో ప్రకటించడానికి మారుతి, రాశీ ఖన్నా హౌస్‌లోకి వెళ్లారు. వీళ్లిద్దరూ ఒకరిని బయటికి తీసుకొస్తారు.
✦ ‘ప్రతిరోజూ పండగే’ దర్శకుడు మారుతి, హీరోయిన్ రాశీ ఖన్నా బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. నాగార్జున కోరిక మేరకు రాశీ ఖన్నా ఒక పాట పాడారు. ‘తెలుసా తెలుసా’ అంటూ ఎంతో మధురంగా పాడారు.
✦ హీరోయిన్ కేథరిన్ త్రెసా అదరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ‘ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బుజ్జులు’ అంటూ డ్యాన్స్ షోను షురూ చేశారు. తాను సినిమాల్లో దుమ్మురేపిన పాటలకు బిగ్ బాస్ వేదికపై అదిరిపోయే స్టెప్పులేశారు.
✦ ఆ తరవాత హౌస్‌లో 100 రోజుల ప్రయాణాన్ని టాప్ 5 కంటెస్టెంట్లకు చూపించారు. ఇది వాళ్లకు ఇచ్చిన గిఫ్ట్ అని నాగార్జున చెప్పారు.
✦ కిచెన్ అంటే తనకు ఇష్టమని బాబా భాస్కర్ చెప్పాడు. అలాగే, గార్డెన్ ఏరియా అంటే ఇష్టమని వరుణ్, బాత్‌రూం అంటే తనకు ఇష్టమని రాహుల్, జిమ్ తన ఫేవరేట్ ప్లేస్ అని అలీ వరుసగా చెప్పారు.
✦ హౌస్‌లో కోర్టు యార్డ్ అంటే తనకు ఎంతో ఇష్టమని శ్రీముఖి చెప్పింది. తన తల్లి అక్కడి నుంచే లోపలికి వచ్చింది కాబట్టి ఆ ప్లేస్ అంటే ఇష్టమని చెప్పింది.
✦ ఈ పెర్ఫార్మెన్స్ అయిపోయాక ‘‘రాహుల్ చింపేశావు’’ అంటూ పునర్నవి మంచి జోష్ అంది. వెంటనే నాగార్జున అందుకుని.. చింపేశాడా.. చింపేశారా? అని అడిగారు. అందరూ బాగా చేశారు, చింపేశారు అంటూ పునర్నవి కవర్ చేసింది.
✦ రాహుల్ పాటతో అదరగొడితే.. ఆ రిథమ్‌కు తగ్గట్టుగా శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ స్టెప్పులేశారు.
✦ పునర్నవి కోరిక మేరకు రాహుల్ ఒక పాట పాడారు. ‘శ్రీముఖి అయినా.. అలీ రెజా అయినా..’ అంటూ తానే టేబుల్‌పై డప్పు వాయిస్తూ పాటతో అదరగొట్టాడు రాహుల్.
✦ వరుణ్ సందేశ్ అమ్మమ్మ రాజ్యలక్ష్మి గారు మరోసారి ఆకట్టుకున్నారు. నాగార్జున అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అంతేకాదు.. నాగార్జున సినిమాలు ‘గీతాంజలి’లోని ‘ఏ’ అనే డైలాగు.. ‘మనం’ సినిమాలోని శ్రియతో అనే ‘ఇది అక్కడ పెట్టు – ఐ లవ్ యూ’ అనే సీన్లు తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.
✦ బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్లలో తన ఫేవరెట్ రాహుల్ అని పునర్నవి చెప్పింది. దీంతో అక్కడ అరుపులు కేకలు. రాహుల్ టాప్ 5కి వస్తాడని ఊహించలేదని, టికెట్ టు ఫినాలే అతనికే వచ్చిందని, ఇక విన్నర్ అవుతాడా? లేదా అన్నది ప్రేక్షకులు నిర్ణయిస్తారు అని పునర్నవి చెప్పింది.
✦ తాను ప్రస్తుతం ‘జా’ అనే సినిమాలో నటిస్తున్నానని హిమజ చెప్పింది. హౌస్‌లో తన రచ్చ చూసి దెయ్యం పాత్రలు వస్తున్నాయని అన్నది.
✦ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల గురించి హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారని, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారని అడిగారు.
✦ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అంతా గ్రాండ్ ఫినాలేలో భాగం అయ్యారు. ప్రేక్షకులు, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులతో పాటు వీరిని కూడా వేదిక వద్ద కూర్చోబెట్టారు.
✦ శివజ్యోతి, రవికృష్ణ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో షో ప్రారంభమైంది. ‘రాములో రాములా’ పాటకు వీరిద్దరూ డ్యాన్స్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *