బంద్‌ ప్రశాంతం

0
  • మోదీ ప్రభుత్వ విధానాలపై కదంతొక్కిన కార్మిక వర్గం
  • రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, కనీస వేతనం రూ.21 వేలు చేయాలని, లేబర్‌ కోడ్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు, ఎన్‌ఆర్‌సీ, సీసీఏ, ఎన్‌పీఆర్‌ల రద్దు కోరుతూ వామపక్షాలు, ముస్లిం మైనారిటీ వర్గాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్‌ రాష్ట్రంలో ప్రశాంతంగా సాగింది. అన్ని జిల్లాల్లోనూ కార్మిక, ఉద్యోగ సంఘాలు, వామపక్ష నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. బ్యాంకులు, పాఠశాలలు, పరిశ్రమలు మూతబడ్డాయి. ప్రజారవాణా వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. అనంతపురంలో ఉదయం నుంచే ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, విద్యార్థి సంఘాల నాయకులు, కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. విశాఖలో ఉదయం 5.30 నుంచే ఉద్యమకారులు రోడ్డెక్కారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం నేత సీహెచ్‌ నరసింగరావు సహా 25 మందిని అరెస్టు చేశారు.

           స్టీల్‌ప్లాంట్‌లో 90% మంది కార్మికులు విధులు బహిష్కరించారు. నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో కార్మికులు, ముస్లింలు భారీ సంఖ్యలో ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. కార్మికులు, ఉద్యోగుల నినాదాలతో పశ్చిమ గోదావరి హోరెత్తింది. విజయనగరం, తూర్పుగోదావరిలో బంద్‌ ప్రభావం పాక్షికంగా కనిపించింది. శ్రీకాకుళం జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. కడప జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. విజయవాడలోనూ బంద్‌ ప్రభావం కనిపించింది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతబడ్డాయి. సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం, కాంగ్రెస్‌ నేతలు బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

 

 

Leave a Reply