ఇంగ్లీష్ మీడియం వికసించిందా వికటించిందా ?
నాడు నేడు పేరుతో ఏపీలోని 57000 స్కూళ్లు 16000 కోట్ల రూపాయల ఖర్చుతో రూపురేఖలు మార్చడానికి చేపట్టిన బృహత్ కార్యక్రమం. మొదటి దశలో 15715 స్కూళ్ళు 3700 కోట్ల ఖర్చుతో చేపట్టడం అభినందనీయం. రెండవ దశ పనులు మొదలైనా నిధుల కొరత కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. తుదిదశ గురించి ఉలుకూ లేదు పలుకు లేదు. ఇవి కాకుండా మండల స్థాయి, ఇతర పెద్దస్కూళ్లు నాబార్డ్ నిధులతో చేపడతాం అని 5 ఏళ్ళుగా చెవుతున్నా ముందుకు వెళ్లిన దాఖలాలు లెవ్వు.
నాడు నేడు కార్యక్రమం ద్వారా మరుగుదొడ్లు, మంచినీరు, కాంపౌండ్ వాల్ , రంగులు, ఫాన్స్, తరగతి గదులు ఇలా 12 గణనీయమైన మార్పులు జరిగాయి అని చెపుతున్నా అసలు విషయం గురించి అదేనండి బోధనా సిబ్బంది కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లెవ్వు. పంతులు బాగుంటే పంచకింద కూర్చున్నా చదువు వస్తుంది అంటారు. ఈ చిన్న లాజిక్ ని ఉద్దండులైన ఐఏఎస్ అధికారులు అప్పుడు రాజశేఖర్, మురళి , ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఎలా మర్చిపోయారో, లేదా ప్రియారిటీగా ఎందుకు గుర్తించలేదో అర్ధం కావటం లేదు.
వాస్తవంగా చూస్తే ఇటీవల కాలంలో విద్య, ఆరోగ్యం విషయాల్లో గణనీయమైన మార్పులతో ప్రజామోదం పొందింది ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం. విద్య విషయంలో ఢిల్లీ లోని స్కూల్ టీచర్స్ స్కిల్స్ అస్సేస్మెంట్ చేసి సుమారు 1000 పైగా టీచర్స్ వివిధ విభాగాళ్ళో గుర్తించి వారిని హార్వర్డ్, కేంబ్రిడ్జి లాంటి ప్రపంచంలోని ఉన్నత విద్యాలయాలకు శిక్షణకు పంపి , వచ్చిన తరువాత వారిని మాస్టర్ ట్రైనర్స్ గా వాడుకొని ఇతర టీచర్స్ కి ట్రైనింగ్ ఇప్పించడం, తరువాత ఉద్యోగసంఘాలను ఒప్పించి పారదర్శకంగా పోస్టింగ్స్ ఇవ్వడం, కొద్దిరోజుల్లోనే గణనీయ మార్పులు రావడం, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వం తెస్తున్న మంచి మార్పులను గుర్తించి CSR ఫండింగ్ ద్వారా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి తోడ్పడటం చెకచెకా జరిగిపోయాయి.
2019లో ప్రభుత్యం మారకముందే ఢిల్లీ ప్రభుత్వ విద్యావిధానాన్ని నాబోటివాళ్ల ద్వారా విన్న పార్టీ అభిమానులు కొందరు ఢిల్లీ స్కూళ్ళు చూడటం, వచ్చిన తరువాత ప్రభుత్వంలో పదవులు చేపట్టటం జరిగిందికాని, ఢిల్లీ విద్యావిధానంలో సంస్కరణలు పాటించలేదు. పైగా ముందు చేయాలసింది వెనుక, వెనుక చేయాలసింది ముందు చేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
ఇంత పెద్ద ఎత్తులో స్కూల్ infrastruture అభివృద్ధితో పాటు అమ్మవడి , విద్యాదీవెన, వసతిదీవెన, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, ఐబీ అంటూ అనేక కార్యక్రమాలు చేపట్టినా 2021-22లో 44 లక్షల పైచిలుకుకి పెరిగిన స్కూల్ ఎన్రోల్ల్మెంట్ 2023-24లో సుమారు 35.5 లక్షలకు పడిపోవటం, అమ్మవాడి తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళకి బారులు తీరటం దేనికి సంకేతం? వేల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి నాణ్యమైన విద్య ప్రభుత్వపాఠశాలలలో దొరకడంలేదు అని అమ్మవడి అందుకొన్న తల్లులు భావించేలాచేయడం మంచిది కాదు.
ఇప్పటికైనా అధికారులు లోపాలు గుర్తించి ఉపాధ్యాయుల నాణ్యతా ప్రణామాలు పెంచి, టీచర్స్ ని మార్పులో ముఖ్య భూమిక పోసించేలా చేసి, వారికి గౌరవం పెరిగేలా చూసి ప్రజలు ప్రభుత్వ సేవలకు ముగ్దులాయేలా ప్రవర్తించాలి.
నాడు నేడు ద్వారా ఇప్పటివరకు ప్రభుతం చేసిన విద్యా సంస్కరణలు గుర్తించి ఎక్కువసంఖ్యలో అధికార పక్షానికి ఓట్లు వేసారా, లేదు ప్రభుత్వం చెప్పింది ఎక్కువ, చేసింది తక్కువ, చేయవలసింది చాలా ఉంది, ప్రభుత్వ పాఠశాలల చదువుపై నమ్మకంలేదు మార్పు కావాలి అని ప్రతిపక్షాన్ని ఆదరించారా తెలియాలంటే జూన్ 4న బాక్సులు బద్దలయేదాకా ఆగాలసిందే.