‘నా భర్త కొడుతున్నాడు, కాపాడండి’ – దిశ యాప్‌లో కుటుంబ సమస్యల ఫిర్యాదులే అధికం అంటున్న పోలీసులు

0

ఆపద సమయాల్లో మహిళల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌లో ఎక్కువగా కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. నాలుగు రోజుల్లో సుమారు 50 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది.

విశాఖ, కృష్ణా జిల్లాల నుంచి భర్తల వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రాగా, సోదరుని వరుసయ్యే వ్యక్తి వేధిస్తున్నాడంటూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి, అలాగే ఓ వ్యక్తి తనను తరచు వేధిస్తున్నాడంటూ తూర్పు గోదావరి జిల్లా నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

వెంటనే స్పందించిన పోలీసులు కుటుంబ సమస్యల విషయంలో కౌన్సిలింగ్ ఇప్పిస్తుండగా.. వేధింపుల విషయంలో తక్షణం వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని బాధితులకు భరోసా కల్పిస్తున్నారని ఈ వార్తలో పేర్కొంది.

అదే సమయంలో యాప్ పని చేస్తోందా లేదా అంటూ రోజుకు సుమారు 2 వేల మంది అందులోని ఫీచర్లను వినియోగిస్తున్నారని కూడా తెలిపింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం ఉన్న ఈ యాప్ మరో నాలుగైదు రోజుల్లో ఐఓఎస్ ప్లాట్ ఫాంపై కూడా లభించనుందని ఈనాడు తన వార్తలో వెల్లడించింది.

Leave a Reply