‘టిక్‌టాక్‌ ప్రో’ ఎర క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ

Spread the love

*‘టిక్‌టాక్‌ ప్రో’ ఎర క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ!* *సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ*

*12 కోట్ల మంది టిక్‌టాక్‌ యూజర్లే లక్ష్యంగా గాలం*

*ఎస్సెమ్మెస్‌ల ద్వారా యూఆర్‌ఎల్‌ మాల్‌వేర్‌ లింకులు*

*క్లిక్‌చేస్తే వ్యక్తిగత సమాచారం గల్లంతు: పోలీసుల హెచ్చరిక*

*అటువంటి మెసేజ్‌లు వస్తే సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు చేయండి*

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వేళ సైబర్‌ నేరగాళ్లు రూటుమార్చారు. ఇటీవల ఆరోగ్యసేతు, పీఎం కేర్స్‌ పేరిట నకిలీ రిక్వెస్టులు పంపి ఖాతాలు ఖాళీచేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు తమ మోసాలకు భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్‌ను ఎంచుకున్నారు. టిక్‌టాక్‌ యూజర్లే లక్ష్యంగా సెల్‌ఫోన్లకు యూఆర్‌ఎల్‌ మాల్‌వేర్‌ లింకులను ఎస్సెమ్మెస్‌ రూపంలో పంపుతున్నారు. టిక్‌టాక్‌ రూపుమారిందని, దీని కోసం ‘టిక్‌టాక్‌ ప్రో’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, అందుకు కింది నీలంరంగు లింకును క్లిక్‌ చేయాలని సూచిస్తున్నారు. ఆ లింకులో వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం దొంగిలించే మాల్‌వేర్‌ ఉంటుంది. క్లిక్‌చేస్తే మాల్‌వేర్‌ వ్యక్తిగత కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలోకి చొరబడుతుందని, బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుందని తెలంగాణ పోలీసుశాఖ చెబుతోంది. క్షణాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తోంది. టిక్‌టాక్‌ పేరుతో వచ్చే వినతులకు స్పందించవద్దని, సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచి స్తోంది. లాక్‌డౌన్‌ కాలంలో ఆన్‌లైన్‌ వినియోగం పెరిగింది. పీఎం కేర్స్, ఆరోగ్యసేతు యాప్‌ల డౌన్‌లోడ్లు అనూహ్యంగా పెరిగాయి. ఇది గమనించిన సైబర్‌ నేరగాళ్లు వాటి పేరుతో ప్రభుత్వోద్యోగులకు రకరకాల లింకులుపంపి అంతర్గత రహస్యాలు తస్కరించేందుకు, బ్యాంకు ఖాతాలకు కన్నమేసేందుకు యత్నించారు. పలుచోట్ల రూ.కోట్లు కొల్లగొట్టారు. తాజాగా టిక్‌టాక్‌ వినియోగదారులపై సైబర్‌ నేరగాళ్ల కన్ను పడింది. ఇటీవల భారత ప్రభుత్వం చైనాకు చెందిన ఈ యాప్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. టిక్‌టాక్‌ ఆదాయంలో 30 శాతం భారత్‌ నుంచే వస్తోంది. భారత్‌లో 2016 నుంచి ఈ యాప్‌ను 24 మంది కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకోగా, యాప్‌ నిషేధానికి గురైన జూన్‌ 29 నాటికి 12 కోట్ల మందికిపైగా వినియోగిస్తున్నారు. రాత్రికి రాత్రి యాప్‌ ఆగిపోవడంతో యూజర్లు షాక్‌తిన్నారు. టిక్‌టాక్‌ లేకపోవడంతో ముఖ్యంగా దీనిపై ఆధారపడిన యువత, నటులు, మోడళ్లకు ఊపిరాడటంలేదు. వీరంతా ప్రత్యామ్నాయ మార్గాల్లో టిక్‌టాక్‌ యాప్‌ కోసం అన్వేషిస్తున్నారు. ఇది గుర్తించిన సైబర్‌ నేరగాళ్లు ‘టిక్‌టాక్‌ ప్రో’ పేరుతో ఎరవేస్తున్నారు. *సెలబ్రిటీలు, ప్రభుత్వోద్యోగులు చిక్కితే..* టిక్‌టాక్‌ యాప్‌ వినియోదారుల్లో యువతతోపాటు సెలబ్రిటీలు, నటులు, ఉద్యోగులు ఉన్నారు. టిక్‌టాక్‌ వల్ల కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారారు. టిక్‌టాక్‌కు బానిసలైన వీరికి ‘టిక్‌టాక్‌ ప్రో’ ప్రత్యామ్నాయ యాప్‌ అంటూ సైబర్‌ నేరగాళ్లు గాలమేస్తున్నారు. వారికి తెలియకుండా రహస్య మాల్‌వేర్‌ను లింకుల్లో చొప్పిస్తున్నారు. వెంటనే సదరు వ్యక్తుల స్మార్ట్‌ఫోన్లు, పర్సనల్‌ కంప్యూటర్లలోని సమాచారం, రహస్యాలు, బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. వ్యక్తిగత రహస్యాలు చేజిక్కితే.. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. ప్రభుత్వంలోని కీలకశాఖల్లో పనిచేసే వారి కంప్యూటర్లలోకి ఈ వైరస్‌ జొరబడితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహస్యాలు విదేశీయుల చేతికి చిక్కినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వినోదం కోసమంటూ వెళ్తే చివరికి విషాదమే మిగులుతుందని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *