రోజ్ కాలెంబా గత ఏడాది ఒక బ్లాగ్‌లో “14 ఏళ్ల వయసులో తనపై అత్యాచారం జరిగిందని, ఒక పోర్న్ సైట్‌లో ఉన్న ఆ లైంగిక దాడి వీడియోలను తొలగించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాని” చెప్పారు.
ఆ తర్వాత చాలా మంది ఆమెను సంప్రదించారు. తాము కూడా అలాంటి కఠిన పరిస్థితుల్లోనే ఉన్నామని చెప్పారు.
హెచ్చరిక: ఈ కథలో హింసాత్మక లైంగిక దాడి ప్రస్తావన ఉంది.
రోజ్ ఉన్న ఆస్పత్రిలోకి ఒక నర్స్ వచ్చి కాసేపు ఆగారు. తర్వాత వెళ్లిపోతూ ఆమె వైపు చూసి “మీకు ఇలా జరగడం చాలా బాధాకరం. నా కూతురిపై కూడా ఇలాగే అత్యాచారం జరిగింది” అన్నారు.
అత్యాచారం జరిగిన తర్వాత రోజును ఆమె గుర్తుచేసుకున్నారు. “ఆరోజు నా దగ్గరకు వచ్చిన పోలీస్, డాక్టర్‌లో ఎలాంటి భావోద్వేగం కనిపించలేదు” అన్నారు.
రాత్రంతా తనపై జరిగిన హింసాత్మక దాడి గురించి వారికి చెప్పినప్పుడు, దానికి వారందరూ ‘ఆరోపణ’ అనే పదాన్ని ఉపయోగించారు.
వారేకాదు, ఆమె నాన్న, నానమ్మ తప్ప బంధువుల్లో ఎక్కువమంది రోజ్ మాటలు నమ్మలేదు.
నర్స్ అయినా నమ్మారు
నర్సు చెప్పింది విని, ఎవరో ఒకరు తనను నమ్మారు అనే ఆమెలో ఒక ఉపశమనం కలిగింది. ఇక తను కోలుకోగలనని కూడా అనుకున్నారు.
కానీ, కొన్నిరోజుల్లోనే కొన్ని వేల మందికి ఆమె రేప్ వీడియో చేరిపోయింది. ఆ వీడియో చూసినవారికి ఆమెపై ఎలాంటి జాలీ కలగలేదు.
అది జరిగిన దశాబ్దం తర్వాత, రోజ్ కాలెంబా అద్దంలో చూసుకుంటూ తన నల్లటి జుట్టు దువ్వుకుంటున్నారు,
14 ఏళ్ల వయసులో తనపై లైంగిక దాడి జరిగిన తర్వాత, తన ముఖం చూసుకోవాలంటే భయపడిన, ఆమె ఇంట్లో ఉన్న అన్ని అద్దాలనూ మూసేశారు.
ఇప్పుడు రోజ్ వయసు 25 ఏళ్లు. రోజువారీ జీవితంలో ఆమె తనకోసం, తన జుట్టు కోసం కొంత సమయాన్ని ఉపయోగిస్తున్నారు.
ఆమె తన మనసులో వచ్చిన ప్రతి విషయాన్ని డైరీలో రాస్తుంటారు.
రోజ్‌కు ఆరోజు ఏం జరిగింది
రోజ్ అమెరికా ఒహాయో రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణంలో పెరిగింది. రాత్రి పూట రోజూ ఆమె తన ఇంటి చుట్టూ కాసేపు తిరుగుతుంది. ఆ నిశ్సబ్దం, ప్రశాంతత, తాజా గాలి తనకు ఇష్టం.
ప్రతిరోజూ లాగే, 2009 వేసవికాలంలో ఒక రాత్రి ఆమె బయటకొచ్చింది. అప్పుడు రోజ్ వయసు 14 ఏళ్లు. కానీ, ఆ రోజు తన జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోతుందని ఆమె అనుకోలేదు.
రోజ్ అలా నడుస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక వ్యక్తి నీడలోంచి బయటికొచ్చాడు. ఆమె మెడకు కత్తి పెట్టి బలవంతంగా తన కారులో ఎక్కించాడు. అందులో అప్పటికే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతడికి 19 ఏళ్లు ఉంటాయి. ఆమె టౌన్‌లో తనను అంతకు ముందే చూసింది.
వాళ్లు రోజ్‌ను కార్లో పట్టణానికి దూరంగా ఉన్న ఒక ఇంట్లోకి తీసుకెళ్లారు. దాదాపు 12 గంటలపాటు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. జరిగేదంతా వీడియో తీస్తున్నాడు.
రోజ్ షాక్‌లో ఉంది. శ్వాస తీసుకోడానికి కూడా కష్టంగా ఉంది. ఆమెను చాలా తీవ్రంగా కొట్టారు. ఎడమ కాలుపై కత్తితో పొడిచారు. బట్టలన్నీ రక్తంతో తడిచిపోయాయి. ఆమె మాటిమాటికీ స్పృహ తప్పిపోతోంది.
ఆరోజు జరిగిన మరో విషయం కూడా రోజ్‌కు గుర్తొచ్చింది. వారిలో ఒక వ్యక్తి లాప్‌టాప్‌లో వేరే మహిళపై జరిగిన అత్యాచారాలను ఆమెకు చూపిస్తున్నాడు.
ఆ ముగ్గురూ తెల్లగా ఉన్నారు. అత్యాచారం చేసిన తర్వాత వారు చంపేస్తామని రోజ్‌ను బెదిరించారు. ఆమె బలమంతా కూడదీసుకుని వారితో మాట్లాడేందుకు ప్రయత్నించింది. తనను వదిలేస్తే జరిగిన దాని గురించి ఎవరికీ చెప్పనని, మీ గుర్తింపు బయటపెట్టనంది.
దాంతో, ముగ్గురూ ఆమెను అదే కార్లో తీసుకెళ్లి తన ఇంటికి దగ్గరగా ఉన్న ఒక రోడ్డు మీద పడేశారు.
ఆత్మహత్యాయత్నం చేశారు.
రోజ్ ఇంట్లోకి వెళ్లగానే అద్దంలో తన ముఖం చూసుకుంది. తల నుంచి రక్తం కారుతోంది. ఆమె తండ్రి రాన్, కుటుంబంలోని మిగతావారు హాల్లో లంచ్ చేస్తున్నారు. రోజ్‌కు ఉన్న రక్తం చూసి ఏమైంది అని అడిగారు. ఆమె వారికి జరిగిందంతా చెప్పింది.
“మా నాన్న పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్లు నాకు వెంటనే కాస్త ఉపశమనం కలిగేలా చేశారు. కానీ, మిగతా వాళ్లు మాత్రం ‘చీకటిపడ్డాక బయట తిరగడం వల్లే ఇదంతా జరిగింది’ అని ఏదేదో అన్నారు”.
ఎమర్జెన్సీ రూంలో ఉన్న రోజ్‌ను ఒక మగ డాక్టర్, ఒక మగ పోలీస్ అధికారి కలిశారు.
“వాళ్లిద్దరూ నాతో చాలా దారుణంగా మాట్లాడారు. వారికి అసలు జాలి, దయ ఉన్నట్లు కూడా నాకు అనిపించలేదు”.
పోలీసులు నన్ను “ఇదంతా నీ ఇష్టప్రకారమే జరిగిందా, రాత్రి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చావా అని ప్రశ్నించారు. వాళ్ల మాటలు నా బాధను మరింత పెంచాయి”.
“నన్ను కొట్టారు. కత్తితో పొడిచారు. రక్తం కూడా వస్తోంది చూడండి, ఇదంతా నా ఇష్టంతో జరగలేదు” అని ఆమె వారికి చెప్పింది.
రోజ్ ఇంకా షాక్‌లోనే ఉంది. కానీ తనపై అత్యాచారం ఎవరు చేశారో తనకు తెలీదని చెప్పింది. పోలీసుల దగ్గర కూడా ఎలాంటి ఆధారాలు లేవు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రోజు రోజ్ ఆత్మహత్యాయత్నం చేసింది. మళ్లీ జీవితం మామూలుగా ఎలా గడపాలో ఆలోచించలేకపోయింది. సోదరుడు సమయానికి ఆమెను కాపాడాడు.
కొన్ని నెలల తర్వాత రోజ్ ‘మై స్పేస్’లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు, తన స్కూల్లోని చాలా మంది ఒక లింక్ షేర్ చేస్తుండడం కనిపించింది.
అందులో తన పేరు ట్యాగ్ చేసుంది. ఆమె దానిపై క్లిక్ చేయగానే పోర్న్ వెబ్‌సైట్, పోర్న్‌హబ్ ఓపెన్ అయ్యింది.
అక్కడ తనపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి. అవి చూసిన ఆమె వాంతి చేసుకుంది.
నా ఇష్ట ప్రకారమే చేశానని అన్నారు
ఆమె వీడియోలకు ‘టీన్ క్రయింగ్ అండ్ గెటింగ్ స్లాప్డ్ అరౌండ్’, టీన్ గెటింగ్ డెస్ట్రాయిడ్’, ‘పాస్డ్ అవుట్ టీన్’, అని రకరకాల టైటిల్స్ పెట్టారు.
వాటిలో ఒక వీడియోను 4 లక్షల వ్యూస్ ఉండడం తనకు కనిపించిందని రోజ్ గుర్తు చేసుకున్నారు.
“నేను స్పృహతప్పిన స్థితిలో, నాపై లైంగిక దాడి జరుగుతున్న వీడియో వాటిలో ఉండడం చూసి చాలా దారుణంగా అనిపించింది” అన్నారు.
ఆ వీడియోల గురించి తన కుటుంబానికి ఏం చెప్పకూడదని ఆమె నిర్ణయించుకుంన్నారు. కానీ, ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే ఆమె స్కూల్లో చాలా మంది ఆ వీడియోలు చూసేశారు.
“స్కూల్లో నన్ను వేధించారు. నేను నా ఇష్టప్రకారమే అదంతా చేశానని అనేవారు. నేను మగాళ్లను రెచ్చగొడతానని, వేశ్యనని తిట్టేవారు”.
“కొంతమంది అబ్బాయిలకైతే వాళ్ల అమ్మనాన్నలు నాకు దూరంగా ఉండాలని చెప్పారు. నేను వారిని రెచ్చగొట్టి వారిపై రేప్ ఆరోపణలు చేస్తానని భయపెట్టారు”
“బాధితులపై ఆరోపణలు చేయడం జనాలకు చాలా సులభం కదా” అంటారు రోజ్.
లాయరులా పోర్న్‌హబ్‌కు ఈ-మెయిల్
2009లో దాదాపు ఆరు నెలలపాటు పోర్న్‌హబ్‌కు ఎన్నో ఈమెయిల్స్ పంపానని, ఆ వీడియోలు తొలగించాలని కోరానని రోజ్ చెప్పారు.
“నేను పోర్న్‌హబ్‌కు ఈ-మెయిల్ పంపించాను. ప్లీజ్, నేను మైనర్‌ని, నాపై లైంగిక వేధింపులు జరిగాయి. ప్లీజ్ వాటిని తొలగించండి అని వేడుకున్నాను. కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ వీడియోలు సైట్‌లో అలాగే ఉండిపోయాయి”.
“ఆ ఏడాదంతా నేను అందరికీ దూరంగా ఒంటరిగా ఉండిపోయాను. నిశ్శబ్దంగా నాలో నేనే కుమిలిపోయేదాన్ని. కొత్తవాళ్లెవరైనా కలిస్తే వాళ్లు కూడా ఆ వీడియో చూశారేమో అని లోలోపలే భయంగా అనిపించేది”.
తన ముఖం తాను చూసుకోడానికి భయపడ్డ రోజ్, ఇంట్లో ఉన్న అద్దాలన్నీ తీసేశారు. చీకట్లోనే బ్రష్ చేసుకునేవారు. ఎప్పుడూ ఆ వీడియోలు ఎవరైనా చూస్తున్నారేమో అని ఆలోచిస్తుండేవారు.
తర్వాత ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. రోజ్ ఒక కొత్త ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేశారు. తనను ఒక లాయర్‌గా చెబుతూ, వీడియోలు తొలగించకపోతే చట్టపరమైన యాక్షన్ తీసుకుంటానంటూ పోర్న్‌హబ్‌కు ఈ-మెయిల్ పంపారు.
అంతే, 48 గంటల్లో ఆమె వీడియోలన్నీ ఆ వెబ్ సైట్ నుంచి మాయమయ్యాయి.
కొన్ని నెలల తర్వాత రోజ్‌కు కౌన్సెలింగ్ జరిగింది. ఆమె తనపై ఎవరు దాడిచేశారో సైకాలజిస్టులకు చెప్పారు. చట్టప్రకారం వారు ఆ విషయం పోలీసులకు చెప్పాలి. అది పోలీసులకు తెలిసింది. కానీ వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోల గురించి మాత్రం పోలీసులకు, ఆమె కుటుంబానికి తెలీలేదు.
పోలీసులు రోజ్, ఆమె కుటుంబం వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుల తరఫు లాయర్ అదంతా ఆమె అంగీకారంతోనే జరిగిందని వాదించాడు. దాంతో వారంతా రేప్ ఆరోపణల నుంచి నిర్దోషులుగా బయటికొచ్చారు.
వారికి కఠిన శిక్ష వేయించడానికి రోజ్, ఆమె కుటుంబం దగ్గర తగిన శక్తిగానీ, వనరులుగానీ లేకుండా పోయాయి.
రోజ్ తండ్రి రాన్ కొలెంబా గత కొన్నేళ్లుగా తన కూతురికి జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోయారు. “ఆ లైంగిక దాడి తర్వాత ఆమె మారిపోయింది. మొదట్లో తను చాలా బాగా చదివేది. కానీ, ఆ ఘటన తర్వాత క్లాసులు ఎగ్గొట్టడం, హోంవర్క్ వదిలేయడం చేసేది” అన్నారు.
పదేళ్ల తర్వాత వీడియోల గురించి తెలిసింది
పోర్న్ హబ్ వీడియో గురించి, లైంగిక దాడికి గురయ్యానని 2019లో రోజ్ రాసిన సోషల్ మీడియా బ్లాగ్ వైరల్ అయినప్పుడు ఆమె తండ్రి రాన్‌కు వీడియోల గురించి తెలిసింది.
కూతురి వీడియోను చాలామంది చూశారని, ఆమెను స్కూల్లో వేధించారని కూడా ఆయనకు తెలీదు.
వివరణ ఇచ్చిన పోర్న్‌హబ్
రోజ్ కొన్నేళ్ల వరకూ డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయింది. ఏదో ఒకటి రాస్తూ తనకు తాను బిజీగా ఉండేది. తన బ్లాగ్‌లో, సోషల్ మీడియాలో తనకు ఏం జరిగిందో చెప్పేది. ఒక్కోసారి తన గుర్తింపు బయటపెట్టకుండా, ఒక్కోసారి అసలు పేరుతో వాటిని రాసేవారు.
2019లో ఒకరోజు ఆమె సోషల్ మీడియాలో పోర్న్‌హబ్‌కు సంబంధించిన చాలా పోస్టులు చూశారు. వాటిలో ఆ కంపెనీ తేనెటీగల సంరక్షణ కోసం చారిటీ ఇవ్వడం, గృహ హింస బాధితులకు సాయం చేయడం, ఆ మహిళలకు 25 వేల డాలర్ల ఆర్థిక సాయం అందించడం గురించి జనం పోర్న్‌హబ్‌పై ప్రశంసలు కురిపించారు.
“మనం సోషల్ మీడియాలో ఉంటే పోర్న్‌హబ్‌ను పట్టించుకోకుండా ఉండడం చాలా కష్టం. అది తనను మంచిగా చూపించుకోడానికి ఎన్నో ప్రయత్నాలూ చేస్తుంది. పోర్న్‌ను చాలా ఆకర్షణీయంగా మార్చింది. కానీ నా వీడియో లాంటి టైటిల్స్ ఉన్న ఎన్నో వీడియోలు ఇప్పటికీ వారి వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అందులో ఉన్నవారు రేప్‌కు గురయ్యారా, లేక బాధితులకు ఆ వీడియోల గురించి సమాచారం ఉందా అనేది తెలుసుకోవడం చాలా కష్టం” అంటారు రోజ్.
రోజ్ తనపై జరిగిన రేప్ గురించి వివరంగా రాసిన ఒక బ్లాక్ వైరల్ అయ్యింది. తను లాయర్‌లా ఈమెయిల్ పంపి బెదిరించేవరకూ పోర్న్‌హబ్ కళ్లు మూసుకుందని ఆమె అందులో ఆరోపించారు.
ఆ పోస్ట్ చూసిన తర్వాత ఎంతోమంది మహిళలు, కొంతమంది పురుషులు రోజ్‌ను కలిశారు. ఆమెపై జరిగిన లైంగిక వేధింపుల వీడియో ఆ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ ఉందని చెప్పారు.
రోజ్ వీడియోలు ఇంకా వెబ్‌సైట్‌లో ఎందుకు ఉన్నాయని బీబీసీ పోర్న్‌హబ్‌ను ప్రశ్నించింది.
అది బీబీసీకి ఇచ్చిన ఒక ప్రకటనలో “పోర్న్‌హబ్‌పై ఆమె చేస్తున్న ఆరోపణలు 2009లో జరిగినవి. అది ప్రస్తుత యజమానులు రావడానికి చాలా ముందు జరిగింది. అప్పుడు దీనిని ఎలా పరిష్కరించారో మాకు తెలీదు. ఇప్పుడు కంపెనీ యాజమాన్య హక్కులు మారిన తర్వాత అనధికార, చట్టవిరుద్ధమైన వీడియోలను ఎదుర్కోడానికి పోర్న్‌హబ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, విధానాలు అమలు చేస్తోంది” అని చెప్పారు.
దానితోపాటు “మైనర్లపై జరిగే లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలను అడ్డుకోడానికి కూడా మేం కట్టుబడి ఉన్నాం. వొబిల్ పేరుతో ఒక థర్డ్ పార్టీ స్పైవేర్ ఉపయోగిస్తున్నాం. అది కొత్తగా అప్‌లోడ్ చేసే వీడియోల్లో అనధికార వీడియోలు ఉంటే వాటిని అడ్డుకుంటుంది. అవి ఎప్పటికీ మా ప్లాట్‌ఫాంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది” అన్నారు.
పోర్న్‌హబ్‌లో రోజ్ వీడియో టైటిల్లాగే పేర్లు ఉన్న వీడియోల గురించి ప్రశ్నించినపుడు “మేం అన్నిరకాల సెక్సువల్ ఎక్స్‌ప్రెషన్‌లను అనుమతిస్తాం. మా నిబంధనలు షరతులకు లోబడి ఉంటాయి. ఎవరికైనా, ఎప్పుడైనా ఈ ఫాంటసీ సరిగా అనిపించకపోతే, వారు దాని గురించి ప్రపంచవ్యాప్తంగా అపీల్ చేస్తారు. భావ ప్రకటనా స్వేచ్ఛ చట్టం కింద వారి ప్రయోజనాలను కూడా కాపాడాలి” అన్నారు.
అక్రమ వీడియోల గురించి రిపోర్ట్ చేయడానికి పోర్న్‌హబ్ 2015లో ఒక ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. కానీ వెబ్‌సైట్‌లో లైంగిక వేధింపుల వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికీ వెలుగులోకి వస్తున్నాయి.
దీనిపై రోజ్ “అందరూ నాపై దశాబ్దం క్రితం జరిగింది, ఈరోజు వాస్తవం కాదని అనవచ్చు. కానీ అసలు సమస్య అసలు అది కాదు. నా బ్లాగ్ చూసిన మహిళలు, అలా ఇప్పటికీ జరుగుతోందని చెప్పారు” అన్నారు.
“ప్రపంచంలోని మిగతా భాగాల్లో అంటే మధ్యప్రాచ్యం, ఆసియా లాంటి ప్రాంతాల్లో పోర్న్ చాలా భారీ స్థాయిలో చూస్తారని నాకు తెలీదు. తమపై జరిగింది వేగంగా షేర్ అవుతోందని బాధితులకు తెలిసుంటుందని కూడా నాకు అనిపించడం లేదు”.
Source:BBC.com
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.