వైద్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణ…క్యాన్సర్ కి మందు కనుగొన్న శాస్త్రవేత్తలు.!
కేన్సర్ బాధితులకు గుడ్‌న్యూస్. ప్రాణాంతక వ్యాధిని అంతం చేసే మందు ఇక వచ్చేసినట్టే. అమెరికన్ పరిశోధకులు కనుగొన్న ఈ మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాల్ని చూపిస్తోంది. కేన్సర్ వ్యాధి ప్రాణాంతకమైంది. ఒకసారి వచ్చిందంటే చాలు ఇక మరణమే శరణ్యం. సరైన కాలంలో, సరైన చికిత్స ద్వారా ఆయుష్షు పెంచవచ్చేమో గానీ..పూర్తిగా నయం చేయడం ఇప్పటి వరకూ లేనేలేదు. అందుకే పగవాడికి కూడా రాకూడదంటారు. ఇప్పుడు కేన్సర్ బాధితులకు అమెరికా శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్ విన్పిస్తున్నారు. అత్యంత ప్రమాదకరంగా మారిన కేన్సర్‌పై తాజాగా ఓ ఔషధం కనుగొన్నారు. డొస్టార్లిమాబ్ పేరున్న ఈ ఔషధం కేన్సర్‌పై అద్భుతంగా పనిచేస్తున్నట్టు పరిశోదనల్లో తేలింది. కేన్సర్ బాధితులతో పాటు వైద్యరంగంలోనే ఈ మందు ఇప్పుడు కొత్త ఆశలు రేపుతోంది.
క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 18 మంది రోగులపై 6 నెలలపాటు ఈ ఔషధాన్ని ఇచ్చి చూశారు. కోర్సు పూర్తయ్యేనాటికి ప్రతి ఒక్కరిలో కేన్సర్ కణాలు పూర్తిగా అదృశ్యమైనట్టు పరిశోధకులు గుర్తించారు. ఎండోస్కోపీ, పెట్‌స్కాన్, ఎంఆర్ఐల్లో కూడా కేన్సర్ కణాల జాడే కన్పించలేదని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. వాస్తవానికి కేన్సర్ బాధితులు సర్జరీ చేయించుకున్న తరువాత లేదా కీమోథెరపీ, రేడియేషన్ తకరువాత కూడా కేన్సర్ కణాలు వెంటాడుతూనే ఉంటాయి. అటువంటిది ఈ కొత్త కేన్సర్ మందుతో అసలు ఆ జాడలే కన్పించకపోవడం నిజంగా ఆశ్చర్యం కల్గిస్తోంది. అంతేకాదు ఇతర అవయవాలకు కూడా ఈ వ్యాధి వ్యాపించలేదు. ఈ ఔషధంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా కన్పించలేదు.
అందుకే ఇప్పుడీ మందుపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొత్త ఆశలు రేపుతోంది. భారీ స్థాయిలో పరిశోధనలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కేన్సర్ వ్యాధి ఏటా లక్షలాదిమందిని బలి తీసుకుంటున్న తరుణంలో డొస్టార్లిమాబ్ మందు సత్ఫలితాల్ని అందిస్తే..వైద్య చరిత్రలో ఇదొక సరికొత్త విప్లవం కానుంది. ఏళ్ల తరబడి చేస్తున్న పరిశోధనలకు పరిష్కారం లభించవచ్చు. ఈ కొత్త మందును గ్లాక్సో స్మిత్‌క్లైన్ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు.