*కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత* *వ్యాధికి బలైన తొలి శాసనసభ్యుడు* *పుట్టినరోజు నాడే మృతి* ఈనాడు డిజిటల్, చెన్నై: కరోనా బారిన పడి దేశంలోనే తొలిసారి ఓ శాసనసభ్యుడు మృతి చెందారు. తమిళనాట చెపాక్ – ట్రిప్లికేన్ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ (62) బుధవారం ఉదయం కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జూన్ 2న ఆయన చేరారు. అనంతరం ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తుండగానే ఆరోగ్యం క్షీణించి మరణించారు. పుట్టినరోజు నాడే మృతిచెందడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అన్బళగన్ డీఎంకే తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ ఆదేశాల మేరకు లాక్‌డౌన్ సహాయక చర్యల్లో పాల్గొన్న సమయంలో ఆయన మహమ్మారి బారిన పడ్డారు. సినీ నిర్మాతగా, పంపిణీదారుగా కూడా వ్యవహరించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి, ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు సన్నిహితంగా ఉండేవారు. ఈ వార్త విని తానే దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నానని, ఇక ఆ కుటుంబాన్ని ఎలా ఓదార్చగలనని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్బళగన్ మృతిపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.