గాంధీజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలు..

Spread the love

భారత జాతిపిత మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. 20వ శతాబ్దంలో మానవాళిని గాంధీ అంతగా ప్రభావితం చేసిన మరో నాయకుడు లేడేమో అంటే అతిశయోక్తి కాదు. అంహిసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప యోధుడు గాంధీ. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బాపూజీ జీవితం గురించి పది ఆసక్తికర విశేషాలు మీకోసం..

  • గాంధీజీ ఐదేళ్లపాటు పండ్లు, గింజలు, నట్స్ మాత్రమే తిన్నారు. కానీ ఆరోగ్య సమస్యలు రావడంతో శాకాహారం తీసుకోవడం ప్రారంభించారు. ఆహారం విషయంలో గాంధీజీ దశాబ్దాలపాటు ప్రయోగాలు చేశారు. ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజం పేరిట ఆయన ఓ పుస్తకాన్ని రాశారు.
* పాల ఉత్పత్తులను మానేయాలని గాంధీజీ భావించారు. కానీ ఆరోగ్యం దెబ్బతినడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తర్వా మేకపాలు తాగడం ప్రారంభించారు. తాజా మేక పాల కోసం కొన్ని సందర్భాల్లో ప్రయాణాల్లోనూ ఆయన వెంట మేకను తీసుకెళ్లేవారు.

* గాంధీజీ భారత్ తిరిగొచ్చాక తొలిసారి చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నీలిమందు రైతుల తరఫున ఆయన పోరాడారు. ఆ సమయంలోనే రైతులు ఆయన్ను మహాత్మా అని సంబోధించారు. స్వాతంత్య్ర పోరాటానికి ముందే మహిళల హక్కుల కోసం గాంధీ పోరాడారు. అంటరానితనం నిర్మూలన కోసం, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని సమంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

* గాంధీ నిరాహార దీక్ష చేస్తుండగా.. ఆయన ఫొటోలు తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించేది కాదు. ఆయన ఫొటోలు బయటకెళ్తే.. స్వాతంత్య్ర పోరాటం ఎక్కడ తీవ్రతరం అవుతుందేమోననే భయమే దీనికి కారణం.

* గాంధీ 13వ ఏటే పెళ్లి చేసుకున్నారు. ఆయన కంటే కస్తూర్బా ఏడాది పెద్దవారు. వీరి దాంపత్యం 62 ఏళ్లపాటు కొనసాగింది.

Read Also: భారత గతిని మార్చిన గాంధీ పోరాటాలు..

* గాంధీ అహింసావాది కానీ.. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పోరాడటం కోసం ఆయన భారతీయులను ఎంపిక చేశారు. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొనడాన్ని ఆయన ఖండించారు.

* గాంధీ భార్య కస్తూర్బా.. 1944లో ఆగా ఖాన్ ప్యాలెస్‌లో నిర్బంధంలో ఉండగానే చనిపోయారు. ఆమె మరణించిన ఫిబ్రవరి 22న మన దేశంలో మదర్స్ డే‌గా జరుపుకొంటారు. ఆమె చనిపోయిన సమయంలో గాంధీ కూడా జైళ్లో ఉన్నారు. మలేరియా బారిన పడటంతో ఆయన కూడా చనిపోతారనే భయంతో బ్రిటిషర్లు జైలు నుంచి గాంధీని వదిలిపెట్టారు.

* గాంధీ ఇంగ్లాండ్‌లో న్యాయ విద్యను అభ్యసించిన సంగతి తెలిసిందే. గాంధీ చేతి రాత బాగుండదని అక్కడి అధ్యాపకులు పదే పదే చెబుతుండేవారు.

* జనవరి 30, 1948న గాంధీ హత్యకు గురయ్యారు. గాడ్సే ఆయనపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. మహాత్ముడికి కడసారి వీడ్కోలు పలకడానికి 20 లక్షల మందికిపైగా వచ్చారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం వచ్చిన వారు 8 కి.మీ. మేర బారులు తీరారు.

* గాంధీ పేరును నోబెల్ శాంతి పురస్కారం కోసం ఐదుసార్లు నామినేట్ చేశారు. కానీ ఆయనకు నోబెల్ దక్కలేదు. దీంతో గాంధీ శాంతి బహుమతి పేరిట అవార్డులు ఇవ్వడాన్ని భారత్ ప్రారంభించింది.

* 1959లో తమిళనాడులోని మదురైలో గాంధీ మెమోరియల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. గాంధీని గాడ్సే కాల్చడంతో ఆయన వస్త్రాలకు రక్తపు మరకలు అంటుకున్నాయి. ఆ వస్త్రం ఇప్పటికీ మ్యూజియంలో ఉంది.

source:https://telugu.samayam.com/latest-news/india-news/10-interesting-facts-about-mahatma-gandhi/articleshow/71392000.cms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *