Teluguwonders:
మీరు బోర్‌గా ఫీలవుతున్నారా? అందమైన అమ్మాయితో చాటింగ్ చేయాలనుకుంటున్నారా? ఈ నంబర్‌తో చాటింగ్ చేయండి…! అందమైన అమ్మాయి మీ కోసం వేచిచూస్తుందంటూ..! కొన్ని మెసేజ్‌లు వస్తుంటాయి.. పొరపాటును చాటింగ్ చేస్తే మాత్రం మీరు అడ్డంగా బుక్కైపోవడం ఖాయం. ఇలాంటి ఓ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. కోల్‌కతా కేంద్రంగా దందా నడుపుతూ.. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముగ్గురు సైబర్ నేరస్థులు సోమా సర్కార్, అంబాసుర్, ఇమ్రాన్‌లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కేసు వివరాల్లోకి వెళ్తే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.. ‘లవ్ ఆర్ట్ డేటింగ్’ వెబ్‌సైట్ పేరుతో రెండేళ్ల నుంచి దేశవ్యాప్తంగా.. యువకులకు ఎరవేసి రూ. 8 కోట్ల వరకు కొల్లగొట్టినట్టు డీసీపీ కేసీఎస్ రఘువీర్ తెలిపారు. అంతేకాదు.. వీరు నిర్వహిస్తోన్న లవ్ ఆర్ట్ డేటింగ్‌కు సంబంధించిన కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న 20 మంది యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
మొదట కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.. అందులో నష్టాలు రావడంతో.. వారి బుర్రకు కొత్త ఆలోచన తట్టింది దాంతో డేటింగ్ సెటై ఓపెన్ చేశారు… కోల్‌కతాకు చెందిన సోమా సర్కార్.. అంబాసుర్, ఇమ్రాన్‌లను మేనేజర్లుగా, ఇరవైమంది యువతులను టెలీకాలర్లుగా నియమించుకుని ఈ నయా దందాకు తెరలేపింది. రిజిస్ట్రేషన్ రుసుం రూ. 1,025, ప్యాకేజీల ఆధారంగా గరిష్ఠంగా రూ. 18,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంట్లో.. మాటలకు ఓ రేటు.. ఇక డేటింగ్ వరకు వెళ్తే మరో రేటు ఉంటుంది. డేటింగ్‌కు రావాలంటే సభ్యులు ఏ సిటీలో ఉంటే అక్కడి యువతులు వస్తారని ట్రాప్ చేస్తారు. ఇక, యువతుల ఫొటోలు, వారి వివరాలు ఉండడంతో భారీ సంఖ్యలో యువకులు రిజిస్టేషన్ చేయించుకున్నారు. ఇక్కడి వరకు కొంత బాగానే అనిపించినా.. చాటింగ్ నుంచి కాస్త డేటింగ్ కోసం తాపత్రయ పడే యువకులనే టార్గెట్ చేస్తారు. డేటింగ్ కోసం ఎదురుచూస్తున్నాం.. అని చెప్పగానే వారి ఫొటోలు, వివరాలు సేకరిస్తారు. అంతటితో ఆగకుండా వాటిని ఇతర డేటింగ్ సైట్లలో పెట్టేస్తారు. తర్వాత వారికి ఫోన్ చేసి మీ ఫొటోలు ఫలానా వెబ్‌సైట్లలో ఉన్నాయి.. మీరు అనైతిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని కోల్‌కతాలో కేసులు ఉన్నాయి. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే ఇంత మొత్తం ఇవ్వాల్సిందే నంటూ బెదిరించి డబ్బు వసూలు చేయడమే వారి పని. అయితే, పాపం పని ఎంతకాలం నడుస్తోంది.. మోసపోయిన ఇద్దరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తీగ లాగితే డొంక కదిలినట్టూ ముఠా గుట్టు మొత్తం రట్టైపోయింది.