*కొవిడ్ సమయంలో కొలువు కొట్టాలంటే.. రెజ్యూమేలో ఇవి ఉండాల్సిందే..!* *_ఆర్థిక వ్యవస్థ నుంచి ఆరోగ్య రంగం వరకూ.. ప్రతి ఒక్కటీ కరోనా దెబ్బకు కుదేలవుతూనే ఉంది._* _ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదాయ మార్గాలు లేకపోవడంతో అన్ని రంగాలు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. కొత్త నియామకాల నిలిచిపోయాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రస్తుతమున్న కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు ఏం చేయాలి.. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించే అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. కొవిడ్ కాలంలో రెజ్యూమ్ ఎలా ఉండాలి.. తదితర విషయాల గురించి తెలుసుకుందాం…_ *కొత్తగా ఆలోచించం..* కొన్నిసార్లు చీకటి.. కొత్త వెలుగులకు ద్వారాలు తెరుస్తుంది. ప్రస్తుత కొవిడ్–19 క్లిష్ట సమయం కూడా అలాంటిదే. మీరు ఉద్యోగంలో ఉంటే.. కెరీర్‌ను మరింత పటిష్టపరచుకునేందుకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టిపెట్టండి. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే.. ఈ సమయాన్ని ఇంకా బాగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటివరకు చేసిన ఉద్యోగం సంతృప్తి ఇచ్చిందా? సదరు జాబ్‌లో ఇంతకాలం సంతోషంగా కొనసాగారా అనేది ఆలోచించాలి. సంతృప్తి, సంతోషంలేని చోట ఏ వృత్తిలోనూ రాణించడం కష్టమే! కాబట్టి ఈ సమయంలో మీకు ఇష్టమైన రంగంలోకి వెళ్లడానికి అనువైన మార్గాలను అన్వేషించొచ్చు. ఒకవేళ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి కొత్తగా కెరీర్ ప్రారంభించాలనుకునే వారైతే.. మీకు ఇష్టమున్న రంగాలు ఏవో గుర్తించి.. వాటి వైపు దృష్టిసారించడం మంచిది. *సరైన కెరీర్ ఎంపిక..* గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత సరైన మార్గాన్ని నిర్ణయించుకోవడం అంత తేలికకాదు. ఉద్యోగం చేయాలా.. లేదా ఉన్నత చదువా.. ఎలాంటి కెరీర్‌ను ఎంచుకోవాలి.. అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇలాంటి సమయంలో మన ఆర్థిక పరిస్థితి, ఆసక్తి, అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తే సరైన నిర్ణయం తీసుకోవడం తేలికవుతుంది. *రెజ్యూమ్ కీలకం..* ఉద్యోగ ప్రయత్నంలో రెజ్యూమ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మన వ్యక్తిగత వివరాలు, చదువు, అనుభవానికిS సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలిపేదే రెజ్యూమ్ లేదా కరిక్యులం విటే(సీవీ). ఇది ఎంత పటిష్టంగా ఉంటే ఉద్యోగం సంపాదించడం అంతా సులభం అవుతుంది. కరోనా తీవ్రత దృష్ట్యా కంపెనీలు నియామకాల పరంగా ఆన్‌లైన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో రెజ్యూమ్ తీసుకోవడం, ఆన్‌లైన్ ఇంటర్వూ్యలు నిర్వహించడం.. ఇలా ఎంపిక ప్రక్రియ అంతా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతోంది. ఇలాంటి సమయంలో భారీ సంఖ్యలో వచ్చే రెజ్యూమ్‌లను నిశితంగా పరిశీలించేంత సమయం హెచ్‌ఆర్ బృందానికిS ఉండదు. కాబట్టి చూసిన వెంటనే మెప్పించేలా రెజ్యూమ్ సిద్ధం చేసుకోవాలి. *సానుకూల వైఖరి:* కరోనా వైరస్ నేపథ్యంలో ఆఫీసుకు వెళ్లి పనిచేసే పరిస్థితులు లేవు. దాంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఇస్తున్నాయి. మీ రెజ్యూమ్‌లో ఆ విషయం హైలెట్ చేయడం మేలు. అలాగే ఫుల్ టైమ్ జాబ్ అనే కాకుండా.. పార్ట్‌టైమ్‌గా చేసేందుకు కూడా సిద్ధమే అనే అంగీకారం తెలపాలి. ఎందుకంటే.. ఇటీవల సంస్థలు అవసరానికి తగ్గట్టు తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. *వీడియో రెజ్యూమ్..* కరోనా సంక్షోభానికి ముందు నుంచే వీడియో రెజ్యూమ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ప్రస్తుతం పరిస్థితుల్లో మరింతగా ప్రాచూర్యంలోకి వస్తోంది. అభ్యర్థి తన నైపుణ్యాలను తెలియజేయడానికి వీడియో రెజ్యూమ్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ప్రదర్శించడానికి వీడియో రెజ్యూమ్ చక్కగా దోహదపడుతుంది. *సహనంతో వ్యవహరించాలి..,.* ప్రస్తుతం కరోనా కారణంగా అరకొర నియామకాలు జరుగుతున్న సమయంలో.. ఉద్యోగ ప్రయత్నంలో ఎంతో సహనంతో వ్యవహరించాలి. వైఫల్యాలు ఎదురైనా నిరుత్సాహపడకూడదు. ధృడ సంకల్పంతో ప్రయత్నాలు కొనసాగించాలి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.