Teluguwonders:
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తెలుగు అగ్రదర్శకులలో ఒకరు. ఈ మధ్యకాలంలో రేసులో కాస్త వెనుకబడ్డాడు కానీ.. గతంలో ఇండస్ట్రీకి కొన్ని మరపురాని హిట్స్ ఇచ్చాడు. అలాంటి వినాయక్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. మాస్ డైరెక్టర్‌గా వినాయక్‌కి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు వుంది.
అలాగే మాస్ హీరోగా చిరంజీవికి వున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.ఇక విషయానికొస్తే.. వినాయక్ స్వతహాగా చిరంజీవికి పెద్ద అభిమాని. ఆయన చిరూని ‘అన్నయ్యా..’ అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటాడు. అయితే.. ఈ మాస్ డైరెక్టర్ అతి త్వరలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట.
ఇదివరకు వీరిద్దరూ చేసిన రెండు సినిమాలూ రీమేక్‌లే. స్ట్రయిట్ సినిమాలతో పోల్చితే రీమేక్‌లను రూపొందించడమే కష్టమని వినాయక్ అంటున్నాడు. ఆల్రెడీ హిట్టయిన సినిమాల్ని మళ్ళీ తీయాలంటే, అంతకన్నా బాగా తీయాలన్న వత్తిడి ఉంటుందని..ఆ వత్తిడి తట్టుకోవడం చాలా కష్టమని వినాయక్ అభిప్రాయం.
అయితే.. ఈసారి మాత్రం చిరంజీవితో చేయబోయే సినిమా చాలా చాలా పెద్దదని అంటున్నాడు. ఆల్రెడీ కథ సిద్ధంగా వుందని కూడా చెప్పేశాడు. అయితే, చిరంజీవితో ఆ సినిమా చేయడానికి కొంత సమయం పడుతుందని వినాయక్ చెప్పుకొచ్చాడు. ‘ప్రస్తుతం అన్నయ్య పలు ప్రాజెక్టులకు కమిట్ అయి వున్నారు. ఆయన టైమ్ ఖచ్చితంగా ఇస్తారు. ఆయనతో ఖచ్చితంగా సినిమా చేస్తాను. ఈసారి చేయబోయే సినిమా ఇంకో లెవల్‌లో వుంటుంది..’ అంటూ వినాయక్ చేసిన ప్రకటన మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.ఇకపోతే.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కూడా వినాయక్ దర్శకత్వంలోనే చేయాలి. అంతేకాదు.. సినిమా కోసం కొంత కాలం వినాయక్ కూడా పనిచేసాడు. అయితే, అదంతా సినిమా సెట్స్ మీదకు వెళ్ళకు ముందు మాత్రమే. చిరు ‘సైరా నరసింహారెడ్డి’ స్క్రిప్ట్ ను పక్కకు పెట్టడం.. ముందుగా ‘ఖైదీ నెంబర్ 150’ లో నటించాలనుకోవడంతో వినాయక్ ఆ చిత్రాన్ని తెరకెక్కించడం.. సూపర్ డూపర్ హిట్టవడం తెలిసిందే.