పాఠ్యాంశాల్లో సందేహాలా?*

0

*పాఠ్యాంశాల్లో సందేహాలా?*

*విద్యార్థులు 1800123123124కి ఫోన్‌ చేయొచ్చు*

*కేంద్ర మార్గదర్శకాలు వచ్చాకే డిగ్రీ పరీక్షల రద్దుపై నిర్ణయం* *ఏపీ విద్యా శాఖ మంత్రి సురేష్‌ వెల్లడి*

అమరావతి: పాఠ్యాంశాల్లోని వివిధ అంశాలపై విద్యార్థులకు తలెత్తే సందేహాల నివృత్తి కోసం 1800123123124 టోల్‌ ఫ్రీ నంబరును ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ పరీక్షల రద్దుపై ఇప్పటికే సీఎంకు నివేదించామని, కేంద్రం నుంచి మార్గదర్శకాలు రాగానే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభించాలని సీఎం చెప్పారని వివరించారు. శుక్రవారం విజయవాడలో ‘మనబడి నాడు-నేడు’, ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. పాఠశాలలకు సమకూర్చేందుకు కొనుగోలు చేసిన పరికరాల ప్రదర్శనను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీపై న్యాయస్థానంలో విచారణ కారణంగా కొత్త నియామకాలు చేపట్టలేకపోతున్నామని, సమస్య పరిష్కారంకాగానే క్యాలెండర్‌ ప్రకారం కొత్త డీఎస్సీ ప్రకటిస్తామని పేర్కొన్నారు.

*రివర్స్‌ టెండరింగ్‌తో రూ.143 కోట్లు ఆదా*

‘‘నాడు-నేడు తొలిదశ పనులు జులై చివరి నాటికి పూర్తి చేస్తాం. ఇప్పటికే అన్ని పాఠశాలల్లోనూ మూడు వంతుల పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా వివిధ పరికరాలు/వస్తువులను రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో కొనుగోలును చేశాం. ఫలితంగా ప్రభుత్వానికి రూ.143 కోట్లు ఆదా అయ్యాయి. పనులు చేపట్టే విషయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాజకీయ నాయకులు, అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు త్వరలోనే టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తాం.

ఈ నంబరుకు ఫోన్‌ చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం’’ అని మంత్రి వివరించారు.

Leave a Reply