కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు

0

*కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు* *ప్రస్తుతమున్నవాటితో కలిపి 52* *నెలాఖరులోగా ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం*

*ఏపీ సీఎం జగన్‌ ఆదేశం*

అమరావతి: వెనుకబడిన తరగతుల్లోని వివిధ కులాల కోసం కొత్తగా 28 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతమున్న 24తో కలిపి మొత్తం కార్పొరేషన్ల సంఖ్య 52కు చేరనుంది. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో సీఎం మాట్లాడుతూ..

ఈ నెలాఖరులోగా 52 కార్పొరేషన్ల ఛైర్మన్లతోపాటు, బోర్డు డైరెక్టర్ల నియామకాలు పూర్తి కావాలని ఆదేశించారు. ప్రతి కార్పొరేషన్‌లో ఏడు నుంచి 12 మంది డైరెక్టర్లు ఉండాలని స్పష్టం చేశారు. వివిధ కులాల అభివృద్ధి కోసం పాటుపడిన వారికి ఇందులో తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని కార్పొరేషన్లకు ఒకే భవనం నిర్మించాలని పేర్కొన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అనేది కార్పొరేషన్ల ద్వారా పర్యవేక్షించాలన్నారు. సంచార జాతుల సమస్యలను బీసీ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

*2.12 కోట్ల మందికి రూ.22వేల కోట్లు* ‘బీసీల అభ్యున్నతి కోసం ఇంత దృష్టి పెట్టి ఎప్పుడూ పని చేయలేదు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,12,40,180 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల సాయాన్ని వివిధ పథకాల కింద నగదు బదిలీ ద్వారా అందించాô. 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇందులో సింహభాగం బీసీ మహిళలే లబ్ధి పొందుతున్నారు. లంచం, వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు చేరువ చేస్తున్నాం’ అని సీఎం చెప్పారు. ‘ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం తీసుకొస్తున్నాం. 18 నెలల్లోగా నైపుణ్యాభివృద్ధి కళాశాలల్ని తీసుకురావడానికి కార్యాచరణ రూపొందించాం. జర్మనీ తదితర దేశాలకు చెందిన పెద్ద సంస్థలను ఇందులో భాగస్వాములుగా చేస్తున్నాం. కొత్తగా ఏర్పాటయ్యే కార్పొరేషన్ల ద్వారా అందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందేలా చూడాలి’ అని జగన్‌ తెలిపారు.

* కార్పొరేషన్ల ద్వారా గతంలో 69 కులాలనే పరిగణనలోకి తీసుకోగా.. ఇప్పుడు మొత్తం 139 కులాలు వీటి పరిధిలోకి వస్తున్నాయని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు పేర్కొన్నట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ‘గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఇప్పుడు లోతుగా అధ్యయనం చేశాకే కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. 30 నుంచి 35 వేల జనాభా ఉన్న ప్రతి కులాన్నీ ఏదో ఒక కార్పొరేషన్‌లో చేర్చారు’ అని వారు చర్చించినట్లు వెల్లడించింది. సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కృష్ణదాస్‌, శంకరనారాయణలతోపాటు సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

*వైకాపా బీసీ మంత్ర!* బీసీలకు పెద్దఎత్తున రాజకీయ పదవులు ఇచ్చేందుకు వైకాపా కసరత్తు చేస్తోంది. మొత్తం 52 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. ఈ 52 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లుగా 500 నుంచి 600 మంది బీసీలకు పదవులు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఇప్పటివరకూ రాజకీయ పదవులు దక్కని కులాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా లేదా ఆగస్టు రెండోవారంలోపు ఈనియామకాలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానానికి కూడా అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీల) నుంచే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నారు.

Leave a Reply