Teluguwonders:
ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? తన కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారా..? ఆ ఇద్దరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమా…? అంటే.. ప్రభుత్వ వర్గాలు ఔననే అంటున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు మంత్రులు ఎవరన్నది మాత్రం పెద్ద సస్పెన్సే కానీ.. సూచనాప్రాయంగా మాత్రం వారిద్దరు ఎవరో ఓ నిర్ణయానికి రావొచ్చు మరి. ఏపీలో ఇప్పుడు ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. మరికొద్ది రోజుల్లోనే జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారనే టాక్ అధికార వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో ఆ ఇద్దరు మంత్రులు ఎవరు..? అన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మిగతా మంత్రుల్లోనూ వణుకుపుడుతోందట.
నిజానికి.. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు. మంత్రివర్గంలో 25మందికి అవకాశం కల్పించారు. ఇక్కడ వీరికి కేవలం రెండున్నరేళ్ల కాలపరిమితి విధించారు కూడా.. ఈ మంత్రులందరూ కేవలం రెండున్నరేళ్లు మాత్రమే ఉంటారని, ఆ తర్వాత కొత్తవాళ్లు వస్తారని జగన్ సూటిగానే చెప్పారు. అయితే.. ఇక రెండున్నరేళ్ల వరకు మంత్రులెవరినీ జగన్ మార్చబోరని అందరూ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా ఇద్దరు మంత్రులను తప్పించే యోచనలో జగన్ ఉన్నట్లు టాక్ వినిపించడంతో మంత్రుల్లో వణుకుపుడుతోంది. ఎవరా ఇద్దరు.. అన్నదానిపై ఎవరికి వారుగా లోలోపల బెంబేలెత్తిపోతున్నారట. ఇక ఇదే సమయంలో పార్టీవర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఏర్పడి సుమారు వందరోజులు అవుతుంది. ఇంతలోనే ఇద్దరు మంత్రులను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని అందరూ అనుకుంటున్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆ సీనియర్ నేతకు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించారు. కానీ.. ఆ మంత్రి వ్యవహార శైలితో ప్రభుత్వానికి తలనొప్పులు వస్తాయట. ఆ మంత్రిమాటలతో ప్రతిపక్షానికి ఛాన్స్ దొరుకుతుందట. దీంతో జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరొక మంత్రి రాజకీయాల్లో జూనియర్. అసలు ఆమెకు అలాంటి కీలక శాఖ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. ఆమె కూడా తన పనితీరును మెరుగుపర్చుకోవడం లేదట. అంతేగాకుండా.. ఓ సమన్వయకర్తను నియమించినా లాభంలేకుండా పోయిందట. దీంతో ఆ ఇద్దరు మంత్రులను మార్చే యోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!