ఆస్తులన్నీ ఆన్‌లైన్‌

Spread the love

*ఆస్తులన్నీ ఆన్‌లైన్‌*

*15 రోజుల్లోగా నమోదు చేయాలి* *భూరికార్డుల నిర్వహణ వంద శాతం పారదర్శకం*

*ధరణి పోర్టల్‌ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌* గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు కాని ప్రజల ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజలు తమ ఆస్తుల వివరాలు అధికారులకు అందజేయాలని సీఎం కోరారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు నమోదు కాని ఆస్తుల వివరాలను వెంటనే 100 శాతం ఆన్‌లైన్‌లో చేర్చాలని సూచించారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుడుతున్నామని ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్‌ రూపకల్పనపై మంగళవారం ప్రగతిభవన్‌ కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను పురపాలక, జిల్లా, మండల, పంచాయతీ అధికారులు త్వరగా పూర్తి చేయాలి. ఇందుకోసం జిల్లా, పంచాయతీ అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించాలి. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలి. ప్రతీ ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి. పంచాయతీలు కొన్న ట్రాక్టర్ల ద్వారా ఇళ్ల నుంచి, గ్రామాల నుంచి చెత్తను ఎలా తరలిస్తున్నారనే దానిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి సంచార బృందాలు ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, స్మితా సభర్వాల్‌, పురపాలక ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, సంచాలకుడు సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు._ *కేశవాపురం రిజర్వాయరుకు అనుమతి* హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలు తీర్చడానికి మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కేశవాపురం వద్ద నిర్మిస్తున్న 10 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన 409.53 హెక్టార్ల అటవీభూమి సేకరణకు కేంద్ర అటవీశాఖ అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్ర అటవీశాఖకు లేఖ అందింది.

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *