*యువతకు ‘టాస్క్‌’

0

Telangana accademy for skill and knowledge

https://www.task.telangana.gov.in/Login

*భవిష్యత్‌ సాంకేతికతలపై ఉచిత శిక్షణకు 11 సంస్థలతో ఒప్పందం.

*35 ఏళ్ల లోపు వారు ఎవరైనా నేర్చుకోవచ్చు.

*టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా.

హైదరాబాద్‌: రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఆన్‌లైన్లో సాఫ్ట్‌వేర్‌ కోర్సులు, భవిష్యత్తు సాంకేతికత (టెక్నాలజీ)ల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలంగాణ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ (టాస్క్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్‌ సిన్హా తెలిపారు.

18 ఏళ్లు పైబడిన విద్యార్థులు, అభ్యర్థులు టాస్క్‌ వెబ్‌సైట్లో తమ వివరాలు నమోదు చేసుకుని అర్హతల ఆధారంగా కృత్రిమ మేధ, బిగ్‌డేటా, మిషన్‌ లెర్నింగ్‌, డేటాసైన్స్‌, జావా, ఒరాకిల్‌ తదితర కోర్సులను అభ్యసించవచ్చని పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో 26-35 ఏళ్ల వారికీ అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. భవిష్యత్తు సాంకేతికతలపై విద్యార్థులు, కళాశాలల్లోని అధ్యాపకుల శిక్షణ కోసం పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ‘ఈనాడు’తో మాట్లాడారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు టాస్క్‌ నైపుణ్య కార్యక్రమాలను విస్తరించేందుకు కొత్తగా నిర్మించే ఐటీ టవర్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

*భవిష్యత్తు సాంకేతికతల్లో శిక్షణ కోసం ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు. ఎంత మందికి శిక్షణ ఇవ్వనున్నారు.?* భవిష్యత్తు సాంకేతికతల్లో శిక్షణ కోసం 11 సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇందులో ఆటోమేషన్‌ ఏనీవేర్‌, ఏఆర్‌ఎం, బ్లూప్రిజం, ఈడీఎస్‌ టెక్నాలజీస్‌, ఎక్సెల్‌ఆర్‌, స్మార్ట్‌బ్రిడ్జి, అన్‌స్కూల్‌, ఐబీఎం ఓపెన్‌ పీటెక్‌, ఇన్‌సోఫీ, గూగుల్‌ క్లౌడ్‌, గూగుల్‌ కోట్లిన్‌ సంస్థలు ఉన్నాయి.

ఈ సంస్థలన్నీ విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్లో శిక్షణ ఇవ్వనున్నాయి. ఈ-పుస్తకాలను అందిస్తాయి. ఈ కోర్సుల్లో శిక్షణ అనంతరం సర్టిఫికేట్లు పొందవచ్చు. ఇవి అంతర్జాతీయంగా చెల్లుబాటవుతాయి. ఈ ఫీజుల్లో టాస్క్‌ అభ్యర్థులకు 25-50 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ఐబీఎం ఓపెన్‌ పీటెక్‌ ద్వారా ఎవరైనా విద్యార్థులు ఏఐ, ఎంఎల్‌, డేటాసైన్స్‌లో శిక్షణ తీసుకోవచ్చు. గూగుల్‌ కోట్లిన్‌తో ఆండ్రాయిడ్‌ యాప్‌ల తయారీలో నైపుణ్యాలు పెంచుకోవచ్చు.

ఈ కోర్సులతో దాదాపు 30 వేల మందికి లబ్ధిచేకూరనుంది. బ్లూప్రిజం సంస్థ రోబోటిక్‌ ప్రాసెసింగ్‌ ఆటోమేషన్‌లో 2500 మందికి శిక్షణ ఇవ్వనుంది. ఇలా ప్రతి సంస్థ భవిష్యత్తు టెక్నాలజీల్లో 2500 నుంచి 5 వేల మందికి నైపుణ్యాలు అందించనున్నాయి.

*కరోనా నేపథ్యంలో ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.?* కరోనా సమయంలో ఆన్‌లైన్‌ శిక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. తప్పనిసరి నైపుణ్యాలు, జట్టుగా పనిచేయడం, లోతుగా ఆలోచించడం క్లిష్టమైన ఆలోచన (క్రిటికల్‌ థింకింగ్‌) తదితర నైపుణ్యాలు తప్పనిసరి చేశాం.

భవిష్యత్తు సాంకేతికతలపై ఆయా కళాశాలల్లో విద్యార్థులకు నేర్పించేలా ఇప్పటికే 2వేల మందికి పైగా అధ్యాపకులకు వివిధ కోర్సుల్లో నైపుణ్యం అందించాం.

ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో విద్యార్థులను మరింత ఆకర్షించేలా బోధన పద్ధతుల్లో అంతర్జాతీయ నిపుణులతో మెలకువలు నేర్పించాం. సేల్స్‌ఫోర్స్‌, పైథాన్‌, ఏఐ, ఎంఎల్‌, ఆర్‌పీఏ, డేటాసైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌తో పాటు వివిధ రంగాల్లో దాదాపు 15వేల మందికి శిక్షణ ఇప్పించాం. ఐటీ ఉద్యోగాలు పొందేందుకు వీలుగా పారిశ్రామిక చర్చావేదికలు నిర్వహించి, అవగాహన కల్పించాం.

ఐటీ రంగంలోనే కాకుండా మిగతా రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాల గురించి వివరించి శిక్షణలు ప్రారంభించాం. కరోనా తరువాత పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలపై వర్క్‌షాప్‌లు కొనసాగిస్తున్నాం. ఎన్‌ఐటీ వరంగల్‌తో కలిసి ప్రతివారం సివిల్‌ టాక్‌లు నిర్వహిస్తున్నాం.

*ఐ4టీఎస్‌ కార్యక్రమం కింద ఎంత మంది ఔత్సాహికులు ముందుకు వచ్చారు.?* ఐ4టీఎస్‌ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమం కింద 7600 మంది దరఖాస్తు చేశారు. ప్రతి బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు శిక్షణ ఇవ్వడంతో పాటు టీశాట్‌లోనూ ప్రసారం చేస్తున్నాం. జనవరి రెండో వారంలో వీరిలో 300-450 వరకు ఆవిష్కరణ ఆలోచనల్ని ఎంపిక చేసి టీ-హబ్‌, వీ-హబ్‌, వివిధ పరిశ్రమలతో అనుసంధానం చేసి శిక్షణ ఇప్పిస్తాం. ఈ ఆవిష్కరణలతో సామాజికంగా స్థానిక సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా మరింత మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

*యువత, విద్యార్థులు ఏ కోర్సుల వైపు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు?* భవిష్యత్తులో ఏ, బీ, సీ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. ఏ అంటే కృత్రిమ మేధ, బీ-బిగ్‌డేటా, సీ-క్లౌడ్‌ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. అలాగే జావా, ఒరాకిల్‌లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కోర్సులు అభ్యసించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కరోనా అనంతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు టెక్నాలజీల్లో కనీస అవగాహన అవసరం. టెక్నాలజీపై ప్రాథమిక విజ్ఞానం ఉండాలి.

ఒక్కోసారి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు రాకున్నా మధ్యస్థాయి కంపెనీల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థల నియామక పరీక్షల్లో ప్రాథమిక ఎంపిక (షార్ట్‌లిస్టు) సాధించిన వారికి ఐదురోజుల పాటు తప్పనిసరి నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తూ నియామకం పొందేందుకు సహకరిస్తున్నాం.

కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చాం. టాస్క్‌లో శిక్షణ పొందిన వారిలో వీరి వాటా 20 శాతం ఉంటుంది.

Leave a Reply