ఆర్టీసీ సమ్మె.. చర్చల కోసం కొత్త కమిటీ …

0

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఏ రకంగా పరిష్కారం దొరుకుతుందనే అంశంపై స్పష్టత రాలేదు. అయితే మంగళవారం ఈ అంశంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు… సమ్మెపై కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆదేశించింది. రెండు రోజుల్లో ఈ చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె విరమించకపోయినా… చర్చలకు మాత్రం వెళతామని వెల్లడించాయి. దీంతో కార్మిక సంఘాలతో చర్చల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

చర్చలు జరపాలని కోర్టు ఆదేశించడంతో… ఇందుకోసం ఓ కమిటీ వేసే యోచనలో సర్కార్ ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెపై కోర్టు కాపీ అందాకే తదుపరి చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. కోర్టు కాపీలను పరిశీలించాక కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కమిటీ వేస్తే… మంత్రులతోనా… ఐఏఎస్‌లతోనా అనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

సమ్మెకు ముందు ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీ వేసిన ప్రభుత్వం… కార్మికులు సమ్మెలోకి వెళ్లిన వెంటనే ఆ కమిటీని రద్దు చేసింది. దీంతో ప్రభుత్వం చర్చల కోసం మళ్లీ ఐఏఎస్‌లతోనే కమిటీ వేస్తుందా లేక మంత్రులతో కమిటీ వేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఆర్టీసీ సమ్మె బాటలో విద్యుత్ ఉద్యోగులు..

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. ఇదే తరుణంలో అటు విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మె బాట పట్టనున్నారు. డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో చర్చలు విఫలమైనందువల్లే సమ్మె నిర్ణయానికి వచ్చామని విద్యుత్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ తెలిపింది.ఈ మేరకు 23 తర్వాత మెరుపు సమ్మెకు దిగాలని విద్యుత్ ఉద్యోగులకు ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది. మంగళవారం విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు,విద్యుత్ అధికారులతో యూనియన్ నాయకులు చర్చలు జరిపారు.

విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్ ఉంది.1999 ఫిబ్రవరి 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి ఈపీఎఫ్ విధానం కూడా అమలుచేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.అయితే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని ట్రాన్స్‌కో జేఎండీ అన్నారు.దానికి బదులు వారికి బేసిక్ సాలరీతో పాటు మరిన్ని బెనిఫిట్స్ కల్పిస్తామన్నారు. అయితే కార్మికులు మాత్రం ఇందుకు అంగీకరించలేదు.ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు.

Leave a Reply