*ఏపీలో కరోనా ప్రమాద ఘంటికలు!* *ఒక్కరోజులో 7,998 కేసులు నమోదు* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 7,998 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంతమొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మూడు జిల్లాల్లో వెయ్యికిపై కేసులు నమోదు కావడం గమనార్హం.
తూర్పుగోదావరి జిల్లాలో1391 కేసులు బయటపడగా.. గుంటూరు జిల్లాలో 1184, అనంతపురంలో 1,016 కేసులు వచ్చాయి. కరోనా కారణంగా ఈ ఒక్కరోజే 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 884కి చేరింది.
తూర్పుగోదావరిలో 14 మంది, గుంటూరులో 7, కర్నూలులో 7, కృష్ణ 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం, విజయనగరంలో 5, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 3, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 72,711గా ఉంది. ఇప్పటి వరకు 37,555 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా..
మరో 34,272 మంది వివిధ కొవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.