కరోనావైరస్ సోకిన వారికి ఎలా చికిత్సచేయాలో డాక్టర్లకు కూడా స్పష్టంగా తెలియడం లేదు. వారికి ఇదంతా కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్లే ఉంది.
ఈ వైరస్ మనిషికి సోకితే ఏమవుతుంది? మానవ శరీరం మీద ఈ వైరస్ ఏ విధంగా దాడి చేస్తుంది? దీని పూర్తి లక్షణాలేంటి? ఎవరు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది? ఇది సోకితే మనిషి చనిపోతాడా? దీనికి మందే లేదా?
వుహన్‌లోని జిన్యింటాన్ ఆస్పత్రిలోని డాక్టర్లు ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ప్రారంభించారు.
మొదటి 99 మంది కరోనావైరస్ రోగుల మీద నిశితంగా చేసిన అధ్యయనాల విశ్లేషణను ‘లాన్సెట్ మెడికల్ జర్నల్’లో ప్రచురించారు.
ఊపిరితిత్తుల్లో మంట
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరు రోగులూ న్యూమోనియోతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో మంటతో అవస్థపడుతున్నారు. గాలి నుంచి రక్తానికి ఆక్సిజన్ అందించే ఊపిరితిత్తుల్లోని చిన్న చిన్న సంచులన్నీ నీటితో నిండిపోయాయి.
మరికొన్ని లక్షణాలు
- 82 మందికి జ్వరం
- 81 మందికి దగ్గు
- 31 మంది ఊపిరిలో ఇబ్బంది
- 11 మందికి కండరాల నొప్పి
- తొమ్మిది మందికి అయోమయం
- ఎనిమిది మందికి తలనొప్పి
- అయిదుగురికి గొంతులో పుండ్లు
మొదటి మరణాలు
ఈ 99 మందిలో మొదట చనిపోయిన ఇద్దరు మామూలుగా ఆరోగ్యవంతులే. అయితే, వారికి దీర్ఘకాలంగా పొగతాగే అలవాటు ఉదంి. ఆ అలవాటు వల్ల వారి ఊపిరితిత్తులు మరింత తొందరగా బలహీనపడిపోయి ఉంటాయి.
ఈ వైరస్ వల్ల చనిపోయిన మొదటి వ్యక్తి వయసు 61 ఏళ్ళు. అతడు హాస్పిటల్లో చేరే సమయానికి న్యమోనియోతో బాధపడుతున్నాడు. అతనికి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య ఉంది. ఫలితంగా అతని శరీరానికి ఆక్సిజన్ గ్రహించే శక్తి తగ్గింది. దానివల్ల అతడి ప్రాణం ఎక్కవసేపు నిలవలేకపోయింది.
వెంటిలేటర్ మీద ఉంటినప్పటికీ అతడి ఊపిరితిత్తులు పని చేయలేదు. దాంతో గుండె ఆగిపోయింది.
హాస్పిటల్లో చేరిన 11వ రోజు అతడు చనిపోయాడు.
చనిపోయిన రెండవ వ్యక్తి వయసు 69 ఏళ్ళు. అతడు కూడా తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుండేవాడు. అతడికి ఈసీఎంఓ – ఎక్స్‌టరా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అనే కృత్రిమ శ్వాస యంత్రంతో చికిత్స చేశారు. కానీ, అది అతడికి సరిపోలేదు.
తీవ్రమైన న్యూమోనియాతో పాటు రక్తపోటు దారుణంగా పడిపోవడంతో అతడు చనిపోయాడు.
కనీసం 10% మరణాలు
జనవరి 25 నాటికి 99 మంది రోగులలో:
- 57 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- 31 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- 11 మంది చనిపోయారు
దీని ప్రకారం మరణాల రేటు 11 శాతమే అనుకోవడానికి అవకాశం లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరు చనిపోయే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకినవారు కొందరు ఆ లక్షణాలను గుర్తించలేక ఆస్పత్రికి వచ్చే లోపే చనిపోవచ్చు.
మార్కెట్ కార్మికులు
హువానన్ మార్కెట్లో ప్రాణంతో ఉన్న జీవులను అమ్మేవారి నుంచి ఈ 2019-nCoV అనే ఇన్ఫెక్షన్ మొదలై ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం 99 మంది రోగులలో 49 మంది ఈ మార్కెట్ నుంచి వచ్చిన వారే.
- 47 మంది విక్రేతలు, మేనేజర్లు
- ఇద్దరు అక్కడికి వచ్చిన వినియోగదారులు
రోగులలో 56-67 ఏళ్ళ వయసున్న మగవారే ఎక్కువగా ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం 1 మహిళకు, 1.2 పురుషులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. మహిళలతో పోల్చితే మగవాళ్ళు ఎక్కువగా తిరుగుతుంటారన్నది ఒక కారణంగా భావిస్తున్నారు.
అంతేకాకుండా, “మహిళల్లో ఉండే ఎక్స్ క్రోమోజోమ్, సెక్స్ హార్మోన్స్ వారి రోగనిరోధకతను పెంచడం కూడా ఒక కారణం” అని ఈ హాస్పిటల్ డాక్టర్ లీ జాంగ్ చెప్పారు. ఆస్పత్రిలో చేరిన 99 మందిలో 40 మంది అప్పటికే హృద్రోగం, పక్షవాతం వంటి జబ్బులకు గురైనవారున్నారు. 12 మంది రోగులు మధుమేహ పీడితులు.
Source:https://www.bbc.com/telugu/international-51345817