*కరోనాకు ఏది విరుగుడు?*
*నియంత్రణ చర్యలపై రెండో రోజూ చర్చించిన ముఖ్యమంత్రి*
*కొందరు లాక్‌డౌన్‌కు అనుకూలం…వద్దని మరికొందరి వినతులు*
*నేడు సీఎస్ నివేదికతో సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం* హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పరిధిలో కరోనా కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్‌డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందోనని రకరకాల అంచనాలున్నాయి. బుధవారం రెండో రోజు మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సీఎం విస్తృతంగా చర్చించారు. కొవిడ్‌ను అరికట్టేందుకు అవసరమైన సూచనలలో భాగంగా లాక్‌డౌన్ విధింపునకు కొంత మంది అనుకూలంగా మాట్లాడారు.
ప్రతి రోజు వేయి చొప్పున కేసులు నమోదవుతున్నందున మళ్లీ అసాధారణ చర్యల అవసరం ఉందని వారు పేర్కొన్నారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే వ్యక్తిగత ఆదాయాలతో పాటు రాష్ట్ర ఆదాయం దెబ్బతింటుందని, రవాణా, నిత్యావసరాల లభ్యత, ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని మరికొందరు పేర్కొన్నారు.
లాక్‌డౌన్‌కు బదులు నియంత్రణ చర్యలపై ప్రజలను చైతన్యపరచడం, ప్రజల కదలికలను తగ్గించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని వారు సూచించారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులతో దీనిపై చర్చలు జరుపుతున్నారు.
కరోనా వ్యాప్తి విశ్లేషణ, నివారణ మార్గాలు, వైరస్ తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన చర్యలు, వైద్యపరమైన సన్నద్ధత, వివిధ శాఖల వారీగా ఆదాయాలు, రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు, వాటికి అనుగుణంగా వనరుల సమీకరణ మార్గాల గురించి నివేదిక రూపొందించారు.
దీనిని గురువారం ఆయన ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం వివిధ అంశాలను బేరీజు వేసి కార్యాచరణపై దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా మంత్రిమండలి సమావేశం నిర్వహణ, లాక్‌డౌన్ విధించాలా వద్దా అనే దానిపై గురువారం నిర్ణయాన్ని వెల్లడించే వీలుంది.