కరోనాపై కేంబ్రిడ్జి బ్రహ్మాస్త్రం

Spread the love

*కరోనాపై కేంబ్రిడ్జి బ్రహ్మాస్త్రం!*

*సార్స్‌, మెర్స్‌ల నుంచీ రక్షణ కల్పించేలా టీకా అభివృద్ధి*

లండన్‌: కరోనా వైరస్‌ ఆటకట్టించే సరికొత్త టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అడుగులు వేస్తోంది! ప్రస్తుతం మానవాళికి పెను సవాలుగా మారిన ‘సార్స్‌-కొవ్‌-2’ను మాత్రమే కాకుండా..

కరోనా జాతికి చెందిన అన్ని వైరస్‌ల నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం ఉండే టీకాను అభివృద్ధి చేస్తోంది. ‘డియోస్‌-కొవాక్స్‌2’గా పిలిచే ఈ టీకా క్యాండిడేట్‌తో మానవులపై ప్రయోగాలు ఈ ఏడాదే ప్రారంభమయ్యే అవకాశముందని విశ్వవిద్యాలయం వెల్లడించింది. సార్స్‌, మెర్స్‌, సార్స్‌-కొవ్‌-2లతోపాటు ఇతర అన్ని రకాల కరోనా వైరస్‌లపై పోరాడేలా తాము టీకాను తయారు చేస్తున్నామని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని లేబొరేటరీ ఆఫ్‌ వైరల్‌ జూనోటిక్స్‌ అధినేత ప్రొఫెసర్‌ జొనాథన్‌ హీనీ తెలిపారు. గబ్బిలాల నుంచే కాకుండా ఇతర ఏ జంతువుల నుంచి మానవుల్లోకి కరోనా జాతి వైరస్‌లు ప్రవేశించినా అది తుదముట్టించగలదని పేర్కొన్నారు.

ఆయా వైరస్‌ల జన్యు క్రమాలన్నింటినీ టీకా క్యాండిడేట్‌లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. ‘డియోస్‌-కొవాక్స్‌2’ పౌడర్‌ రూపంలో ఉంటుందని.. సూది అవసరం లేకుండా, చర్మం ద్వారా దాన్ని ఎక్కించవచ్చునని తెలిపారు.

*ఆక్స్‌ఫర్డ్‌ టీకా రెండో దశ ప్రయోగాలు షురూ*

పుణె: కరోనా మహమ్మారి నుంచి రక్షణకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న టీకా రెండో దశ క్లినికల్‌ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. పుణెలోని భారతీ విద్యాపీఠ్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఇద్దరు పురుష వలంటీర్లకు బుధవారం దాన్ని అందించారు. తొలుత 32 ఏళ్ల ఓ వ్యక్తికి, అనంతరం 48 ఏళ్ల మరో వ్యక్తికి ‘కొవిషీల్డ్‌’ టీకాను వేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి వారిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) నుంచి తమకు డోసులు మంగళవారమే అందినట్లు తెలిపాయి. రెండో దశ క్లినికల్‌ ప్రయోగాలు భారత్‌లో 100 మంది వలంటీర్లపై జరగనున్నాయి. అందులో దుష్ప్రభావాలేవీ తలెత్తకపోతే, మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 1,500 మందికి అందిస్తారు.

*ఆశాజనకంగా ఆస్ట్రేలియా టీకా!* మెల్‌బోర్న్‌: కొవిడ్‌ నివారణలో దోహదపడే సరికొత్త టీకా అభివృద్ధి దిశగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసింది. ఆ విశ్వవిద్యాలయం తయారుచేసిన ఓ టీకా క్యాండిడేట్‌ ప్రి క్లినికల్‌ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలనిచ్చింది. ఎలుకల్లో కరోనా వైరస్‌ తన సంఖ్యను పెంచుకోకుండా అది అడ్డుకోగలిగిందని వారు తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థలో అత్యంత కీలకమైన టి-కణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తయ్యేలా అది ప్రేరేపిస్తోందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *