తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఒడియా సినీనటిపై ఫిర్యాదు చేశాడు.చిన్మయ నాయక అనే ఒడియా సినీనటి తనను మోసగించినట్లు కటక్-భువనేశ్వర్ జంట నగరాల పోలీసు కమిషనర్‌కు విశాఖపట్నానికి చెందిన పద్మరాజు రవికుమార్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఆమె తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన నుంచి ల్యాప్‌టాప్, రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు తీసుకుందని రవికుమార్ పోలీసులకు చెప్పాడు. తన నుంచి భారీగా దోచుకున్న తర్వాత చిన్మయ తన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై భువనేశ్వర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అవన్నీ తప్పుడు ఆరోపణలు: చిన్మయ
రవికుమార్ చేసిన ఆరోపణలపై నటి చిన్మయ బుధవారం భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. తాను ఎవరినీ మోసగించలేదని స్పష్టం చేశారు. రవికుమార్ తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడని, తన అభిమానిగా పరిచయం చేసుకొని క్రమంగా తనతో స్నేహం పెంచుకున్నాడని తెలిపారు. అతడు గతంలో భువనేశ్వర్‌కు వచ్చినప్పుడు తనను కలిశాడని, డబ్బులకు ఇబ్బందిగా ఉందని చెప్పడంతో రూ.లక్షన్నర నగదు ఇచ్చానని తెలిపారు. దానిలో తనకు రూ.50వేలు మాత్రమే తిరిగిచ్చాడని వెల్లడించారు. తనను పెళ్లి చేసుకుంటానని రవికుమార్ ప్రపోజ్ చేశాడని, దాన్ని నేను రిజెక్ట్ చేసి ఫ్రెండ్స్‌గా మాత్రమే ఉందామని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ కక్షతోనే తనను కొద్దిరోజులుగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, ఈ క్రమంలోనే తన పరువు తీసేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడని చిన్మయ తెలిపారు.