2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయానికి మూల కారణాల్లో ఒకరైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు అనూహ్య గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మకంగా పేర్కొనే ఫోర్బ్స్ లిస్టులో ఆయనకు చోటు దక్కింది. ప్రస్తుతం బీహార్లో జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ అరుదైన గౌరవం సంపాదించుకున్నారు.
ఈసారి ఆయనతో పాటు బీహార్ కే చెందిన కన్హయ్య కుమార్ కూడా ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో పేరు సంపాదించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రశాంత్ కిశోర్ గురించి ప్రస్తావిస్తూ ఈ దశాబ్దపు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యక్తి కానున్నారని చెప్పింది.
ఫోర్బ్స్ చెప్పినట్లే ప్రశాంత్ గత దశాబ్ద కాలంలో రాజకీయాల్లో తెర వెనుక అత్యంత కీలక వ్యక్తిగా ఎదిగారు. 2009లో అప్పటి గుజరాత్ సీఎం.. ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల వ్యూహరచన కోసం ఆయనతో పొత్తు పెట్టుకున్నారు.
ఇండియాలో ఫేస్బుక్లో ప్రచారాన్ని ప్రవేశపెట్టింది కూడా ప్రశాంత్ కిషోరే. ఇక ఆ తర్వాత అయన పంజాబ్ కాంగ్రెస్ లీడర్ అమరిందర్ సింగ్ ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కోసం కూడా పనిచేశారు.
ఇప్పుడాయన ఈ ఏడాది జరగబోయే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం – అనంతరం జరగబోయే బెంగాల్ ఎన్నికల్లో మమత బెనర్జీ కోసం పనిచేస్తున్నారు.