రెండోసారి తిరిగి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టని నేతలు

Spread the love

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడిగా గెలవడమంటే అంతతేలికైన విషయమేమీ కాదు. తమ పార్టీ అనుసరిస్తున్న విధానాలను, అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత చేయబోయే పనులను ముందుగానే అమెరికన్లకు వివరించి వారి విశ్వాసాన్ని, మనసు గెలుచుకోవాలి. 1789లో మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రస్థానంలో ఇప్పటివరకు 45మంది అధ్యక్షులు ఈ పదవిని చేపట్టారు. ప్రస్తుతం 46వ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. అయితే, ఈ 231ఏళ్ల కాలంలో వరుసగా రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన నేతలు చాలా మంది ఉండగా, కేవలం కొందరు మాత్రమే వరుసగా రెండోసారి గెలుపొందడంలో విఫలమయ్యారు. ఇలా ఇప్పటివరకు కేవలం పదిమంది మాత్రమే వరుసగా రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టలేకపోయారు.

ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వ్యక్తి, గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే పదవి చేపట్టే అవకాశం ఉంటుంది. ఇలా ఇప్పటివరకు 45మంది ఈ అధ్యక్ష పీఠాన్ని చేపట్టారు. కేవలం వీరిలో పదిమంది అధ్యక్షులు మాత్రమే రెండోసారి తిరిగి ఎన్నిక కాలేదు. అయితే, వీరిలో కొందరు చనిపోవడం కారణం కాగా, మిగతావారు మాత్రం రెండోసారి తిరిగి ఎన్నిక కావడంలో విఫలమయ్యారు. ఉదాహరణకు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ రెండోసారి అధ్యక్ష ఎన్నికల ముందే హత్యకు గురయ్యారు. అయితే, 1932 నుంచి 1976 వరకు ఎన్నికైన అధ్యక్షుల్లో ఎవ్వరూ రెండోసారి ఓటమి కాకపోవడం విశేషం.

రెండోసారి తిరిగి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టని నేతలు..

జాన్‌ అడమ్స్‌..

రెండోసారి తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికకాని నేతగా జాన్‌ అడమ్స్‌ మొదట నిలిచారు. 1789లో అమెరికా తొలి అధ్యక్షుడిగా జార్జ్‌ వాషింగ్టన్‌ ఎన్నిక కాగా జాన్‌ అడమ్స్‌ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. జార్జ్‌ వాషింగ్టన్‌ పదవి రెండుసార్లు పూర్తైన తర్వాత జాన్ అడమ్స్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తిరిగి రెండోసారి అధ్యక్ష పదవిచేపట్టలేకపోయారు.

జాన్ క్విన్సీ అడమ్స్‌..
అడమ్స్‌ కుటుంబానికే చెందిన జాన్ క్విన్సీ అడమ్స్‌ కూడా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాలేదు. అప్పట్లో ఆయన డెమొక్రాటిక్‌-రిపబ్లికన్‌ పార్టీ నుంచి గెలుపొందారు. పార్టీలో అంతర్గత సమస్యలు నెలకొనడంతో అవి ఆయన గెలుపుపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తారు. అడమ్స్‌ ఓటమి తర్వాత పార్టీ కూడా రెండుగా చీలిపోయి డెమొక్రాటిక్‌, వింగ్‌పార్టీలుగా అవతరించాయి.

మార్టిన్‌ వాన్‌ బ్యూరెన్‌
అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన మార్టిన్‌ వాన్‌ బ్యూరెన్‌ 1840ఎన్నికల్లో తిరిగి రెండోసారి గెలుపొందలేదు.

గ్రోవర్‌ క్లెవెలాండ్
1884లో డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన గ్రోవర్‌ క్లెవెలాండ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలువలేదు. కానీ, 1884లో ఒకసారి(22వ అధ్యక్షుడు), 1892లో రెండోసారి (24వ అధ్యక్షుడు) గెలుపొంది అధ్యక్ష పదవి చేపట్టారు. వరుసగా రెండుసార్లు గెలుపొందనప్పటికీ రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన నేతగా క్లెవెలాండ్‌ నిలిచిపోయారు.

బెంజమిన్‌ హ్యరీసన్‌
1888లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బెంజమిన్‌ హ్యరీసన్‌ చేతిలో గ్రోవర్‌ క్లెవెలాండ్‌ ఓడిపోగా, తర్వాత పర్యాయం జరిగిన ఎన్నికల్లో తిరిగి గ్రోవర్‌లాండ్‌ గెలుపొందడంతో బెంజమిన్‌ హ్యరీసన్‌ రెండోసారి అధ్యక్షపదవి చేపట్టలేకపోయారు.

విలియం హవార్డ్‌ టాఫ్ట్‌
రిపబ్లికన్‌ పార్టీకి చెందిన విలియం హవార్డ్‌ టాఫ్ట్‌ 1909 నుంచి 1913 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. 1912లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి తిరిగి అధ్యక్షుడిగా గెలువలేకపోయారు. అయితే, అమెరికా అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన టాఫ్ట్‌ అధ్యక్ష పదవిని చేపట్టిన వ్యక్తిగా అమెరికా చరిత్రలో నిలిచిపోయారు.

హెర్బర్ట్‌ హూవర్‌
1928లో అమెరికా అధ్యక్షుడిగా హెర్బర్ట్‌ హోవర్‌ ఎన్నికయ్యారు. 1932లో జరిగిన ఎన్నికల్లో తిరిగి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకోలేక పోయారు. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ చేతిలో హెర్బర్ట్‌ ఓటమిపాలయ్యారు.

గెరాల్డ్‌ ఫోర్డ్‌
రిపబ్లికన్‌ పార్టీకి చెందిన గెరాల్డ్‌ ఫోర్డ్‌ 1974 నుంచి 1977 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన కూడా ఒక్కసారే పదవిలో ఉన్నారు. అయితే, గెరాల్డ్‌ ఫోర్డ్‌ ఎన్నికల్లో పోటీచేయకుండానే అధ్యక్ష పదవిని చేపట్టారు. అధ్యక్షుడిగా ఉన్న రిచార్డ్‌ నిక్సన్‌పై అప్పట్లో ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో గెరాల్డ్‌ ఫోర్డ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో గెరాల్డ్‌ ఎన్నిక కాలేదు.

జిమ్మీ కార్టర్‌
డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన జిమ్మీ కార్టర్‌ 1977 నుంచి 1981 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తిరిగి గెలువలేదు. దీంతో అంతకుముందు గెరాల్డ్‌ ఫోర్డ్‌తోపాటు జిమ్మీ కార్టర్‌లు తిరిగి రెండోసారి పదవి చేపట్టకపోవడం వరుసగా జరిగింది.

జార్జ్‌ హెచ్‌. డబ్ల్యూ. బుష్‌
అమెరికాకు 41వ అధ్యక్షుడిగా జార్జ్ హెచ్‌ డబ్ల్యూ బుష్‌ సేవలందించారు. 1992లో జరిగిన ఎన్నికల్లో జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ రెండోసారి అధ్యక్షుడిగా పోటీచేసి విఫలమయ్యారు. బిల్‌క్లింటన్‌ చేతిలో బుష్‌ ఓడిపోయారు. ఆయన కుమారుడైన జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ మాత్రం రెండు పర్యాయాలు (2001 నుంచి 2009) అధ్యక్ష పదవిని విజయవంతంగా చేపట్టారు.

బుష్‌ తరువాత వచ్చిన బరాక్‌ ఒబామా కూడా రెండుసార్లు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం డొనాల్డ్‌ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా రెండోసారి అధ్యక్ష పీఠానికి ఎన్నికయ్యే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జో బైడెన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *