*ఒక్కరోజులో లక్షా 80 వేల కేసులు..!* జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకీ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. శనివారం ఆదివారం మధ్య 24 గంటల వ్యవధిలో ఏకంగా లక్షా 83 వేల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా బ్రెజిల్‌లో 54,771 కేసులు వెలుగులోకి రాగా.. అమెరికాలో 36,617, భారత్‌లో 15,413 కేసులు నమోదయ్యాయి. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచడం, లాక్‌డౌన్ ఎత్తివేస్తుండడంతో వ్యాప్తి వేగంగా జరుగుతుండడం వంటి కారణాల వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 87,08,008 కేసులు నమోదయ్యాయి. అలాగే 4,61,715 మంది మృతిచెందారు. వీరిలో కొత్తగా 4,743 మంది ఆదివారంతో ముగిసిన 24 గంటల వ్యవధిలోనే మరణించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కొత్తగా నమోదైన మరణాల్లో మూడో వంతు అమెరికా ఖండాల్లోని దేశాల నుంచే నమోదైనట్లు వెల్లడించింది. *స్పెయిన్ ప్రజలకు లాక్‌డౌన్ విముక్తి..* స్పెయిన్‌లో మార్చి 14న విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పూర్తిగా తొలగించింది. దేశంలో ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు అనుమతిచ్చింది. అలాగే బ్రిటన్ సహా 26 ఇతర ఐరోపా దేశాలకు చెందిన పర్యాటకులకు 14 రోజుల క్వారంటైన్ నిబంధనను తొలగించింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని పెడ్రో శాంఛెజ్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం జారీ చేసిన అన్ని నియమ నిబంధనల్ని పాటించాలని కోరారు. వైరస్ రెండో విడత విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంగ్లాండ్‌లో ఇంకా అక్కడక్కడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రజలు వారాంతపు వినోదాలకు దూరంగా ఉంటున్నారు. జర్మనీలో ఓ మాంసపు ప్యాకింగ్ ప్లాంట్‌లో 1000 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో ఉండే 6,500 మంది క్వారంటైన్‌లో ఉంచారు. *బ్రెజిల్‌లో 50 వేలు దాటిన మరణాలు..* అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు జాన్ హాప్‌కిన్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బ్రెజిల్‌లో మొట్టమొదటిసారి ఒక్క రోజు వ్యవధిలో 50 వేలకు పైగా కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇక అక్కడ మృతుల సంఖ్య 50వేలు దాటింది. అమెరికా తర్వాత మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నది ఇక్కడే. అయినా వైరస్ కట్టడి చర్యల్ని అమలు చేయడంలో అధ్యక్షుడు జైల్ బోల్సోనారో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. *కేసులు పెరుగుతున్నా.. ఆంక్షల సడలింపు..* దక్షిణాఫ్రికాలో కొత్తగా ఐదు వేల కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ.. అధ్యక్షుడు సిరిల్ రామఫొసో మాత్రం నిబంధనల్ని సడలిస్తూనే ఉన్నారు. క్యాసినో, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు ఆదివారం అనుమతించారు. సోమవారం ఉదయానికి అక్కడ 97,302 కేసులు నమోదుకాగా.. 1,930 మంది ప్రాణాలు కోల్పోయారు. *అమెరికాలో కొనసాగుతున్న వ్యాప్తి…* అమెరికాలో వైరస్ వ్యాప్తి ఇంకా ఉద్ధృతంగానే కొనసాగుతోంది. ఒక్క అరిజోనా రాష్ట్రంలోనే 3,100 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అమెరికాలో 23,11,345 కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో ఆదివారం అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు చేస్తేనే కేసుల సంఖ్య పెరగుతోందని.. ఈ నేపథ్యంలో నిర్ధారణ పరీక్షల సంఖ్యను తగ్గించాని అధికారులకు సూచించామన్నారు. ఇది ఆ దేశంలో తీవ్ర విమర్శలకు దారితీసింది. *చైనా, దక్షిణ కొరియాలో కొత్త కేసులు..* ఇక ఆసియాలో చైనా, దక్షిణ కొరియాలో ఆదివారం కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం చైనాలో 25 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 22 బీజింగ్ నుంచే ఉండడం గమనార్హం. దక్షిణ కొరియాలో ‘డోర్-టు-డోర్’ సేవలందించే ఓ కంపెనీ ఉద్యోగుల్లో 200 మంది కరోనా నిర్ధారణ అయ్యింది. అలాగే ఓ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులోనూ 70 మంది వైరస్ సోకినట్లు తేలింది.