ఇతర మార్గాలలో ఆదాయ వనరులను పెంపొందించుకుంటూ…. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించాలన్నది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయంగా అధికారులు పేర్కొంటున్నారు. దీని లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేపడతామని నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.దీంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల గుండెల్లో గుబులు ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ లోని వేలాది గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తొలివిడతగా బెల్టు షాపులను రద్దు చేస్తామని, ఆ తర్వాత మద్యం షాపులపై నియంత్రణ అమలు చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉందని, దీని నుంచి బయట పడేందుకు మద్యం అమ్మకాలను మరింత పెంచాలని తెలుగుదేశం ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఆదేశాలతో రాష్ట్రంలోని వేలాది గ్రామాలలో బెల్ట్ షాపులు అవతరించాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కొందరు సీనియర్ కార్యకర్తలకు బెల్టు షాపుల నిర్వహణను అనధికారికంగా అప్పగించారు. దీంతో గ్రామాలలో మద్యం ఏరులై పారింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న బెల్టుషాపుల ఎత్తివేత నిర్ణయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొందరు నాయకులకు ఆశనిపాతంలా మారిందంటున్నారు.
బెల్టు షాపుల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన తెలుగు తమ్ముళ్లకు ఇకనుంచి ఆ ఆదాయం రాకపోవడం వారిని ఇబ్బందుల పాలు చేస్తుందని అంటున్నారు. అయితే బెల్టుషాపుల రద్దు నిర్ణయం మాత్రం ప్రజల్లో ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయాన్ని కలుగజేస్తుందని చెబుతున్నారు.
🎊మహిళలు జేజేలు:
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి జేజేలు పలుకుతున్నారని అంటున్నారు.