కార్ల గురించి ఈ మధ్య వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఆటో ఎక్స్‌పోలలో ఎక్కడ చూసినీ ఎలక్ట్రిక్ కార్ల సందడే కనిపిస్తోంది.
అమెరికాలో టెస్లా మొదలుకొని, భారత్‌లో మహీంద్రా, టాటా వరకూ… ఆటోమొబైల్ సంస్థలన్నీ ఎలక్ట్రిక్ కార్ల జపం చేస్తున్నాయి.
కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నాయి.
ఈ కార్లను కొనుక్కుంటే ఇక పెట్రోల్, డీజీల్‌కు పైసా పెట్టక్కర్లేదు. కాలుష్యమూ ఉండదు.
డబ్బును, పర్యావరణాన్ని ఒకేసారి పరిరక్షించుకోవచ్చన్న ఉద్దేశంతో చాలా మంది వీటిని సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే, ఈ కార్ల విషయంలో చాలా మంది అనేక సందేహాలున్నాయి.
ఈ కార్లతో నిజంగానే డబ్బు ఆదా అవుతుందా? ఎక్కువ ధర పెట్టాల్సి వస్తుందా? ఎంత సేపట్లో చార్జింగ్ అవుతాయి? చార్జింగ్ పాయింట్లు అంతటా ఉంటాయా? అసలు ఇవి నిజంగానే పర్యావరణహితమైనవేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు.
వాటికి ఇప్పుడు సమాధానాలు వెతుక్కుందాం.
బ్యాటరీల వల్లే ఎక్కువ ధరలు
పూర్తిగా విద్యుత్‌తో నడిచే కార్ల ధరలు సాధారణంగా ఎక్కువగానే ఉంటాయి. అందుకు కారణం వాటిలో ఉండే బ్యాటరీలే.
ఎలక్ట్రిక్ కారు తయారీకయ్యే వ్యయంలో గణనీయమైన భాగం బ్యాటరీకే వెళ్తుంది.
అయితే, బ్యాటరీ ధరలు పడిపోతూ వస్తున్నాయి.
బ్లూమ్‌బెర్గ్ ఎన్ఈఎఫ్ నివేదిక ప్రకారం.. 2015లో ఒక ఎలక్ట్రిక్ కారుకు అయ్యే మొత్తం వ్యయంలో 57.1 శాతం బ్యాటరీకే ఖర్చయ్యేది. ఆ మరుసటి ఏడాది అది 50.8 శాతానికి తగ్గింది.
2017లో 41.6 శాతం, 2018లో 36.2 శాతం, 2019లో 33.1 శాతం.. ఈ ఏడాది 30.3 శాతానికి బ్యాటరీకయ్యే వ్యయం తగ్గిపోయింది.
రాబోయే ఐదేళ్లు కూడా ఇలాగే బ్యాటరీ వ్యయం తగ్గిపోతుందని బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసింది. 2025కి కారుకు అయ్యే మొత్తం ఖర్చులో బ్యాటరీ వాటా 20.2 శాతానికి చేరుతుందని లెక్కగట్టింది.
బ్యాటరీలకు అయ్యే ఖర్చు తగ్గితే, వచ్చే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్ల ధరలు కూడా మరింత తగ్గుతూ పోయే అవకాశం ఉంది. పెట్రోల్, డీజీల్ వాహనాల ధరల స్థాయికి ఇవి చేరుకోవచ్చు కూడా.
చార్జింగ్ సమయాలు తగ్గుతున్నాయి
కారును ఎంతసేపట్లో పూర్తి చార్జింగ్ చేయగలమన్నది చాలా ముఖ్యం.
ప్రస్తుతం పూర్తి చార్జింగ్ కోసం 30 నిమిషాలు మొదలుకొని 24 గంటలకుపైగా సమయం తీసుకునే కార్లు కూడా ఉన్నాయి.
బ్యాటరీ పరిమాణం, కారు రకం, ఎలాంటి చార్జింగ్ పాయింట్‌ను వినియోగిస్తున్నారన్న అంశాలపై ఈ చార్జింగ్ సమయం ఆధారపడి ఉంటుంది.
భవిష్యత్తులో చార్జింగ్ సమయాలు తగ్గడం దాదాపుగా ఖాయం.
లగ్జరీ కార్లను తయారు చేసే పోర్షే సంస్థ ఇప్పుడు ఓ 450 కిలోవాట్ల చార్జింగ్ స్టేషన్‌ను పరీక్షిస్తోంది. దీని ద్వారా నిమిషాల వ్యవధిలోనే కారును పూర్తిగా చార్జింగ్ చేసే అవకాశం ఉండొచ్చు.
టాటా ఇటీవల నెక్సాన్ ఈవీ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ కారు 60 నిమిషాల్లో సున్నా నుంచి ఎనభై శాతం చార్జింగ్ నింపుకోగలదని ఆ సంస్థ ప్రకటించింది. అయితే, ఆ తర్వాతి 20 శాతం నిండుకోవడానికి ఇంకో ఎనిమిది గంటల దాకా సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.
ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 312 కి.మీ.లు ప్రయాణించవచ్చని టాటా సంస్థ తెలిపింది.
చార్జింగ్ స్టేషన్లు పెరగాలి
చార్జింగ్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చన్న సందేహం కూడా జనాల్లో ఉంది.
నెక్సాన్ ఈవీని కొన్నవారి ఇంట్లో ఉచితంగా చార్జింగ్ సిస్టమ్‌ను బిగిస్తామని టాటా సంస్థ ప్రకటించింది.
బహిరంగ ప్రాంతాల్లో చార్జింగ్ కోసం నెట్‌వర్క్‌ను కూడా ఆ సంస్థ ఏర్పాటు చేస్తోంది.
ఇంట్లో చార్జింగ్ సదుపాయం అందుబాటులో లేనివారి కోసం పెట్రోల్ బంకుల్లాగే బహిరంగ ప్రాంతాల్లో ఇలాంటి చార్జింగ్ పాయింట్లు రావడం అవసరం.
ఇవి ఎక్కువ సంఖ్యలో రావాల్సి ఉంది. చార్జింగ్ పాయింట్లు తక్కువగా ఉంటే, జనాలు వాటి కోసం ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ పాయింట్ల వద్ద వాహనాల రద్దీ కూడా పెరుగుతుంది.
చార్జింగ్ స్టేషన్ల నెలకొల్పనను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు విధానాలను తీసుకువస్తున్నాయి.