దంచేసి దర్జాగా* *క్వాలిఫయర్‌-1లో దిల్లీ చిత్తు చిత్తు

Spread the love

*దంచేసి దర్జాగా*

*క్వాలిఫయర్‌-1లో దిల్లీ చిత్తు చిత్తు* *ఐపీఎల్‌-13 ఫైనల్లో ముంబయి* *మెరిసిన సూర్య, కిషన్‌*

*నిప్పులు చెరిగిన బుమ్రా, బౌల్ట్‌* _మామూలు ఆధిపత్యం కాదది. బ్యాటుతో పెను విధ్వంసం.. బంతితో వీర విజృంభణం. టైటిల్‌ నిలబెట్టుకునే దిశగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మరో అడుగు ముందుకేసింది. కాస్తయినా కనికరం లేకుండా విరుచుకుపడ్డ ముంబయి ఇండియన్స్‌.. దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు  చిత్తుగా ఓడిస్తూ అలవోకగా ఐపీఎల్‌-13 ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఒడుదొడుకులు ఎదురైనా తమ బ్యాటింగ్‌ బలాన్ని చాటుతూ మొదట భారీ స్కోరు సాధించిన ముంబయి.. బౌలింగ్‌ వాడిని చూపిస్తూ దిల్లీని హడలెత్తించింది. సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పరుగుల వరద పారిస్తే.. బుమ్రా, బౌల్ట్‌ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లేకుండా చేశారు. ముంబయి ఆధిపత్యానికి దాసోహమన్న దిల్లీకి ఫైనల్‌ చేరుకునేందుకు ఇంకో అవకాశముంది._ నాలుగుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం   క్వాలిఫయర్‌-1లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రోహిత్‌ జట్టు 57 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై ఘనవిజయం సాధించింది. ఇషాన్‌ కిషన్‌ (55 నాటౌట్‌; 30 బంతుల్లో 4×4, 3×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (51; 38 బంతుల్లో 6×4, 2×6), హార్దిక్‌ పాండ్య (37 నాటౌట్‌; 14 బంతుల్లో 5×6) రెచ్చిపోవడంతో మొదట ముంబయి 5 వికెట్లకు 200  పరుగులు సాధించింది. బుమ్రా (4/14), బౌల్ట్‌ (2/9) ధాటికి  విలవిల్లాడిన దిల్లీ.. 8 వికెట్లకు  143 పరుగులే చేయగలిగింది.   స్టాయినిస్‌ (65; 46 బంతుల్లో 6×4, 3×6) టాప్‌ స్కోరర్‌. *దిల్లీపై బుమ్రాస్త్రం..:* లక్ష్యం పెద్దదే అయినా.. ఇటీవల ఛేదన జట్లకు కలిసొస్తున్న నేపథ్యంలో దిల్లీ అవకాశాలపై సానుకూలంగానే ఉన్నారంతా. కానీ ఆ జట్టు స్పందన ఘోరం. కనీస స్థాయిలోనైనా ప్రతిఘటించకుండానే చేతులెత్తేసింది. పవర్‌ప్లే అయినా ముగియకముందే బ్యాట్లేత్తేసింది. ఏ జట్టూ కలలో కూడా కోరుకోని ఆరంభం దిల్లీది. ఛేదన ఇలా ఆరంభమైందో లేదో అలా ఆ జట్టు పతనం మొదలైంది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగూ చేరకుండానే ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాటపట్టారు. *బౌలింగ్‌ దాడిని ఆరంభించిన బౌల్ట్‌..* ఓపెనర్లు పృథ్వీ షా, రహానెను ఔట్‌ చేశాడు. ఆ ఓవర్‌ మెయిడెన్‌. ఆ షాక్‌ నుంచి తేరుకోకముందే దిల్లీకి మరో షాక్‌. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో బుమ్రా కళ్లు చెదిరే యార్కర్‌తో ధావన్‌ను బౌల్డ్‌ చేశాడు. బుమ్రా తన తర్వాతి ఓవర్లో శ్రేయస్‌ (12)ను ఔట్‌ చేయడంతో దిల్లీ  20/4తో పరాజయ బాటలో పయనించింది. పంత్‌ (3) కూడా ఆ జట్టును ఆదుకోలేకపోయాడు. ఎనిమిదో ఓవర్లో అతడు అయిదో వికెట్‌గా ఔటయ్యేటప్పటికి స్కోరు 41 మాత్రమే. ఆ దశలో దిల్లీ ఓటమి లాంఛనమే.  అక్షర్‌ పటేల్‌ (42; 33 బంతుల్లో 2×4, 3×6)తో కలిసి స్టాయినిస్‌ కాస్త పోరాడడంతో ఓటమి అంతరాన్ని ఆ జట్టు తగ్గించుకోగలిగింది. 15వ ఓవర్లో పొలార్డ్‌ 15 పరుగులు ఇవ్వడంతో దిల్లీ 112/5తో నిలిచింది. భాగస్వామ్యం ప్రమాదకరంగా పరిణమిస్తుండటంతో రోహిత్‌ వెంటనే తన తురుపుముక్క బుమ్రాకు బంతినిచ్చేశాడు. అతడు చకచకా స్టాయినిస్‌, సామ్స్‌ను ఔట్‌ చేయడంతో మిగతా ఆట లాంఛనమే అయింది. గాయం కావడంతో బౌల్ట్‌ మళ్లీ బౌలింగ్‌ చేయలేదు. *దంచేశారు..:* ఛేదించే జట్టుకు పరిస్థితులు విపరీతంగా అనుకూలిస్తున్న నేపథ్యంలో టాస్‌ గెలిచిన దిల్లీ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రోహిత్‌ (0)ను ఖాతా తెరవనివ్వకుండానే అశ్విన్‌ వెనక్కి పంపాడు. అయితే మరో ఓపెనర్‌ డికాక్‌ (40;   25 బంతుల్లో 5×4, 1×6) సూపర్‌ ఫామ్‌ను కొనసాగించడంతో దిల్లీకి కష్టాలు మొదలయ్యాయి. సూర్యకుమార్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఎనిమిదో ఓవర్లో అశ్విన్‌ బౌలింగ్‌లో డికాక్‌ ఔటయ్యేటప్పటికి స్కోరు 78.  ఆ తర్వాత స్కోరు వేగం తగ్గినా.. ఇషాన్‌ కిషన్‌తో కలిసి సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌ను నడిపించడంతో 11.4 ఓవర్లలో 100/2తో నిలిచింది ముంబయి. కానీ వరుస ఓవర్లలో సూర్యను నార్జ్‌, పొలార్డ్‌ను అశ్విన్‌ ఔట్‌ చేయడంతో ముంబయి భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడ్డట్లయింది. 14 ఓవర్లకు స్కోరు 108/4. కానీ గేర్‌ మార్చిన ఇషాన్‌ కిషన్‌ ఎడాపెడా బౌండరీలు బాది ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. ఆఖర్లో ముంబయి మామూలుగా విరుచుకుపడలేదు. దూకుడు మీదున్న కిషన్‌కు తోడైన హార్దిక్‌ పాండ్య వీర విధ్వంసం సృష్టించడంతో చివరి మూడు ఓవర్లలో ఏకంగా 55 పరుగులు రాబట్టింది. హార్దిక్‌ అయిదు సిక్సర్లు బాదడం విశేషం. *ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌* : డికాక్‌ (సి) ధావన్‌ (బి) అశ్విన్‌ 40; రోహిత్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 0; సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) సామ్స్‌ (బి) నార్జ్‌ 51; ఇషాన్‌ కిషన్‌ నాటౌట్‌ 55; పొలార్డ్‌ (సి) రబాడ (బి) అశ్విన్‌ 0; కృనాల్‌ (సి) సామ్స్‌ (బి) స్టాయినిస్‌ 13; హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 37; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200; *వికెట్ల పతనం* : 1-16, 2-78, 3-100, 4-101, 5-140; *బౌలింగ్‌* : సామ్స్‌ 4-0-44-0; అశ్విన్‌ 4-0-29-3; రబాడ 4-0-42-0; అక్షర్‌ పటేల్‌ 3-0-27-0; నార్జ్‌ 4-0-50-1; స్టాయినిస్‌ 1-0-5-1 *దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌:* పృథ్వీ షా (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 0; ధావన్‌ (బి) బుమ్రా 0; రహానె ఎల్బీ (బి) బౌల్ట్‌ 0; శ్రేయస్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 12; స్టాయినిస్‌ (బి) బుమ్రా 65; పంత్‌ (సి) సూర్యకుమార్‌ (బి) కృనాల్‌ 3; అక్షర్‌ పటేల్‌ (సి) రాహుల్‌ చాహర్‌ (బి) పొలార్డ్‌ 42; సామ్స్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 0; రబాడ నాటౌట్‌ 15; నార్జ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143; *వికెట్ల పతనం:* 1-0, 2-0, 3-0, 4-20, 5-41, 6-112, 7-112, 8-141; *బౌలింగ్‌:* బౌల్ట్‌ 2-1-9-2; బుమ్రా 4-1-14-4; కృనాల్‌ 4-0-22-1; కౌల్టర్‌నీల్‌ 4-0-27-0; పొలార్డ్‌ 4-0-36-1; రాహుల్‌ చాహర్‌ 2-0-35-0 *దిల్లీని ఢీకొట్టేదెవరు?* * చివరి నాలుగు మ్యాచ్‌ల్లో బెంగళూరు ఓడిపోగా.. వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గి విశ్వాసంతో ఉంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. * లీగ్‌ దశలో పరస్పరం తలపడిన మ్యాచ్‌ల్లో బెంగళూరు, హైదరాబాద్‌ చెరొకదాంట్లో గెలుపొందాయి. *తొలిసారి వరుసగా…* _ముంబయి ఐపీఎల్‌లో వరుస సీజన్‌లలో ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2010, 2011, 2012, 2013… 2018, 2019) తర్వాత వరుసగా రెండు సీజన్‌లలో ఫైనల్‌ చేరిన జట్టుగా ముంబయి నిలిచింది. మొత్తం మీద ఆరోసారి ముంబయి తుదిపోరుకు అర్హత సాధించింది. తొలిసారి 2010లో ఫైనల్‌ చేరిన ఆ జట్టు.. 2013, 2015, 2017, 2019లలో టైటిల్‌ గెలిచింది._

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *