ఎగుమతి నిలిపివేసిన టర్కీ.. మళ్లీ సామాన్యులకు ఉల్లి కష్టాలు?

Spread the love

గత నాలుగు నెలల నుంచి ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఉల్లికోసం సామాన్యులు పడిన పాట్లు వర్ణనాతీతం. గతంలో ఎన్నడూలేని విధంగా కిలో ఉల్లి రూ.180 నుంచి రూ.200 వరకు పలకడంతో ఉల్లి వాడకాన్ని పక్కనబెట్టే పరిస్థితి ఎదురయ్యింది. అయితే, కేంద్రం తీసుకున్న చర్యలతోపాటు కొత్త పంట మార్కెట్‌లోకి రావడంతో ఉల్లిధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు కాస్త ఊపిరిపీల్చుకుంటుండగా ఈ అనందం మూణ్ణాల ముచ్చటలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఉల్లి మళ్లీ ఘాటెక్కి, ధరలు 10 నుంచి 15 శాతం మేర పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి.

దీనికి టర్కీ నుంచి వచ్చే దిగుమతులు నిలిచిపోవడమే ప్రధాన కారణం. అకాల వర్షాలతో దేశవ్యాప్తంగా ఉల్లి పంట ఉత్పత్తి అమాంతం పడిపోయింది. దీంతో దేశీయంగా ఉల్లికి భారీ డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగిపోయింది. రాయితీతో ప్రభుత్వం అందజేసిన ఉల్లికోసం జనం గంటల కొద్దీ కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడినా దొరకని పరిస్థితి ఎదురయ్యింది. దీంతో ధరలను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన కేంద్రం.. తొలుత ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. అయినా తగ్గుముఖం పట్టకపోవడంతో అఫ్గనిస్థాన్, టర్కీ, ఈజిప్టు లాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతులు చేపట్టింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 7,070 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోగా.. ఇందులో 50 శాతం టర్కీ నుంచి వచ్చిందేనని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. కానీ, ఎగుమతుల కారణంగా టర్కీలో కూడా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆ దేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ధరలు అమాంతం పెరిగిపోవడంతో టర్కీ కూడా భారత్ లాగే ఎగుమతులను నిలిపివేసిందని నాసిక్‌కు చెందిన హోల్‌సేల్‌ ఏజెంట్‌ సురేశ్ దేశ్‌ముఖ్ తెలిపారు. దీంతో ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడే అవకాశముంది. ఎందుకంటే దేశీయంగా పండిన ఉల్లి ఇప్పుడే మార్కెట్లోకి రాదని, అప్పటిదాకా ధరలు పెరిగే అవకాశమున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ఒకసారి దేశీయంగా ఉల్లి పంట అందుబాటులోకి వస్తే ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని అంటున్నారు. మరోవైపు, ధరలు పెరడగంతో దేశంలో ఉల్లి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వ్యవసాయ నివేదిక ప్రకారం.. గత సీజన్‌లో 2.31 లక్షల హెక్టార్లలో ఉల్లిని సాగు చేయగా, నవంబరు చివరినాటికి ఇది 2.78 లక్షలకు చేరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గిట్టుబాటు కావడంతో ఉల్లి పండించడానికి రైతులు ఆసక్తిచూపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *