సామాన్యుడిని బెంబేలెత్తించిన ఉల్లి ధరలు తగ్గనున్నాయి. విదేశాల నుంచి ఉల్లి దిగుమతులు మరో వారంలో భారత్ చేరనున్నాయి. సంక్రాంతి నాటికి ఉల్లి ధరలు అందుబాటులోకి వస్తాయి
భారీగా పెరిగిన ఉల్లి ధరలు వినియోగదారులను బెంబేలెత్తించాయి. ఓ దశలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.150కి చేరిందంటే.. ఉల్లి కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉల్లి సాగు విస్తీర్ణాన్ని రైతులు తగ్గించుకోవడంతోపాటు.. ఈ పంట పండడే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పంట దిగుబడి తగ్గింది. ఫలితంగా డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతు బజార్ల ద్వారా.. డిస్కౌంట్ ధరకు సరఫరా చేస్తున్న కిలో ఉల్లి కోసం జనం ఎగబడుతున్నారు.
ఉల్లి ధర ఎప్పుడెప్పుడు తగ్గుతుందా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మార్కెట్లోకి సరఫరా పెరగడంతో వచ్చే నెలలో ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ నాటికి హోల్‌సేల్ మార్కెట్లలో రూ.20-25కే కిలో ఉల్లి లభించే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ఉన్న ధరల కంటే అది 80 శాతం తక్కువ కావడం గమనార్హం. ఇప్పటికి చాలా చోట్ల హోల్‌సేల్‌గానే కిలో రూ.80 చొప్పున ఉల్లి ధరలను అమ్ముతున్నారు. గత జూన్-జులైలో ఇది రూ.15 మాత్రమే.
మనదేశంలో అవసరాలకు మించి ఉల్లి సాగు అవుతుంది. కానీ ఈ పంట పండే ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గింది. దీంతో ధరలు పెరిగాయి. ధరల నియంత్రణ కోసం కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. భారీ ఎత్తున ఉల్లిని నిల్వ చేయడంపై నిషేధం విధించింది. టర్కీ తదితర దేశాల నుంచి దిగుమతులను పెంచింది. కానీ టర్కీ నుంచి వచ్చే 12,500 టన్నుల ఉల్లి దిగుమతులు డిసెంబర్ 27న భారత్ చేరే అవకాశం ఉంది. అవి అందుబాటులోకి వస్తే ధరలు తగ్గడం ప్రారంభం అవుతుంది.